“Attention seeking“, మన జీవసృష్టి యొక్క నరనరాల్లో దాగి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం. ఈ లక్షణం ద్వారా సృష్టిలో జీవులు అనేక మార్గాలను అనుసరించి తమ జీవన మనుగడను సాగిస్తుంటాయి. ఉదాహరణకు , పువ్వులు తమ పరిమళం ద్వారా, లేదా తమలో దాగి ఉన్న తేనేటి పదార్ధాల ద్వారా వివిధ కీటకాలను, పక్షులను ఆకర్షించి – వాటి సహాయంతో విత్తనాలను సృష్టించుకుని, తమ ప్రతిరూపాలని తయ్యారు చేసుకుంటాయి. ఇది ఒకరకమైన అటెంషన్ సీకింగ్ మెకానిజం ఫర్ సర్వైవల్!
నేను కూడా ఒక అటెంషన్ సీకింగ్ జంతువునే! నేను కోరా సమాధానాలు మొదలుపెట్టినప్పుడు అటెంషన్ సీకింగ్ కోసం ప్రాకులాడాను. కోరాలో అటెంషన్ సీకింగ్ కోసం ప్రాకులాడితే ఏమి వస్తుంది అన్న ప్రశ్న అప్పుడు అప్పుడు నాకు కలిగేది. దానికి కచ్చితమైన సమాధానం నా దగ్గర ఇప్పటికీ లేదు. బహుశా అటెంషన్ సీకింగ్ ద్వారా నాకంటూ ఒక ఐడెంటిటి వస్తే, నేను కూడా జీవన మనుగడ సాగించటం సులువు అని నమ్ముతున్నాను ఏమో (ఇది సర్వైవల్ ఇంస్టిక్ట్ నుండి వచ్చింది అనుకుంట)! లేదా ఐడెంటిటీ వస్తే, నేను అన్ని జీవాలకంటే గొప్ప (లేదా బలవంతుడని ,తెలివిగలవాడను) అని అనుకుని, నాలో ఉన్న సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ తత్వాన్ని బలపరుచుకుంటున్నాను ఏమో.
ఏదిఏమైనా, నాకో చాదస్తం ఉంది, ఆ చాదస్తంతో అప్పుడపుడు ఇక్కడ రాస్తూ, కొన్నిసార్లు చదువుతూ సమయం గడుపుతున్నాను. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి రాస్తున్నాను, జ్ఞానాన్ని పంచడానికి రాస్తున్నాను అని చెప్పి నన్ను నేను ఆత్మవంచన చేసుకోదలుచుకోలేదు! నాకోసం, నా చాదస్తం కోసం నేను ఎక్కువగా రాసుకుంటున్నాను.