భూమి నుండి దాదాపు ౩౦ వేల అడుగుల ఎత్తులో హెన్రీ మరియు జేమ్స్ :
సెప్టెంబర్ 5, 1862
ఇంగ్లాండ్.
హెన్రీ మరియు జేమ్స్ వేడి గాలి బుడగ సహాయంతో నింగిలోకి ప్రయాణం కొనసాగిద్దామని ఆ రోజు ఉదయాన్నే సిద్ధపడ్డారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడం తో వారి ప్రయాణం కొంత సమయానికి వాయిదా వేసుకున్నారు. గాలి, వాన తీవ్రత కొంత సేపటికి తగ్గడంతో వారు తిరిగి తమ వేడి బుడగను ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు. హెన్రీ ఆ వేడి బుడగకు పైలట్ కాగా తన తోటి ప్రయాణికుడు జేమ్స్ ఒక శాస్త్రవేత్త. భూమి ఉపరితలం నుండి నింగిలోనికి సాధ్యమైనంత ఎత్తువరుకూ ప్రయాణించి వాతావరణ ఉష్ణోగ్రత మరియు వత్తిడిని నమోదు చేయాలనేది జేమ్స్ ఆరాటం[1].
తమ బుడగ భూమి ఉపరితలం నుండి నింగిలోనికి ప్రయాణం ప్రారంభించగానే జేమ్స్ తన దగ్గర ఉన్న బారోమీటర్ మరియు థెర్మోమీటర్ సహాయంతో వాతావరణ ఉష్ణోగ్రత మరియు వత్తిడిని నమోదు చేయడం మొదలుపెట్టాడు. అలా నింగిలోకి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళగానే తాము ఇద్దరు మబ్బులు పైన ఉన్నటు గమనించారు. సూర్యుడి కిరణాలు తమను నేరుగా తాకినట్టు, భూమి మబ్బుల పొరలతో కప్పినట్టు ఉన్న ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసినట్టు తమ ప్రయాణ అనుభవాలలో రాసారు హెన్రీ మరియు జేమ్స్.
భూమి ఉపరితలం మీద నుండి దాదాపు 8 కిలోమీటర్ల ఎత్తులో హెన్రీ మరియు జేమ్స్ కు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది. తట్టుకోలేనంత చలి తో వారి ఇద్దరి చేతులు వణకసాగాయి. కొంత సేపటికి జేమ్స్ కళ్ళు తిరిగి స్పృహకోల్పోవడం గమనించిన హెన్రీ, బుడగను తిరిగి కిందకు దించడానికి ప్రయత్నించాడు. కానీ హెన్రీకి కూడా చేతులు పనిచేయకపోవడంతో తన పంటి సహాయంతో తాడును లాగి, ఆ బుడగను కిందకి దించాడు. అదృష్టవశాత్తు తిరిగి బ్రతికాము అని హెన్రీ మరియు జేమ్స్ తమ అనుభవాన్ని ప్రపంచానికి పంచుకున్నారు.
వారి పరిశోధనలో, ఎత్తు పెరుగుతున్నకొద్ది వాతావరణంలో వత్తిడి మరియు ఉష్ణోగ్రత తగ్గుతూ పోతున్నాయి అని గమనించారు. వారి పరిశోధన ఫలితాల ద్వారా భూమి మీద వాతావరణ స్థితి గురించి ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందించారు.
ఈ సంఘటన వాతావరణ శాస్త్రంలో ఒక ముఖ్య ఘటనగా మనం ప్రస్తావించవచ్చు.
భారతీయ వాతావరణ శాఖలో శాస్త్రవేత్తగా సర్ హెచ్ ఫ్ బ్లాంఫోర్డ్ నియామకం:
అక్టోబర్ 5, 1864
కలకత్తా ప్రావిన్స్.
