ఒక రోజు యధావిధిగా నా పనిలో పడిపోయా ఆఫీస్ లో. అప్పుడు ఒక ఇ-మెయిల్ వచ్చినట్టు గమనించా.
ఇ-మెయిల్ (e-mail): మీరు మాకు పంపిన సైంటిఫిక్ పేపర్ (science paper) మా సమావేశంలో చర్చించడానికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశం ఫ్రాన్స్-పారిస్ (France-Paris) నగరంలో జరుగుతుంది. మీకు హోటల్ మరియు ట్రావెలింగ్ అలోవెన్సు (traveling allowance) మేమె ఇస్తాం అని ఉoది.
సమావేశం చాలా పెద్దది మరియు పారిస్ నగరంలో జరుగుతుంది కనుక ఒక మంచి అవకాశంగా భావించి, నేను వస్తాను, హోటల్ బుక్ చేయండి అని వారికీ జవాబు ఇచ్చాను. పనిలో పని పారిస్ నగర సౌందర్యాలను చూదాం అని చిన్న సైజు ప్లాన్ కూడా వేసేసాను (నా సతీమణి గారు ఉద్యోగ రీత్యా బిజీగా ఉండడం వలన, ఆవిడ పారిస్ కు రాను అనేసరికి, నా ప్లానింగ్ తారా స్థాయికి చేరింది, అవ్వన్నీ ఇక్కడ రాయలేను!).
జర్మనీ నుండి తెల్లవారు జామున 6 గంటలకు ట్రైన్లో బయలుదేరాను. పారిస్ నగరం కు సుమారు 4 గంటాల ప్రయాణం. రైలు గంటకు 350km/hr ప్రయాణం చేస్తూవున్నది, నా అలోచనలు మాత్రం కాంతివేగంతో (గంటకు 1080000000km/hr) ప్రయాణం చేస్తున్నాయి (పారిస్ నగరములో నేను ఎం ఎం చేయవచ్చు అని!). ప్రయాణ మార్గములో పచ్చని పొలాలు, చిన్న నదులు, కొండలు, పూలు చాలా అద్భుతముగా ఉన్నాయి. మన సినిమా డైరెక్టర్లు గనక ఈ సన్నివేశాలు చూస్తే, హీరో హీరోయిన్స్ తో డాన్స్ పక్కాగా చేయిస్తారు అని అనిపించింది.
మొత్తానికి మధ్యాన్నానికి హోటల్ చేరుకున్నాను. హోటల్ బాగానేవుందని అనిపించింది. కొంతసేపు పడుకున్నాను. నిద్ర లేచిన తర్వాత కొంతసేపు పని చేసి, సాయంత్రం తిందామని నా గదికి తాళం వేసి బయటకు వెళ్ళాను. తిరిగి హోటల్‌కు వచ్చేసరికి హోటల్ ముందు చాలా మంది జనం. నాకు ఏమయిందో అంతుచిక్కలేదు.
విషయం ఏంటా అని అక్కడ ఉన్న వారిని అడిగాను. నేను ఉంటున్న హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పారు. ప్రాణ నష్టం ఏమి లేదు, కానీ మంటలు చెలరేగుతున్నాయి, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు అని చెప్పారు. ఎవ్వరికి ఏమి అవ్వలేదు అని నా మనసు కొంచెం సేపు కుదుటపడినా, లోపల నా లాప్టాప్ (laptop), ముఖ్యమయిన డాకుమెంట్స్ కాలిపోయాయి అని భయం మొదలయింది. కాలిపోవటం మాట పక్కన పెడితే, కొంపతీసి నా లాప్టాప్ మీద పని వత్తిడి పెరిగి ఏమన్నా కాలిపోయిందా, ఒకవేళ అదే జరిగితే నన్ను పారిస్ నగర జైలులో పెడతారేమో అని మరో భయం మొదలయింది.
సమయం రాత్రి 10 అయ్యింది. అదే హోటల్ లో అమెరికా లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఒక అతను పరిచయం అయ్యారు. బాగా చలిగా ఉండడం వలన నా దగ్గరవున్న ఒక coat ఆయనకు ఇచ్చాను (నేను మందపాటి T-షర్ట్ వేసుకున్నాను). ఆలా కొంచెం సేపు తర్వాత, అదే హోటల్లో ఉంటున్న ఒక 15 మంది పరిచయం అయ్యారు. కొంచెం సేపు తర్వాత ఇoక కొంతమంది అగ్నిమాపక సిబంది వచ్చారు.
