రాత్రంతా వెన్నెలలో సేదతీర్చుకున్న ఎర్రమందారం ఉదయాన్నే రెట్టింపు ఉత్సాహంతో సూర్యునివైపు చూడసాగింది. నెమలి పురివిప్పినట్టుగానే, తన ఎర్రని రేకులను విప్పి తన స్నేహితుడైన తేనెటీగకు ఆహ్వానం పంపింది. హరివిల్లును ధరించిన సీతాకోకచిలుక ఎర్రమందారంకు శుభోదయం చెప్పటానికి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతలో పెరట్లో మొక్కలకు నీళ్లుపోయడానికి వచ్చిన శ్యామల మందారచెట్టుకు నీళ్లుపోస్తూ ఇంతటి అందమైన మందారం పూసిందని సంతోషపడింది.
పొలానికి సమయమైంది పోవాలి అని గబా గబా కొడవలి, టిఫిన్ డబ్బా తయ్యారు చేసుకుని ఇంటి బయటకు నడవసాగింది శ్యామల. కొంతదూరం నడిచాక, తన పెరట్లో ఉన్న ఎర్రమందారం మీదకు మనసువెళ్ళింది శ్యామలకు. ఎమ్మటే తిరిగి తన పెరట్లో మందారం చెట్టుదగ్గరకు వచ్చి ఎర్రమందారాన్ని కోసి తన పొడవాటి జుట్టుకు గుచ్చింది. ఏడు మైళ్ళు నడిచాక పొలానికి చేరింది. రోజంతా పొలంలో నారు నాటిన శ్యామల, సాయంత్రం బేటా తీసుకోడానికి బయలు దేరింది. పొలం యజమాని దగ్గరకు వెళ్లిన శ్యామల మళ్ళీ తన ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజునుండి శ్యామల ఆచూకీ తెలియలేదు, శ్యామలకు సంబందించినవేవి ఆ ఊర్లో కనపడలేదు, ఒక్క నలిగిపోయిన ఎర్రమందారం తప్ప!
ఇలాంటి సంఘటనలు మన చుట్టుపక్కలే ఎన్నో జరుగుతున్నాయి. వీటికి అంతం లేదా? న్యాయం చేయవలిసిన వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోతే ఇక న్యాయంకోసం ఏ గడప ఎక్కాలి? ఎర్ర మందారమే కదా అని కాలుతో నలిపేయవచు అని అనుకుంటున్నారేమో, ఎర్ర మందారాలు త్రిసూలాలు, తుపాకులు కూడా పట్టుకోగలవు!