ముందుగా తుఫానులు రావడానికి కారణం ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను .
సముద్రము ఉష్ణ శక్తిని (heat energy) ఎక్కువ రోజులు నిలువచేసుకో కలిగే సామర్థ్యం కలిగి ఉంది (కొన్ని సంవత్సరాలు).
అలాగే మన వాతావరణం కూడా ఉష్ణ శక్తిని నిలువచేసుకో కలిగే సామర్థ్యం కలిగి ఉంది (కొన్ని రోజులు మాత్రమే), కానీ సముద్రంతో పోలిస్తే మన వాతావరణం ఉష్ణ శక్తిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేదు.
ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, చలి కాలంలో మీరు వేడి వేడి కాఫీ చేసుకొని మీ రూమ్ టేబుల్ మీద పెట్టి తాగడం మరిచిపోయారు అనుకుందాం. కొంతసేపటి తరువాత మీరు గమనిస్తే, మీ కాఫీ చల్లగా అయిపోయి ఉంటుంది. ఇది ఎందువల్ల జరిగింది? బయిట వాతావరణం చల్లగా ఉండడం వలన మీ కాఫీ కొంత ఉష్ణ శక్తిని వాతావరణంకి విడుదల చేసి కొంతసేపటి తరవాత వాతావరణ ఉషోగ్రతకు చేరుకుంటుంది. దీనిని మనం ఈక్విలిబ్రియం స్టేట్ (equlibrium)అని అంటాం.
అలాగే కొన్ని సందర్భాలలో సముద్రం పైన ఉన్న వాతావరణం చల్లగా, సముద్రం వేడిగా (ఉష్ణ శక్తిని ఎక్కువ రోజులు నిల్వచేసుకోవడం వలన) ఉండడం వలన వాతావరణం లోకి సముద్రం ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఉష్ణ శక్తిని గ్రహించడం వలన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు గాలి తీవ్రత పెరగడం జరుగుతుంది. ఉష్ణ శక్తి మార్పిడి జరిగిన విధంగానే సముద్రం వాతావరణం లోకి తేమము విడుదల చేస్తుంది. దీని వలన వాతావరణం లో వర్షపాతం నమోదవుతుంది.
ఈ ప్రక్రియ తీవ్రంగా మారితే తుఫాను ఏర్పడుతుంది (తుఫాను పెరగడానికి ఇంకా చాల పరిస్థితులు అనుకరించాలి, ఇప్పుడు వాటి ప్రస్తావన అవసరం లేదు) .
ఈ ప్రక్రియ కొన్ని వేల సంవత్సరాలనుండి జరుగుతుంది. కాబట్టి తుఫానులు చిన్నవో , పెద్దవో రావడం సహజం. హిందు మహా సముద్రంలో సహజంగా సుమారు సంవత్సరానికి 10 తుఫానులు వస్తాయని అంచనా.
చిత్ర మూలం:North Indian Ocean tropical cyclone – Wikipedia
అయితే 2100 సంవత్సరం నాటికి వాతావరణ నమూనాల ప్రకారం ప్రపంచమంతటిలో తూఫానుల సంఖ్య తగ్గుతుంది, కానీ ఒకవేళ తుఫాను వస్తే దాని బలం మరియు ప్రభావం తీవ్రంగా (ఇప్పటి తీవ్రతతో పోలిస్తే) ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇది మానవులు వాతావరణంలో తీసుకొస్తున్న మార్పు ప్రభావం (Human induced climate change) వలన జరుగుతుంది.
మీకు తూఫానుల మీద ఇంకా తెలుసుకోవాలని ఉంటె నేను రాసిన ఈ రీసెర్చ్ పేపర్ చదవొచ్చు. (https://www.researchgate.net/publication/317588679_Observational_perspective_of_SST_changes_during_life_cycle_of_tropical_cyclones_over_Bay_of_Bengal)
ఫుట్ నోట్స్:
https://www.ipcc.ch/site/assets/uploads/sites/3/2019/11/03_SROCC_SPM_FINAL.pdf