మన పక్క వీధిలో సారమ్మ చనిపోయింది రఘుమామ, కాస్త అ సూరిగాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో, మన పంచాయతీ బండలో 60 గంటలు కొట్టారు. పాపం 60 ఏళ్లకే కాలం చేసింది సారమ్మ, మనవళ్ళు పెళ్లి చూసుకోలేకపోయింది అని రఘుమామతో చెప్పింది లక్ష్మి.
రాయుడి గారి పని మీద సూరిగాడు పొద్దునే పట్నంకి వెళ్ళాడు లక్ష్మి, ఇంకో గంటలో వచ్చేతాడులే, రాగానే అటు దిక్కు పంపిస్తా అని లక్ష్మితో అన్నాడు రఘుమామ.
రఘుమామ ఊళ్ళో పెద్ద మనిషి, తల్లిదండ్రులు లేని సూరిగాడిని ఏ రక్త సంబంధం లేకపోయినా పెంచాడు.
సూరిగాడు పట్నం నుండి రానే వచ్చాడు. వచ్చిన వెంటనే సారమ్మ అంతిమ యాత్రకు కావాల్సిన పనులన్నీ చేసి సారమ్మను ఊర్లోవాళ్ళతో కలిసి కాటికి మోసుకెళ్లాడు సూరిగాడు. ఈ సూరిగాడు లేకపోతే మన ఊర్లో సగం పనులు ఎవరు చేస్తారు రఘుమామ అని అంటూ అ ఊరు పెసిడెంట్ సూరిగాడిని ఆకాశానికి ఎత్తాడు.
మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ కు లక్ష్మి హోటల్ వైపు బయలుదేరారు రఘుమామ సూరిగాడు. దారిలో సూరిగాడిని చూసిన శాంతమ్మ, ఒరేయ్ సూరిగా మధ్యాహ్నం కట్టెలకు పోవాలి కొంచెం సాయం చేద్దువు నీకు పుణ్యం ఉంటది అని అనగానే సూరిగాడు అట్టాగే శాంతమ్మ అత్త, ఒంటి గంట దాటాక వత్తాలే అని చెప్పాడు.
లక్ష్మి హోటల్ కు చేరుకోగానే రెండు ప్లేట్లు ఇడ్లిలు తెచ్చిన లక్ష్మి, ఏంటి రఘుమామ మన సూరిగాడికి ఇక పెళ్లి చేయవా? ఎన్ని రోజులు ఇలా గాలికి తిప్పుతావ్. వాడికి ఏమి తక్కువ? కాస్త నలుపు గాని మనస్సు వెన్న కదా? అని అంది.
సాయంత్రం శాంతమ్మ అత్త దగ్గర కట్టెలు పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన సూరిగాడితో రఘుమామ ఒరేయ్ సూరిగా నీకు పెళ్లి సంబంధం సూత్తాను రా, ఎన్ని రోజులని ఇలా ఉంటావ్ అని అనగానే సూరిగాడు, నీ ఇట్టం రఘుమామ అని చెప్పి పంచాయితీలో పెసిడెంట్ గారికి ఏదో పని ఉంటె సాయం చేయడానికి బయలుదేరాడు.
రఘుమామ సూరిగాడికి పెళ్లి సంబంధం అడుగుదామని తిన్నగా శాంతమ్మ అత్త దగ్గరకే వెళ్ళాడు. సూరిగాడికి నీ కూతుర్ని ఇత్తావా శాంతమ్మ అని అడగగానే, ఏందీ నా కూతుర్ని ఆ కర్రోడికి ఇస్తానా? బలేవాడివి రఘుమామ, మా అమ్మాయికి పట్నం సంబంధం చూస్తున్నాం అని చెప్పి రఘుమామను వెన్నకు పంపింది అ శాంతమ్మ. రఘుమామ మనస్సులో, ఎన్ని సార్లు సూరిగాడ్ని వాడుకుందో ఈ శాంతమ్మ, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ పక్కవీధిలో ఉన్న రావు గారిని కలవడానికి వెళ్ళేడు.
సూరిగాడికి మీ కూతుర్ని అనుకుంటున్నాం రావుగారు అని రఘుమామ అడగ్గానే, ఏందీ రఘుమామ, సూరిగాడికి నా కూతురు నా? పక్కూర్లో సుబ్బారావు గారి అబ్బాయి, ఎర్రగా, పొడుగ్గా ఉంటాడు కదా, మంచి ఆస్తి కూడా ఉంది, పైగా పెద్ద కుటుంబం. అ సంబంధం అనుకుంటున్నాం అని అనగానే రఘుమామ తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాడు .
ఇలా రఘుమామ ఒక నెలంతా ప్రయాస పడ్డాడు. సూరిగాడికి అ ఊళ్ళో ఎవ్వరు పిల్లని ఇవ్వలేదు. సూరిగాడికి ఈ విషయం తెలిసి కన్నీళ్లు ఆగలేదు. అ నెలంతా ఏడుస్తూనే వున్నాడు సూరిగాడు. సూరిగా అ పెసిడెంట్ నిన్ను కేకేస్తున్నాడు రా, ఏదో పనుందంట అని పెసిడెంటు గుమస్తా వచ్చి చెప్పగానే, వెంటనే లెగిసి బయలు దేరాడు సూరిగాడు.
ఇంట్లో దిగాలుగా కూర్చున్న రఘుమామకు ఒక అరగంట తరువాత పంచాయితీ బండ నుండి పాతిక గంటలు వినపడ్డాయి. ఎవరా అని హడావిడిగా బయలుదేరిన రఘుమామకు సూరిగాడు రాసిన చిట్టీ ఒకటి దొరికింది. అందులో “మామ, నేను బయట మాత్రమే నలుపు, ఈ సమాజం లోలోపలంతా నలుపే, ఇక ఉంటా” అని రాసుంది.
స్వస్తి,
ప్రవీణ్ కుమార్.