ఓయ్ తాబేలు నాతో పరుగు పోటీకి వస్తావా? నువ్వు పోటీలో గెలిస్తే ఈ అడివిలో నీకు ఏంకావాలన్న ఇస్తాను. మరి నీవు పోటీకి సిద్దమేనా అని సవాలు విసిరింది కుందేలు.
ఈ కుందేలు గాడు నాకే సవాలు విసురుతాడా? నన్నే సవాలు చేసి నా అహాన్ని దెబ్బతీస్తాడా? ఈ కుందేలు గాడి సంగతి ఏంటో చూదాం అని సవాలును స్వీకరించింది తాబేలు.
కుందేలు మరియు తాబేలు పరుగు పందెం నియమాలు మాట్లాడుకుని, ఎవరైతే ఆ చివరి గీత దాటతారో వారే ఈ పరుగు పందెంలో గెలుస్తారు అని నిర్ణయించుకున్నాయి. సరే ఇక పరుగు పందెం మొదలెడదాం అని ఇరువురు మాట్లాడుకుని పరుగును మొదలెట్టాయి.
కేవలం కొన్ని నిముషాల్లోనే చాల దూరం ప్రయాణించింది కుందేలు. తన కను జాడల్లో ఎక్కడా తాబేలు వేనుక కనపడకపోయేసరికి కొంత సేపు విశ్రాంతి తీసుకుందాం అని చెట్టుకింద ఒక పెగ్గు విస్కీ తాగి పడుకుంది కుందేలు.
మిట్టమధ్యాహ్నం ఎండలో నడిచి నడిచి అలసిపోయిన తాబేలు, చింత చెట్టు నీడన ఆగి ఒక్కసారిగా లోతుగా ఆలోచించడం మొదలు పెట్టింది.
అవును అసలు ఈ పరుగు పందెంలో నేను ఎందుకు పరుగుతీయాలి? అసలు దేనికి ఈ పోటీ?
కుందేలు ఎదో సవాలు విసిరితే, నేను ఎందుకు నా అహం దెబ్బతీసుకొని పరుగెత్తాలి?
అసలు పోటీ మంచిదేనా?
ఈ అడివిలో నాకు ఎం కావాలో నేనే నిదానంగా వెతికి పట్టుకుని పొట్ట నింపుకుంటే సరిపోతుంది కదా. ఉన్నoతలో తిని నా చిన్న బురద గుంటలో బ్రతికితే ఎంతో హాయి కదా!
జీవితంలో పరిగెత్తి పరుగెత్తి అలసిపోయి పొట్టనింపుకునే కంటే, నిదానంగా నా శక్తీ మేరకు కస్టపడి, ఆత్మసంతృప్తితో బ్రతికితే సరిపోతుంది కదా?
బ్రతుకే ఒక పోటీ చేసుకున్న మానవ జాతి ఏమి సాధించింది? కొలమానాలాకు బానిసలైన ఆ మానవజాతి చూసి కూడా నేను నేర్చుకోకపోతే ఎలా. అంతస్తులు, తరగతులు మధ్య సంసారం చేసే మానవ జాతి సృష్టించిన ఈ పోటీతత్వానికి నేను బానిసను కాదలుచుకోలేదు. మితిమీరిన ఆశతో, అర్థంలేని అహంతో , గమ్యంలేని ప్రయాణాలతో కొట్టుమిట్టులాడుతున్న ఈ పోటీ ప్రపంచానికి దూరంగా బ్రతకాలి నిర్ణయించుకుంది ఆ తాబేలు!
విశాలమైన తన అడవిలోకి, స్వచ్ఛమైన తన కొలనులోకి, తననని తానూ ప్రేమించుకుంటూ, ప్రతిక్షణం జీవితాన్ని ఆస్వాదిస్తూ, తన ఆత్మ సంతృప్తిని వెతుక్కునే జీవన మార్గం వైపుకు ప్రయాణం సాగించింది ఆ తాబేలు.