జీవితాన్ని అందంగా మార్చేది ఏంటి ?

సుమారు పాతిక సంవత్సరాల క్రితం స్కూల్ కి వెళ్ళడానికి పోదున్నే అమ్మ నిద్రలేపేస్తుందేమో అని ఒక భయం. స్కూల్లో టీచర్ హోమ్ వర్క్ చేసావా అని అడుగుతుందేమో అని మరో ఆందోళన. ట్యూషన్ మాస్టారు లెక్కల్లో మార్కులు ఎంత వచ్చాయో అడుగుతాడేమోనని మరో చింతన!

  • “పదో తరగతి ఒక్కటి బాగా చదివితే జీవితం అంత బాగుంటుంది అని సమాజం నాకు ఒక హితబోధ చేసింది”

ఇంటర్మీడియేట మొదటి సంవత్సరంలోనే రెండు సంవత్సరాల సిలబస్ చెప్పేసి, మిగతాది అంతా ఎంసెట్ కోచింగ్ చెప్పేస్తాం అని టీవీలలో, పేపర్లలో అడ్వేర్టైస్మెంట్లు. ఏ కళాశాలలో చదవాలి, ఎక్కడ ఉండాలో అని మరో టెన్షన్!

  • “జీవితం అంతటిలో ఎంసెంట్ ర్యాంకే చాలా ముఖ్యం అని సమాజం మరోసారి నాకు హితబోధ”

ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్టు తీసుకోవాలి, చదివిన కాలేజీలో ప్లేసెమెంట్ ఉంటుందా, ఉద్యోగం వస్తుందా? ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తరవాత లెక్కలు అర్ధం కాక, ఎం-1 ఎలా పాస్ అవ్వాలో, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా పాస్ అవ్వాలో మరో టెన్షన్.

  • “జీవితం అంతటిలో ఇంజనీరింగ్ దశ చాలా ముఖ్యం అని సమాజం మరో సారి నా చెవి కొరికింది”

ఉద్యోగం ఇంకా రాలేదా? మీ అబ్బాయికి క్యాంపస్ ప్లేసెమెంట్ రాలేదంట కదా? కనీసం పై చదువుకి అమెరికా పంపిస్తున్నారా? మన పక్క వీధిలో స్వప్న అమెరికా పోయి అప్పుడే ఉద్యోగం కూడా చేస్తుంది . మరి మీ అబ్బాయి సంగతి ఏంటి?

  • “సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే ఉద్యోగం ఉండాలి అని మరో సారి సమాజం నా గురించి జోశ్యం చెప్పింది.”

మీ వోడికి పెళ్లి ఎప్పుడు? వయసు ముప్పయ్ వస్తుంది కదా, మరి సంబంధాలు వస్తున్నాయా? మన కాలనీలో పెద్దగా ఎవ్వరు మీతో సంబంధం కుదుర్చుకోడానికి ముందుకు రావడం లేదు, మరి తొందరపడండి అని ఒక సలహా.

  • “జీవితంలో పెళ్లి చాలా ముఖ్యం అని మరో సారి సమాజం నాకు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించింది”

దాదాపు నా జీవిత ప్రయాణపు ప్రతీ రోజున, ప్రతీ దశలోను ఏదో ఒక భయం, లేదా నాలో భయాన్ని పెంచే విదంగా ఇతరుల మాటలు. ఇవన్నీ నాకు రోజూవారి జీవితంలో ఉండే భయాలు, లేదా ఆందోళనలు.

మరి నా జీవితాన్ని అందంగా మార్చింది ఏంటి ?

జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంతమంది నాలో భయాన్ని పెంచాలని ప్రయత్నించినా, ఈ సమాజానికి దూరంగా, మా ఊరి సముద్రపు ఒడ్డుకు పోయి, నాతో నేను మాట్లాడుకున్న క్షణాలు నిజంగా నా జీవితానికి సంతోషాన్ని ఇచ్చాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, నీకు ఏమి ఇష్టమో అదే చెయ్యి అని నా అంతరాత్మ నా ఏకాంత సమయంలో మాట్లాడేది, మాట్లాడుతుంది. ఒకవేళ ఈ ప్రపంచంలో పోటీ అనేది ఒకటి ఉంటే అది నీతోనే అని ఇప్పటికి కూడా నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నా జీవితాన్నీ అందంగా మార్చింది, మారుస్తుంది ఆ క్షణాలే, ఆ ఆలోచనలే!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x