ఎప్పుడు ఎగుమతలు దిగుమతులతో హడావిడిగా ఉండే కలకత్తా ప్రావిన్స్ పోర్ట్, ఒక్కసారిగా భీకర గాలులతో , సముద్రపు అలలతో తల్లడిల్లింది. ఒక మహా తూఫాను కలకత్తా ప్రావిన్స్ ప్రజల జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. దాదాపు 6౦,౦౦౦[2] మంది ప్రాణాలు బలికొన్న ఈ దురదృష్టపు సంఘటన మన భారత దేశ చరిత్రలో ఒక చీకటి ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.
తదుపరి సంవత్సరాల్లో సంభవించిన కరువులు(1866,1871)[3]మన దేశ ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బ తీశాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ముందస్తు వాతావరణ అంచనా ప్రాముఖ్యతను గమనించిన ప్రభుత్వం 1875 వ సంవత్సరంలో భారతదేశ వాతావరణ శాఖను స్థాపించింది. దానికి కలకత్తా ప్రావిన్స్ నుండి సర్ హెచ్ ఫ్ బ్లాంఫోర్డ్ ను ముఖ్య శాస్త్రవేత్తగా నియమించింది.
సర్ హెచ్ ఫ్ బ్లాంఫోర్డ్ అప్పటికే వాతావరణం గురుంచి కొంత అధ్యయనం ప్రారంభించారు. నైరుతీ రుతుపవనాల కదలికను, వర్షపాతమును , ఉష్ణోగ్రతను, వాతావరణ ఉపరితల వత్తిడిని దేశవ్యాప్తంగా శాస్త్రీయ పరికరాలతో నమోదు చేసి, వాతావరణ స్థితిని అర్థంచేసుకోడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా, డిసెంబర్ నుండి ఏప్రిల్ మాసం వరకు దక్షిణ హిమాలయ ప్రాంతంలో అధిక మంచు కురిస్తే, తదుపరి వచ్చే నైరుతి రుతుపవనాల తీవ్రత తక్కువగా ఉండి, దేశ వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా నమోదు అయ్యి, కరువు వచ్చే అవకాశం ఉంటుందని అని ఒక శాస్త్రీయ పత్రికలో ప్రచురించారు. తానుకనుగున్న పరిశోధన ఫలితాలను ఆధారంగా మరుసటి సంవత్సరంలో వర్షపాతమును అంచనా వేసి దేశ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు[4].
ఇది మన దేశ చరిత్రలో మొట్ట మొదట వాతావరణ అంచనా నివేదిక అని మనం చెప్పుకోవచ్చు.
నేను ప్రస్తావించిన పైన రెండు ఉదాహరణలు బట్టి మీకు ఇప్పటికే వాతావరణ శాస్త్రంలో మనం ఏమి చదవవచ్చో ఒక అంచనా వచ్చుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే వాతావరణ స్థితిని అర్థం చేసుకోవడం (శాస్త్రీయ పరికరాల ద్వారా), వాతావరణ ప్రస్తుత స్థితిని అధ్యాయనం చేసుకోవడం, రాబోయే రోజుల్లో వాతావరణ స్థితిని కచ్చితంగా అంచనావేయడం వాతావరణ శాస్త్రం యొక్క ముఖ్య ఉదేశ్యం. వాతావరణ శాస్త్రంలో సముద్రము మరియు భూమి స్థితిగతుల గురించి అంచనా వేయడం కూడా ఒక భాగమే.
100 సంవత్సరాల వ్యవధిలో వాతావరణ శాస్త్రం చాల అభివృద్ధి చెందింది. ఆధునిక సైన్స్, టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు వాతావరణాన్ని కొంత మేరకు కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాము.
వాతావరణ శాస్త్రం ఎవరు చదవవచ్చు:
వాతావరణ శాస్త్రం ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టు. అంటే మీకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మీ అవసరం వాతావరణ శాస్త్రానికి ఉంటుంది.
ఒకవేళ ఇంటర్మీడియట్ లో గణితం (మ్యాథ్స్), భౌతిక శాస్త్రము (ఫిజిక్స్) మరియు రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) చదివి ఉంటె మీరు నేరుగా B.Sc. Meteorology (వాతావరణ శాస్త్రం) చేయవచ్చు.
