ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చాలా బాగున్నాయి. అయితే ఈ ప్రశ్న తల్లితండ్రుల కోణం నుండి అడిగింది కాబట్టి సమాధానాలు కూడా ఆ కోణం నుండే ఉన్నాయి.
నాకు పిల్లల కోణం నుండి అలోచించి ఇక్కడ ఒక సమాధానం ఉంటే బాగుండు అని అనిపించి రాస్తున్నాను.
పిల్లల విషయంలో మీ జీవితం సంపూర్ణమా కదా అనే విషయం కొంచెం సేపు పక్కన పెట్టి ఒకసారి కొన్ని వాస్తవలను చూదాం.
పిల్లల్ని కనడం ఈ సృష్టి మనకు సాధారణంగా నేర్పిన విద్యనే. ఆలు-మగలు నిద్రచేస్తే మంచి ఫలితాలే వస్తాయి అని డా.సమరం గారు చాలా సార్లు చెప్పారు! పిల్లలను కనే విషయంలో ఆడవారు పడే వేదనను, మగవారు పడే కష్టాన్ని గౌరవిస్తూ, మిగతావి రాస్తున్నాను.
- పిల్లలను పెంచడం చాలా వరకు డబ్బుతో ముడి పడిన విషయం. ఆరోగ్యాన్ని, పోషక ఆహారాలని, చదువుని, కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని కూడా కొనవలసిన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. వీటన్నిటిని సర్దుబాటు చేయాలంటే తల్లితండ్రులకు స్థిరమైన ఉద్యోగం అవసరం, లేదా ఏదన్నా డబ్బు వచ్చే మార్గం అవసరం. ఒకవేళ ఇలాంటి పరిస్తుతులు మీకు అనుకూలించకపోతే పిల్లల్ని కనే హక్కు మీకు లేదు అని నేను భావిస్తున్నాను.
- డబ్బు ఉంటే మంచిది, కానీ అది పిల్లల విషయంలో సరిపోదు. కుటుంబంలో ప్రశాంతత చాలా ముఖ్యం. పెళ్లి అయినంతమాత్రాన (కలిసి జీవిస్తున్నంత మాత్రాన) అది కుటుంబం అవ్వదు, అవ్వలేదు. ఆలు-మగలు ప్రేమతో, పరస్పర గౌరవంతో మెలిగితేనే ఒక కుటుంబం అవుతుంది (కలసి ఉన్నా, లేకపోయినా ). మీ ప్రేమే పిల్లలకి ఊపిరి, ఇరువురి పట్ల పరస్పర గౌరవమే ఒక ఆదర్శం. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఇవి మీ ఇరువురి మధ్య లేకపోతే, నిర్మహమాటంగా పిల్లల్ని కనే నిర్ణయం, జీవితానికి సార్థకారత లాంటి అలోచనలను పక్కన పెట్టవచ్చు.
- పైవి రెండు ఉన్నా, ఇంకో ముఖ్యమైన విషయం, పిల్లలకు కావాల్సిన స్వేచ్ఛ. మీరు పెంచారు కాబట్టి, మీ అభిరుచులను వారి మీద రుద్దె హక్కు మీకు, లేదా నాకు లేదు. వారి జీవితం వారి చేతుల్లో ఉంది, కానీ వారి జీవితానికి ఒక దారి చూపడం తల్లిదండ్రులగా మన బాధ్యత, అంతవరకే. మేము పెంచాము కాబట్టి, మేము చెప్పిన చదువు చదవాలి, మేము చెప్పిన వారిని పెళ్లి చేసుకోవాలి, మేము నమ్మిన వారిని విశ్వసించాలి అనే ఆలోచనలు ఉంటే, పిల్లల విషయంలో మీ నిర్ణయం వెన్నకు తీసుకోవచ్చు.
మీ ఆత్మసంతృప్తి, జీవితానికి అర్ధం లాంటి సంగతులు పక్కనపెట్టి, ముందు పిల్లలకు కావాల్సిన ఒక ప్రియమైన కుటుంబం (ఇద్దరు కలిసి ఉన్నా, లేకపోయినా, పిల్లల మీద ప్రేమ సాధ్యమే, మంచి కుటుంబం సాధ్యమే), అనుకూల పరిస్థితులు, మీ మీద మీకు పూర్తి విశ్వాసం ఉంటేనే ఒక నిర్ణయానికి రండి.
కేవలం తల్లితండ్రులు లేకపోతెనే పిల్లలు ఆనాధలు కారు, అందరు ఉన్న అనాధ పిల్లలను నేను చాలా మందినే చూసాను.