సర్కస్ కి జనాలు ఎక్కువ మంది రావడం మానేశారు :
అనగనగా ఒక సర్కస్ లో పెద్ద ఇల్లు కట్టారు. ఆ ఇంటికి ఒక యజమానిని మరియు ఒక కాపలాదారుడిని ఆ సర్కస్ యజమానులు నియమించారు. ఆ యజమాని పేరు “పెద్ద అయ్యా” !
ఈ మధ్య సర్కస్ కి జనాలు ఎక్కువ మంది రావడం మానేశారు అని ఆ యజమానులు ఒక వినూత్న ప్రయత్నం చేసారు. అదేమిటంటే, ఆ పెద్ద ఇంటికి ఒక పది కోతులను రప్పించీ, వాటిలను కెమెరాల మధ్య బందించి ఒక అట ఆడిస్తే చాల మంది ఆ సర్కస్ చూడడానికి వస్తారని.
ఇక ఇంట్లో ఆట విషయానికి వస్తే, అప్పుడపుడు ఈ కోతుల మధ్య చిచ్చు పెడుతుంటాడు ఆ ఇంటి పెద్దాయన. ఉదాహరణకు ఆ ఇంటిలో కోతులకు ఇతర కోతులలో నచ్చని ఒక అంశం అని, లేదా ఇంటి నుండి బయటకు తరిమేయాలనే కోతి ఏదని, లేదా ఒక చెట్టు పైన అరటిపండు పెట్టాం, అది మీలో ఎవరు బాగా కొట్టుకుని పట్టుకుంటారో అది వారిదే అని ఇలా రకరకాల పరీక్షలు పెడుతూ వుంటారు.
ఇక ప్రతి శనివారం ఇంటి కాపలా దారుడు వచ్చి ఈ కోతులకు “మేము మీ మధ్య చిచ్చు పెట్టాము, కానీ మీరు ఇలా ఉండకూడదు, మీరు ఆలా మాట్లాడకూడదు, మీరు చేసింది పెద్ద తప్పు లాంటి నీతులు చెపుతూ ఉంటాడు. ఈ సర్కస్ లో తతంగం అంత చూస్తూ కొంతమంది జనాలు “ఆ కోతి ఇలా చేసింది, ఈ కోతి ఇలా చేసింది, ఆ కోతి ఈ కోతి మీద ప్రేమలో పడింది, ఆ కోతి తలలో పేలు ఈ కోతి చూసింది” లాంటి ముఖ్యమయిన విషయాలు చర్చించుకుంటూ ఆనందాన్ని పొందుతుంటారు.
ఇది వినడానికి ఎంత జుగుప్సాకరంగా ఉంది? కోతుల మీద ఇలాంటి ఒక ప్రయోగం చేస్తే వినడానికి ఇంత బాధాకరంగా ఉంటె, మన భూమి మీద జ్ఞానమునకు దారి చూపిన మానవ జాతి మీద ఇలాంటి ప్రయోగం చేయడం ఎంత దురదృష్టం?
ఇక విషయానికి వస్తే, సుమారు రెండు లక్షల ఏళ్ళ క్రితం కోతి నుండి మనిషి పరిణామం చెందాడు అని సైన్స్ చెపుతుంది. చెట్ల మధ్యలో పుట్టల మధ్యలో పెరిగిన మనిషి, కొద్దికొద్దిగా పరిణామం చెందుతూ ఒక జీవన విధానాన్ని ఎంచుకున్నాడు. అది మానవతా విలువలతో, ప్రేమా ఆప్యాయతతో, మనిషి మనిషికి మధ్య గౌరవంతో, ఆత్మ గౌరవంతో, సానుభూతితో, కుటుంబ సభ్యుల ప్రేమ అనురాగాలతో, హేతుబద్ధమయిన విలువలతో, స్వతంత్రంతో, జ్ఞానముతో, మనుషుల మధ్యలో ప్రైవసీతో కూడుకున్న జీవన విధానం. ప్రతిరోజు మనం ఈ జీవన విధానములో బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనందరిలో ఉన్న లోపాలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్తాము.
కానీ మానవుడిగా పరిణామం చెందే ప్రక్రియలో కొంత మంది తిరిగి మానవ జాతిని కోతులలో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి ప్రయత్నాలలో ఒకటి ఈ షో అని నా అభిప్రాయం. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, మానవతా విలువల ఉల్లంఘన, మానవ సంబంధాలను హేళన , మానవ స్వేచ్ఛ స్వాతంత్య్రాల ఉల్లంఘన, మనుషుల ప్రైవసీని బజారుకి లాగడం వంటివి జరుగుతున్నాయి అని నా అభిప్రాయం. వారికి ఇష్టముండి వెళ్లారు కదా అని చాల మంది అభిప్రాయం, కానీ ఇష్టముండి మనుషులు ఆత్మహత్య చేసుకోవడం మనం అంగీకరిస్తామా?
నేను కోతినుండి మనిషిగా పరిణామం చెబుతున్నాను, నేర్చుకుంటున్నాను, ప్రతిరోజూ మన సమాజంలో గొప్ప ఆవిష్కరణలు, విలువలు పెంచే సంఘ సంస్కర్తలను చూసి గర్వపడుతూవుంటాను. అలాంటి సమాజం వైపు మనం నడవాలని ఆశిస్తున్నాను.