నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాస్తికుడ్ని. నాస్తికుడిలా చనిపోతాను అనే విశ్వాసం (confidence) నాకు ఉంది! నాకు సైన్స్ పట్ల ఆసక్తి కూడా ఉంది కనుక ఈ ప్రశ్నకు నాకు సమాధానం ఇవ్వడానికి అర్హత ఉంది అని అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప హేతువాదుల అందరి తరుపున ఇచ్చే సమాధానం కాదు అని మనవి.
నేషనల్ జియోగ్రఫీ (2016) లో వచ్చిన ఒక వ్యాసం ప్రకారం “The World’s Newest Major Religion: No Religion”, ప్రపంచ వ్యాప్తంగా మునుపెన్నడూ లేని విదంగా ప్రజలు తమకు నాస్తికత్వ/ అజ్ఞేయవాద భావజాలం ఉందని తెలియచేసారు అని Gabe Bullard గారు తెలియచేసారు. నార్త్ అమెరికా మరియు ఐరోపా అంతటా ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు సంఖ్య రెండో స్థానం లో ఉందని పేర్కొన్నారు. రష్యా మరియు చైనాలో కూడా ఈ సంఖ్య ఎక్కువగా ఉందని గమనించగలరు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ట్రెండ్స్ పెరుగుతూ వెళుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, సరైన గణాంకాల డేటా లేకపోవడం కొంత అనిశ్చితికి తావునిస్తుంది. అనేక మతాల ప్రార్ధన మందిరాల్లో జనాలు లేక, వేరే కార్యక్రమాలకు అద్దెకిస్తున్నారు అని కూడా కొన్ని కధనాలు ప్రసారమయ్యాయి. కనుక నాస్తికత్వం ప్రసిద్ధి చెందడంలేదు అనేది సరైన వాదన కాదు అనేది నా భావన.
నాస్తికత్వం, మతం లాగ ఒక ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్ (organized institution) కానందున కూడా కొంత ఆలస్యంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం అయితే, నాస్తికుల మీద దాడులు, కుటుంబంతో కలిసి భయపడుతూ బ్రతకావలిసిన వాతావరణం, హత్యలు, దేశ ద్రోహ కేసులు లాంటివి నాస్తికత్వ భావజాలానికి కొన్ని ఆటంకాలు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కారణాలు చేత నాస్తిక భావజాలం ఉన్నా తాము నాస్తికులం అని చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదు అని నేను అనుకుంటున్నాను.
పిక్చర్ క్రెడిట్స్: The World’s Newest Major Religion: No Religion
సాంకేతిక విజ్ఞానం వైపుకు మానవాళి పరుగులు తీస్తుంది అనే దాన్లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత కరోనా సమయంలో మనం డాక్టర్లను, శాస్త్రవేత్తలను, పరిశుభ్ర కార్మికులకు ఉన్నతంగా విలువ ఇవ్వడం మనం గమనించే ఉంటాం. సాంకేతిక విజ్ఞానం మానవ చరిత్రలో, మరియు ముందున్నా కాలం లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనడం అతిశయోక్తి కాదేమో. కానీ సాంకేతిక విజ్ఞానం పెరిగినంత మాత్రాన ప్రజలందరూ నాస్తికులు అవుతారు అనే వాదన కూడా సరిఅయినది కాదు! నాస్తిక వాదానికి సాంకేతిక విజ్ఞానం కొంత తోడ్పడుతుందేమో అంతే!
దీనికి నాకు తోచిన కొన్ని అభిప్రాయాలు:
సాంకేతిక విజ్ఞానంకు చాలా పరిమితులు ఉన్న సంగతి మనం అంగీకరించాల్సిందే. సైన్స్ ఒక విషయం ఎలా(how) జరిగిందో చెప్పగలదు కానీ ఎందుకు(why) జరిగిందో చెప్పలేదు. ఉదాహరణకు బిగ్ బాంగ్ థియరీ ప్రకారం ఒక విస్ఫోటనం తరువాత స్థలము కాలము ఏర్పడి విశ్వం ఏర్పడింది అని చెపుతుంది. కానీ బిగ్ బాంగ్ ఎందుకు జరిగిందో సాంకేతిక విజ్ఞానం చెప్పలేదు. అలాగే డార్విన్ థియరీ మనిషి ఎవల్యూషన్ (evolution) ప్రక్రియలో భాగంగా ఆవిర్భావం చెందాడు అని చెపుతుంది కానీ అలా ఎందుకు జరగవచ్చో చెప్పలేదు! ఈ రెండు థియరీస్ కూడా ఒక ప్రక్రియఎలా జరిగాయో చెప్పాయి గాని అలా ఎందుకు జరగాలో చెప్పలేవు! ఇక్కడే చాలామంది ఇది దేవుడు చేసాడు అనే ఒక విశ్వాసం (మతం ఇక్కడనుండి పుట్టుంది). కొంతమంది మరి ఆ దేవుడిని సృష్టించింది ఎవరు అని? (నాస్తిక భావజాలం). అలాగని మతం అన్నిటికి సమాధానం ఇవ్వలేదు కూడా, ఉదాహరణకు విమానం తయారీ విధానం మతము నుండి పుట్టలేదు కదా! అంటే దేనికి ఉండాల్సిన పరిమీత్తులు వాటికి ఉన్నాయి! ఈ పరిమితులను హేతువాదులు మరియు మతమును విశ్వసించేవాళ్ళు అంగీకరించవలసినదే! ఈ కారణాల చేత మనకు ఈ రెండు భావజాలాలు మానవ చరిత్ర ప్రస్థానం నుండి కనపడుతాయి.
సైన్స్ పరిధిలోకి మతం వచ్చి సమాధానాలు ఇచ్చినా, మతం పరిధిలోకి సైన్స్ వచ్చి సమాధానాలు ఇచ్చినా అది వాదోపవాదాలకు దారి తీస్తుంది. రెండిటికి స్థిరమైన వైరుధ్యాలు, పరిమితులు గమనిస్తే అందరికి మంచిది.
అయినా మనం రాజ్యాంగంలో అందిరి విశ్వాసాలను గౌరవంచాలని మనందరం కలసి ఆమోదించుకున్నాం కదా! అదే మనం పాటిస్తే చాలు, ఒక భావజాలం ప్రసిద్ధి చెందాలని మనం వత్తిడికి గురికావాల్సిన అవసరం లేదేమో!