రెండు రోజుల క్రితం ఒక ప్రొఫెసర్ గారిని కలవడానికి ఫ్రాంక్ఫర్ట్ నుండి కార్ల్స్రూహే అనే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ప్రొఫెసర్ గారిని కలిసిన తరువాత అక్కడ వారి టీం సభ్యులతో పిచ్చాపాటి సమావేశం ఉదయం 10:00 గంటలకు ఉంది. నేను చేరుకోవాల్సిన ప్రదేశం ఫ్రాంక్ఫర్ట్ నుండి సుమారు గంటా పది నిమిషాల ప్రయాణం. ఉదయం ఆరు ఇంటికే లేచి కొంత చర్చించాల్సిన విషయాలు నోట్ చేసుకొని ఉదయం 08:00 గంటలకు రైలు ఎక్కాను.
ఇక్కడ కోవిడ్-19 పరిస్థితులు బాగాలేనందునో మరి ఎందుకో గాని నేను ఎక్కిన ట్రైన్ బోగీలో చాల తక్కువ మంది ఉన్నారు. ఏదైతేనేం మొత్తానికి ట్రైన్ ఎక్కి నా సీటులో కూర్చున్నాను. ఫ్రాంక్ఫర్ట్ నగర సౌందర్యాలను చూపిస్తూ ట్రైన్ ముందుకు చొచ్చుకుని పోతుంది. ఇంతలో ఒక అనౌస్మెంట్, “దయచేసి మీ టికెట్ను మరియు కోవిడ్-19 టీకా వేసుకున్న ధ్రువ పత్రాన్ని తెరిచి అక్కడ టికెట్ కలెక్టర్ గారికి చుపించాల్సిందిగా” జర్మన్ భాషలో మనవి చేసారు. నాకు చెప్పింది పెద్దగా అర్ధం కాకపోయినా, విషయాన్నీ గ్రహించి వారు కోరినట్టుగానే చేశాను.
కొంత సేపటికే ట్రైన్ మా ఫ్రాంక్ఫర్ట్ నగరం దాటి సూమారు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకుపోతుంది. చలి కాలం కావడంతో తెల్లటి మంచు పొలాలని తెల్ల చీరతో కప్పేసింది! మొన్నటిదాకా పచ్చని ఆకులతో మెరిసిన చెట్లు, చలికి వణుకుతూ ఆకులు లేక బోసిపోయాయి. ఉదయం ఎనిమిదింటికి కూడా సూర్యుడు నిద్రుస్తూనే ఉన్నాడు. నేను తప్ప అక్కడ భూభాగంలో ఉన్న జీవులు, క్రిమికీటకాలు సైతం చలికి తట్టుకోలేక నిద్రుస్తున్నటు నాకు అనిపించింది.
PC:[1]
ఇంతటి ఏకాంతంలో నాకు ఇష్టమయిన మిత్రుడితో సమయం గడపాలనిపించింది. నా సంచిలో ఉన్న ఒక పుస్తకం తీసాను. వినయ్ సీతాపతి గారి జుగల్బందీ పుస్తకం అప్పటికే కొంత భాగం చదివిన నేను, మిగతాభాగం చదువుదామని మొదలుపెట్టాను. పుస్తకం లోతుగా పరిశీలించి రాసినదిగా అనిపించింది. అటల్ మరియు అద్వానీ గార్ల అంతరంగం అర్ధం చేసుకునే ప్రక్రియలో బాగా నిమగ్నమయిపోయాను. అటల్ గారితో ఎన్నో విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, అద్వానీజీ తన ఆప్తమిత్రుడు ఆటల్జీకు వెన్నుముక్కలా ఎలా వ్యవహరించారో చక్కగా ఆ రచయత నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా మా బోగీలో లైట్లు అన్ని ఆరిపోయాయి!. నా గుండె ఒక్కసారిగా వేగం పుంజుకుంది. పక్కకు చూస్తే ఆ బోగీలో ఎవ్వరు లేరు. ట్రైన్ ఎక్కడో ఒక స్టేషన్లో ఆగివుంది.
నాకు ఏమి అర్థం కాలేదు. ఇంతలో ఒక వ్యక్తి మీరు వెంటనే ట్రైన్ దిగాలి అని అరిచారు. ఒక్కసారిగా నా సంచి పట్టుకుని నేను కిందకి పరుగుతీసాను. అయన మీరు వేరే ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫారం-1 మీదకు పరుగు తీసి వెళ్ళండి అని చెప్పారు. అక్కడ పరిస్థితి నాకు సరిగా అర్ధం కాకపోయినా ప్లాట్ఫారం-1 మీదకు పరుగు తీసాను. నా చలి కోటు ఆ ట్రైన్లో ఉండిపోయింది. ప్లాట్ఫారం-1 మీద ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోయింది!
అసలు ఏమైందో అర్ధం చేసుకోడానికి తిరిగి ఆ వ్యక్తిదగ్గరకు వెళ్లి విషయం కనుకున్నాను. అయన నేను ఎక్కిన స్పీడ్ ట్రైన్ ట్రాక్ లైన్లో సాంకేతిక సమస్య ఉందని, దాంతో ఆ బండిని దిశ మళ్లించి ఎక్కడో చిన్నస్టేషన్లో ఆపారని చెప్పాడు. ఆ విషయం ట్రైన్లో అనౌస్మెంట్ మూడు సార్లు చేసారంట. నేను ఆ అనౌస్మెంట్ వినకుండా ఇంత నిర్లక్షము చేసానా అనే ఆలోచనలో పడ్డాను. అప్పుడు నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, ఆ అనౌస్మెంట్ జర్మన్ భాషలో ఇవ్వడం మూలంగా నేను ఎక్కువ శ్రద్ధపెట్టలేదు. పైగా పరిసరాల్లో ఏమి జరుగుతుందో తెలియని ఒక ట్రాన్స్ లోకి నన్ను ఆ పుస్తకం తీసుకువెళ్లిపోయింది.
PC:[2]
నా ఏకాంతలో నాతో మాట్లాడే మిత్రులు నా పుస్తకాలే! అప్పుడప్పుడు నా మిత్రులతో కలసి ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు పక్కన జరిగే కొన్ని అనివార్య పరిస్థిలు అర్ధం చేసుకోకపోతే పరిణామాలు మన చేయి దాటతాయి. ఇలాంటి సంఘటనలు నా జీవిత ప్రయాణంలో తరచుగా జరిగేవే. కానీ మంచి పుస్తకంతో మాట్లాడే క్షణాలు, నా జీవితంలో ప్రియమైన క్షణాలు. కనుక ఇలాంటి పాట్లు కొన్ని సార్లు పడవలసినదే!
PS: చివరికి నేను ఆ రైల్వే స్టేషన్ బయటకు వెళ్లి, ఆ చలిలో మూడు బస్సులు మారి, 12 గంటలకు నేను చేరవలసిన ప్రదేశానికి చేరాను. అక్కడ ప్రొఫెసర్ గారికి నా క్షమాపణలు చెప్పాను.
ఫుట్‌నోట్స్
[2] Continuous One Line Drawing Teenager Man Reading Book Vector Illustration Minimalist Concept Education Theme, Illustration, Boy, Vector PNG and Vector with Tran… in 2021 | Line drawing, Vector illustration, Drawings