మీరు ఒప్పుకుంటే మిమల్ని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నా అని మా కాలేజీ జూనియర్ ఒక అమ్మాయితో చెప్పాను. పెద్దగా తనతో పరిచయం లేని నేను, అలా మాట్లాడేసరికి, తను ఒక్కసారి నా వంక కింగ్ కాంగ్ సినిమాలో మొదట హీరోయిన్ కింగ్ కాంగ్ ను చూసి ఎలా షాక్ అయ్యిందో , నా వంక తను కుడా అలానే చూసినట్టు నాకు అనిపించింది.
అసలు విషయం ఏమిటంటే, నేను ఎం.టెక్ అయినా తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చాలా రోజులనుండి ఆ జూనియర్ అమ్మాయిని గమనిస్తూ వున్నాను. ఒకసారి ల్యాబ్ లో తను పని చేసుకుంటూ ఉంటే, టీ తాగుదాం వస్తారా అని పిలిచాను. నా మీద పెద్దగా కాలేజీ లో కంప్లైంట్స్ లేనందువలనో ఏమో కానీ, తను నాతో కలిసి టీ తాగడానికి వచ్చింది. అప్పుడు చెప్పాను మిమల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని. తను ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయింది.
నేను తనను మరల కొన్ని రోజులు కలవలేదు. ఒక్కరోజు సడన్ గా కలిసి అసలు నా గురించి ఏమి తెలుసు అని నన్ను పెళ్లిచేసుకుంటాను అని అడిగావంది? దానికి నేను “చాలా రోజుల కిందట ప్లేటో (Plato greek philosopher) రాసిన ఒక వ్యాసం చదివానని, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు నీలో ఏమి క్వాలిటీస్ లేవో, అవి ఉన్నవారిని మనం ఎన్నుకుంటే మనం సంతోషంగా ఉంటామని చదివావని చెప్పాను. అలా చేస్తే మన జీవితభాగస్వామి మనలను పరిపూర్ణంగా తీర్చి దిద్దుతుందని ప్లేటో చెప్పాడు అని వివరించాను! అయితే ఇది చెప్పిన తర్వాత బహుశా నేను బాగా తేడాగా ఉన్నానని తను అనుకోని ఉండొచ్చు! లేదా ఇతని ఫిలాసఫీ ఏంటోరా బాబు అని అనుకుని ఉండొచ్చు! కానీ తరువాత తనకు అర్ధమయ్యే లాగా చెప్పాను, నువ్వు ఎప్పుడు హ్యాపీ గోయింగ్ (happy going) అని, లైఫ్ ని సింపుల్ గా తీసుకుంటావని, సరదాగా ఉంటావని అన్నాను. నేను మాత్రం ఎప్పుడు చాలా బోరింగ్ గా, ఈ ప్రపంచాన్ని ఉద్దరించేవాడిలా, ఫిలాసఫీ అనుకుంటూ ఆలోచిస్తుంటాను అని, నా లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటానని చెప్పాను. అందుకని నువ్వు నాకు అవసరం అని చెప్పాను. నేను అదో టైపు అని ఆ అమ్మాయి స్నేహితులు కుడా తనకు చెప్పారని వినికిడి!
కొన్ని రోజుల తర్వాత తను నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరించింది. తన తల్లిదండ్రులతో చెప్తానని, వారి అంగీకారంతో నన్ను పెళ్లిచేసుకుంటానని చెప్పింది. తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలియగానే, మరుసటి రోజు ట్రైన్ పట్టుకుని మా కాలేజీ కి వచ్చేసారు. నన్ను పదిగంటలకు గెస్ట్ హౌస్ కి రమ్మని కబురుపెట్టారు. సరే అని నేను మరుసటి రోజు వారు వుండే గెస్ట్ హౌస్ కి వెళ్ళాను. నాలోపల చాలా ఆలోచనలు రావడం ప్రారంభమయ్యాయి! బహుశా నన్ను సినిమాలో లాగా కిడ్నప్ చేసి కొడతారేమో అనుకున్న. కానీ అదృష్టవశాత్తు అలాంటివి ఏమి జరగలేదు. నేను అక్కడికి వెళ్లేసరికి ఆ అమ్మాయి నా కరికులం విటే (resume) తన తల్లిదండ్రులకు చూపిస్తూ ఉన్నదీ. కొన్ని గంటల సంభాషణ తరువాత వారికీ నేను నచ్చలేదు అని నాకు అర్ధమయింది (నా ఫిలాసఫీ సమాధానాలతో వారికి నేను తేడాగా కనిపించి ఉండొచ్చు).
