నా 14వ ఏట, నా స్నేహితుడి ఇంట్లో ఉన్న పావురాలు నాకు చాల నచ్చాయి. పావురాలు కోసం నా స్నేహితుడు, వాళ్ళ ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టుకి డబ్బాలు అమర్చాడు (వాటికి గూడు లాగ). ఆ చెట్టుపైన పావురాలు చాల ఉండేవి. అవి ఎంత దూరం ఎగిరినా తిరిగి మల్లి వాడి ఇంటికి చేరేవి.
మా నాన్నగారిని ఒప్పించి ఒక జత పావురాలని (చిన్న పిల్లలు) మా ఇంటికి తెచ్చాను. అందులో ఒక నల్లని పావురం (పేరు Blacky), ఇంకొకటి తెల్లని పావురం (పేరు Whitey). వాటి కోసం చెక్కతో చిన్న ఇల్లు నా పాకెట్ మనీ తో కట్టించాను. Blacky , Whitey ని మా ఇంట్లోనే పెంచాను. అవి మెల్లగా ఇంట్లో ఎగరడం నేర్చుకున్నాయి. నేను ఇంట్లో చేయి చాపితే, నా చేతి మీదకు వచ్చి వాలేవి. కొన్ని రోజుల తరువాత బయట ఎగరడం, యెగిరి నా చేతి మీదకు వచ్చి వాలడం చేసేవి. ఒక రోజు పిల్లి వల్ల whitey చనిపోయింది, Blacky కి పెద్ద గాయం. నా కంట్లో నీళ్లు, తర్వగా ఆసుపత్రికి తీసుకువెళ్లడం తో బ్రతికింది. కొన్ని రోజులు Blacky చక్కగా నాతో ఆడుకుంది. ఒక రోజు ఏమైందో తెలియదు గాని మా ఇంటికి రాలేదు.
కొన్ని రోజుల తరువాత నా స్నేహితుడు, నీ బ్లాకీ నా దగ్గర ఉన్న ఒక పావురం తో జత కట్టింది అని , అక్కడే కాపురం ఉంటుందని చెప్పాడు. నాకు బాగా ఏడుపు వచ్చింది. ఇంత మంచి ఇల్లు పెట్టుకుని అక్కడ వాడి దగ్గర డబ్బాల్లో ఉండవలసిన కర్మ ఏమి వచ్చింది అని కుంగిపోయాను (చిన్న వాడిని కనుక). ఆలా Blacky నన్ను వదిలి వెళ్లిపోయింది!
నా 14వ ఏట, నా ప్రేమ (పెంచిన ప్రేమ) ఓడిపోయింది, Blacky ప్రేమ గెలిచింది! పెంచిన ప్రేమ, ప్రియుడి/ప్రియురాలి ప్రేమ రెండు ప్రకృతి నుండి పుట్టినవే! ఇందులో ఏది గొప్ప అన్న ప్రశ్నకు సమాధానం చాల కష్టం. “కానీ వయసు వచ్చినప్పుడు, ప్రేమికుడితో స్వేచ్ఛగా ఎగరడం కూడా ప్రకృతి నుండి వచ్చిందే కదా”. దాన్ని గౌరవించాలి అనిపించింది! నేను కూడా Blacky కి స్వేచ్ఛ నిచ్చేసా.