నేను పదో తరగతిలో ఉన్నపుడు ఒక రోజు నా స్నేహితుడు హడావిడిగా వచ్చాడు.
ఏమైందిరా అంత హడావిడిగా ఉన్నావ్ అని వాడిని అడిగాను. వాడు, అరేయ్ నీకు ఒకటి చూపించాలిరా, ఇప్పుడే నేర్చుకుని వచ్చా.
వాడి హడావిడి చూసి, అబ్బో వీడేదో చాలా గొప్ప విషయం నేర్చుకుని వచ్చాడు అనుకున్నా.
వాడు, అరేయ్ నీ పూర్తి పేరు చెప్పు అని అడిగాడు. నేను ప్రవీణ్ కుమార్ అని చెప్పాను. వాడు చాలా ఏకాగ్రతతో ఒక పేపర్ మీద నా పేరు రాసాడు.
నిన్న నువ్వు ఒక అమ్మాయి గురించి మాట్లాడవు కదా, ఆ అమ్మాయి పూర్తి పేరు చెప్పు అని అడిగాడు. నేను ఎందుకురా ఇప్పుడు అని అంటే, యెహా నువ్వు చెప్పు ముందు అని అన్నాడు. వాడి కాంఫిడెన్స్ చూసి నాకు అబ్బో వీడేదో చేసేటటు ఉన్నాడు అనుకుంటూ, తన పూర్తి పేరు చెప్పాను. ఆ పేపర్ లో నా పేరు కింద ఆ అమ్మాయి పేరు రాసాడు.
రెండు నిముషాలు తరవాత, మా ఇద్దరి పేర్ల కింద FLAMES అని రాసాడు. ఇక అంకెలు లెక్కపెట్టడం మొదలెట్టాడు. ముందు FLAMES లో L కొట్టేసాడు, తరువాత S కొట్టేసాడు. అలా లెక్కమొత్తం తేలాక E వచ్చింది. వాడు చాలా బాధతో, ఒరేయ్ నీకు ఆ అమ్మాయి భవిషత్తులో ఎనిమీస్ (enemies) రా అని అన్నాడు. నేను చాలా ఆశ్చర్యంతో నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగితే, నిజం రా, ఈ మెథడ్ విదేశాల్లో కూడా వాడతారు. అన్ని ఇందులో చూపించినటు జరుగుతాయి అని అన్నాడు. అప్పుడు ఒక్క క్షణం నా కంటికి వాడు పెద్ద సైంటిస్ట్లా కనపడ్డాడు.
కొంచెం సేపు అయ్యాక మా లెక్కల పీరియడ్ స్టార్ట్ అయ్యింది. మా లెక్కల పంతులు లెక్కలు చెపుతుంటే, వాడు మాత్రం నా పేరుతో మా క్లాస్లో ఉన్న అందరి అమ్మాయిల పేర్లుతో FLAMES లెక్కలు వేయడం మొదలెట్టాడు. నాకు ముగ్గురితో L (లవ్) అని తేలింది. వాడు ఏదో ఒక గొప్ప ఆవిష్కరణ చేసినట్టు మొహం పెట్టాడు. ఇంతలో మా పంతులు ఆ కాగితం చూసి, నన్ను వాడిని ప్రధాన ఉపాధ్యాయుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన మమ్ములను తిట్టి పంపకుండా, మా నాన్నకి, వాడి నాన్న గారికి ఫోన్ చేసి విషయమంతా చెప్పారు.
సాయంత్రం మా నాన్న కొట్టుడికి మా ఇంట్లోనుండి FLAMES రావడం మొదలయ్యాయి. అప్పుడు నేను, నా పరిస్ధితే ఇలా ఉంటె, లెక్కలు వేసిన వాడి ఇంట్లో పరిస్థితి ఏంటో అని ఆలా ఆలోచిస్తూ, నన్ను నేను ఓదార్చుకున్న.
చాల సరదా జ్ఞాపకాలు ఇవ్వన్నీ!