మా కుటుంబ పూర్వికులు

నా కుటుంబ పూర్వీకుల గురించి, వారు వలస వెళ్లిన ఊర్ల గురించి, కొన్ని రోజుల నుండి నేను చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నాను.

థాంక్స్ టూ Quora!

మా కుటుంబ వివరాలలోకి కొంచెం లోతుగా పరిశీలించగా నాకు కొన్ని విషయాలు అర్ధం అయ్యాయి. బహుశా నేను మీకు చెప్పే విషయాలు ఖచ్చితమైనవి కాకపోవచ్చు, కానీ నా అభిప్రాయాలని బలపరచడానికి నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి.

మా పూర్వికులలో ఒక బామ్మ గారి పేరు ఆర్ది, ఇంకో బామ్మ గారి పేరు లూసీ. వీరు ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశ వాస్తవ్యులు[1]. మా ముత్తాతల గురించి నాకు అంత అవగాహన లేదు. మా బామ్మగారులు సుమారు 3.5–2.5 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా అడవులలో సంచార జీవులు. వాళ్ళు రెండు కాళ్ళ నడకను అలవాటు చేసుకున్న మొదటి మనిషి జాతి.

సుమారు 2–1.8 మిలియన్ల సంవత్సరాల క్రితం మా పూర్వికులు ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండం దిశగా నడక కొనసాగించి అనేక చోట్ల సంచార జీవులుగా జీవనం గడిపారు[2].

అనేక ఆటుపోట్లు, సామూహిక దాడులు, ప్రకృతి వైపరీత్యాలు, విష జీవుల నుండి, క్రూర మృగాల నుండి, తమను తాము కాపాడుకుంటూ మా పూర్వికులు సంచార జీవితం కొనసాగించారు [3]. సుమారు 10-5 వేల సంవత్సరాల క్రితం మా కుటుంబం వ్యవసాయ కుటుంబంగా స్థిరపడింది.

మా కుటుంబంలో పూర్వికులు

అనేక సామ్రాజ్యాల ఏర్పాటును, వాటి పతనాన్ని,

అనేక దేశాలను, వాటి మదమును,

అనేక మతాలను, వాటి ఉన్మాదాన్ని,

అనేక కులాలను, వాటి వివక్షలను,

పారిశ్రామిక విప్లవాణ్ని, తద్వారా ప్రకృతి వినాశనాన్ని,

కంప్యూటర్ యుగాన్ని, కూలిపోయిన మానవ విలువలను,

అంతస్థు తరగతులను, స్వార్ధపు కోటలను,

చూసారు.

నాకు సుమారు 14వ ఏటలో, మా నాన్నగారిని “మన పూర్వికులు ఎవరు” అని అడిగిన ప్రశ్నకు అయన సమాధానం ఇస్తూ చెప్పిన మాట,

“ప్రపంచంలో ఉన్న ప్రతీ మనిషి మన కుటుంబమే” నాన్న అని.

బహుశా నాలో మానవవాదాన్ని నింపిన ఒక గొప్ప సంఘటన అది!

జగమంత కుటుంబం నాదే కదా……..!

వచ్చే సంవత్సరం మా పూర్వీకుల స్వస్థలం ఆఫ్రికా వెళ్ళడానికి సిద్దపడుతున్నాను.

ఫుట్‌నోట్స్

[1] Lucy and Ardi: The two fossils that changed human history

[2] Introduction to Human Evolution

[3] Human history – Wikipedia

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x