మీరు ఒకవేళ B.Sc. లేదా B.Tech. ఇంజనీరింగ్ లో గణితం (మ్యాథ్స్), భౌతిక శాస్త్రము (ఫిజిక్స్) మరియు రసాయన శాస్త్రం(కెమిస్ట్రీ) చదివి ఉంటె, మీరు M.Tech లేదా M.Sc Meteorology (వాతావరణ శాస్త్రం) లేదా క్లైమేట్ సైన్స్ (Climate Science) చేయవచ్చు.
మీరు కంప్యూటర్ సైన్స్ చదివివుంటే వాతావరణ నమూనా అభివృద్ధిలో (క్లైమేట్ మోడల్స్ డెవలప్మెంట్) లో పనిచేయవచ్చు. ఇందు కోసం మీరు మీ B.Tech ఇంజనీరింగ్ తరువాత M.Tech లేదా M.Sc Meteorology (వాతావరణ శాస్త్రం) చదవచ్చు.
మీరు ఎలక్ట్రానిక్స్ చదివి ఉంటె, వాతావరణ ఉపగ్రహాల అభివృద్ధిలో (డెవలప్మెంట్) పనిచేయవచ్చు. ఇందు కోసం మీరు మీ B.Tech ఇంజనీరింగ్ తరువాత M.Tech లేదా M.ScMeteorology (వాతావరణ శాస్త్రం) చదవచ్చు.
మన దేశంలో వాతావరణ శాస్త్రం ఎక్కడ చదవవచ్చు:
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ[5]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – భుబనేశ్వర్[6]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – బొంబాయి[7]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – హైదరాబాద్[8]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ – బెంగుళూరు [9]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరాగపూర్[10]
- ఆంధ్ర యూనివర్సిటీ — విశాఖపట్నం [11]
- కేరళ యూనివర్సిటీ — కొచ్చిన్ [12]
- పూణే యూనివర్సిటీ — పూణే [13]
ఇంకా మరెన్నో సంస్థలు ఉన్నాయి, మీరు ఇంటర్నెట్ లో వెతకవచ్చు.
వాతావరణ శాస్త్రంలో అవకాశాలు:
వాతావరణ శాస్త్రం లో పట్టా ఉంటె మీకు మంచి అవకాశాలే లభిస్తాయి. ఉదాహరణకు ఉద్యోగ అవకాశాలకోసం మీరు ఈ కింద సంస్థల్లో దరకాస్తు చేసుకోవచ్చు.
- భారతీయ వాతావరణ శాఖ[14]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ట్రాపికల్ మెట్రోలాజి[15]
- నేషనల్ సెంటర్ ఫర్ మీడియం వీధేర్ రేంజ్ ఫోరేకాస్ట్[16]
- నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషన్నోగ్రఫీ [17]
- నేషనల్ ఇంస్టిట్యూయే అఫ్ ఓషన్ టెక్నాలజీ[18]
ఇంకా మరెన్నో సంస్థలు ఉన్నాయి, మీరు ఇంటర్నెట్ లో వెతకవచ్చు.
వాతావరణ శాస్త్రం కేవలం మన భూమి మీదకే పరిమితం అవ్వదు. నాసాలో గత 10 సంవత్సరాల నుండి అంగారకుడు (మార్స్) వాతావరణం మీద పరిశోధనలు జరుగుతున్నాయి[19]. మార్స్ క్లైమేట్ మోడలింగ్ సెంటర్ అనే విభాగంలో నాసా సంస్థవారు మార్స్ మీద వాతావరణ అంచనా కోసం ఒక వాతావరణ నమూనా కూడా తయారు చేసి పరిశోధనలు జరుపుతున్నారు.
ఇక ఆలస్యం ఎందుకు, కస్టపడి-ఇష్టపడి చదవండి, వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేసే ఆధునిక విజ్ఞాన్ని ఈ ప్రపంచానికి అందచేయండి.