అయితే నాకు, ఆ అమ్మాయికి జర్మనీ లో జాబ్స్ రావడం తో మేమిద్దరం ఇండియా వదిలి ఇక్కడికి వచ్చేసాం. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నా గురించి రాసుకున్న డైరీ తన అమ్మగారికి దొరికింది. ఆ డైరీ లో నేను అంటే తనకు ఎంత ఇష్టమో రాసుకుందట. అది చుసిన తన అమ్మగారు, వారికి అంతగా ఇష్టం లేకపోయినా మా పెళ్ళికి ఒప్పుకున్నారు (డైరీ రాయడం చాల మంచి అలవాటని నాకు ఆ రోజు జ్ఞానోదయం అయ్యింది). ఎందుకో ఆ అమ్మాయి తల్లిగారికి నా మీద అంత మంచి ఉద్దెశం లేదు అని నాకు అనిపించింది. సరే ఏది ఏమయినప్పటికీ మేమిద్దరం పెళ్ళికి ఇండియా కు వచ్చేసాం. మా తల్లి దండ్రులు మరియు వారి తల్లి దండ్రులు మాట్లాడుకుని అన్ని పనులు పూర్తి చేసారు. పెళ్లి కార్డులు కూడా అచ్చు అయిపోయాయి.
ఒక్కరోజు పెళ్లి కూతురి అమ్మగారు, నేను, మరియు కొంతమంది కుటుంబసభ్యులు కూర్చుని భోజనం చేస్తూ వున్నాం. మరుసటి రోజే మా వివాహము. అయితే నేను పెళ్లి కూతురి అమ్మగారితో ఇలా అన్నాను “ఏమండీ అన్ని బాగానేవున్నాయి కానీ మరి కట్నం సంగతేమిటి” అని? ఒక్కసారి ఆవిడ అవాక్కు అయ్యారు. ఇంట్లో నిశ్శబ్దం. కొన్ని నిముషాలు అయ్యాక ఆవిడ “మీరు ముందర ఏమి అడగలేదు కదా, ఇప్పుడు అడుగుతున్నారేమిటి” అని అన్నారు. అయితే నేను, మీరు కట్నం ఇస్తేనే పెళ్లిచేసుకుంటాను, లేకపోతే లేదు అని కారాకండిగా చెప్పేసాను. మీరు నాకు రేపటి కల్లా మొతం 50 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు అని అన్నాను. ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా హడలిపోయారు. పెళ్లికూతురు కూడా పక్కనే వుంది కానీ తనకు ఏమి అర్ధంకావడం లేదు. ఒక కార్ కూడా ఇవ్వాలి తరవాత అని అన్నాను. అయిదు నిముషాలు అయిన తరువాత, నేను పెళ్లి కూతురి అమ్మగారుతో మీకు ఎక్కిళ్ళు ఆగిపోయాయి గమనించారా? అని అడిగాను, ఒక్కసారిగా అందరూ పెద్దగా నవ్వేశారు! తరువాత మా అత్తగారు, అందరం హడలిపోయాం కదయ్యా అని అన్నారు! ఇప్పుడు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం! పెళ్లి ఖర్చులు అంతా మేము మా జీతం నుండే ఖర్చుపెట్టాం ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా!
Wow, so nice and the humour is fantastic,i can’t stop laughing in between