సమయం రాత్రి 12 అయ్యింది. ఇంకా ఎంతసేపు పడుతుంది అని హోటల్ యాజమాన్యం ని అడిగాము. వారు తెలియదు అని , బహుశా గంట పడుతుందేమో అని చెప్పారు. మేము పక్కనే వున్నా ఒక చిన్న restaurant లో కూర్చున్నాం. మా వస్తువులు ఏమి అయ్యాయో మాకు ఇంకా తెలియదు. ఒక గంట తరువాత ఇంకా మంటలు వస్తున్నాయి అని అగ్నిమాపక సిబంది మాతో చెప్పారు.
కొంతసేపటికి ఇదిగో వీళ్ళు వచ్చారు:
ఈ రాత్రికి మిమ్మల్ని పారిస్ నగర మేయర్ గారి నివాసం లో వసతి ఏర్పాటుచేశాం, రండి అని మాతో చెప్పారు. నేను పోలీస్ బండి ఎక్కాను. జీవితం లో ఎన్నడూ పోలీస్ బండి ఎక్కని నేను, ఒక్కసారిగా పారిస్ నగరం లో ఎక్కేసరికి , అసలు జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు అనిపించింది. పోలీస్ బండిలో దాదాపు పారిస్ మొత్తం తిప్పారు. అర్ధరాత్రి, 3 గంటలకు, పోలీస్ వాహనం లో, ఉచితంగా పారిస్ నగర సౌందర్యాలను వీక్షించే భాగ్యం ఎవరికి దక్కుతుంది చెప్పండి. అర్దరాత్రి కూడా పారిస్ నగర సౌందర్యం వర్ణనాతీతం. అక్కడ శిల్పాలు, ఆర్కిటెక్చర్ నన్ను అబ్బురపరిచాయి.
దాదాపు ఉదయం 4 గంటలకు మేయర్ గారి నివాసం కి చేరాము. ఈ చిన్న ప్రయాణం లో మా 15 మంది చాలా మంచి స్నేహితులమయాం. ఇక మేయర్ గారి నివాసం గురుంచి మీకు నేను ఎం చెప్పాలండి. నేను తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ అమర్చాను, మీరే చుడండి.
దాదాపు ఉదయం 6 గంటలకు మేము పడుకోవడానికి అవకాశం లభించింది. చాలా అలసిపోయాం. ఎంత విపత్కర పరిస్థుతుల్లోనైనా మన జీవితం ను ఆస్వాదించగలం అని మన జీవితమే మనకు నేర్పుతుంది కాబోలు!. పొద్దున్నే మరల 7 గంటలకు లేచి నేను నా సమావేశం కు వెళ్ళాను. అదృష్టవశాత్తు అంత బాగా జరిగింది. సాయంత్రం తిరిగి మళ్ళీ హోటల్ దగ్గరకు చేరుకున్నా, అక్కడ నా స్నేహితులను కలిసాను. అదృష్టం, మా సామాన్లకు ఏమి కాలేదు, వంటగదిలో ఏదో లోపం వలన మంటలు చెలరేగాయని తెలిసింది. నాకు వేరే హోటల్ సమావేశ నిర్వాహకులు బుక్ చేయడం తో మా స్నేహితులకు వీడ్కోలు పలికాను. చాల తక్కువ సేపు పరిచయం అయినా, వెళ్లిపోయేటప్పుడు చాల భాధ అనిపించింది. అప్పుడు నాకు డా. కేశవరెడ్డి గారు రచించిన “అతడు అడవిని జయించాడు” నవలలో ఒక వాక్యం గుర్తొచ్చింది “స్నేహ కాలం కన్నా, స్నేహంలోని తీవ్రతయే ప్రధానం అని“.
తరువాత ఉన్న రెండు రోజులు హోటల్లో విశ్రాంతి, ఎక్కడికి తిరిగే ఓపిక లేకపోయింది. తిరిగి ఇంటికివెళ్లాక, నా శ్రీమతిగారు పారిస్ బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నావ్ అని ఒక చెలోక్తి, దానికి నేను నా మనుసులో “అబ్బో చాలా అని — నా మొహం ఒకసారి అద్దంలో చూసుకున్నా”
ఇది అండీ నా జీవితం లో ఒక సినిమాగా జరిగిన సంఘటన.