జీవితంతో పరిగెత్తలేక అలసిపోయిన నేను ఒక రోజు మా ఊరి సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాను. ఇక పరిగెత్తడం అవసరమా అనే ఆలోచన నన్ను వెంటాడింది!
సుమారు సాయంత్రం మూడు గంటలకు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బల మీద కూర్చుని, ఎక్కడో దూరంగా ప్రయాణిస్తున్న చిన్న పడవను చూస్తూ ఉన్నాను. సముద్రం చేసే చప్పుడు తప్ప వేరే శబ్దమే లేదు, పలకరించడానికి ఒక్క మనిషి కూడా లేడు. నిజమైన ఏకాంతానికి అర్ధం ఈ ప్రకృతి నాకు తెలియచేస్తుందేమో అని అనిపించింది. బలంగా వీస్తున్న సముద్రపు గాలి నన్ను వెన్నకి నెడుతోంది. ఇంతలో ఒక చిన్న పీత నాతో దోబూచులు ఆడడం మొదలు పెటింది. ఒక నిముషం తాను చేసుకున్న రంద్రంలోకి దూరడం, మరో నిముషం ఆ రంద్రం ద్వారా పైకి వచ్చి నాతో ఆడుకోవడం. ఇలా కొంత సేపు మా ఇద్దరి సమయం గడిచింది.
మళ్ళీ నా చూపు దూరంగా ప్రయాణిస్తున్న ఆ పడవ మీదకు వెళ్ళింది. ఈ సారి ఆ పడవ ఇంకొంచెం పెద్దగా కనపడింది. ఇంతలో మళ్ళీ ఒక ఆలోచన, ఎంత కష్టపడినా అనుకున్న గమ్యం చేరుకోలేక పోతున్నా, ఇక పరిగెత్తడం అవసరమా అని! నిరాశ నిస్పృహ ఆ సముద్రపు గాలితో పాటు నన్ను వెనక్కు లాగుతున్నట్టు అనిపించింది. ఇంతలో ఒక పెద్ద అల రావడంతో నా కాళ్ళ జోడులు తడిసిపోయాయి. ఒక్కసారిగా నా ఆలోచన ఆ అలల వైపుకు వెళ్ళింది. మధ్యాహ్నం నుండి ఆ అలలు అలసట లేకుండా వస్తూనే ఉన్నాయి! వాటికి అలసట రాదా? మరి నాకెందుకు నా జీవితం మీద అలసట వస్తుంది? దీనికి కారణం ఏమిటి?
నాకు ఉద్యోగం లేదు, పై చదువుకు మంచి కళాశాలలో సీట్ కూడా రాలేదు,
అమ్మ నాన్నకి మంచి కొడుకు కాలేకపోయాను,
చేతిలో డబ్బు లేదు, సమాజంలో మంచి పేరు లేదు.
ఇలా నాలో సంఘర్షణ, తెలియని అలసట, నిరాశ నిస్పృహ, నా మీద నాకే ద్వేషం!
ఇంతలో ఎక్కడో దూరంలో ఉన్న పడవ వడ్డుకు చేరింది! ఆ పడవ వడ్డుకు రాగానే ఆ జాలరి వాళ్ళ కుటుంబం వచ్చి ఆ పడవలో ఉన్న చేపల్ని బుట్టలో వేయసాగారు. ఆ జాలరి వాళ్ళ కుటుంబంతో, “అనుకున్న వేట పడలేదు” అని నిరుత్సాహంగా చెప్తే, దానికి వాళ్లు ఈ రోజు గడవడానికి ఇవి సరిపోతాయిలే, రేపు పెందలాడే వెళ్లి మంచి వేట పడుదువులే! ఇంటికిపోయి బోంచేదువుగాని అని దైర్యం చెప్పి, వారందరు వారి ఇంటికి వెళ్లిపోయారు!
ఎందుకో ఆ సంఘటన నన్ను మళ్ళీ ఆలోచింపచేసింది. ఈ రోజు నిరుత్సాహంలో కూడా ఆ జాలరి కుటుంబం రేపటి ఆశను చూసింది!
పెద్దగా నా భావోద్వేగాలను ఇతురులతో పంచుకొని నేను, నిదానంగా నాకు నేను సర్ది చెప్పుకున్నా, రేపటి ఆశను కొంత వెతుకున్నా. జీవితంతో పరుగు అవసరం లేదు, నిదానంగా నిలకడగా నడవాలి అని నిర్ణయించుకున్నా. జీవితాన్ని ఆస్వాదించడం, చిన్న చిన్న సంతోషాలు వేత్తుకోవడం, మంచి పుస్తకాలు చదవడం మొదలు పెట్టా!
కొంత మెరుగుగా అనిపించింది. నాలో ఈ మార్పుకు కారణం నన్ను నేను ప్రేమించుకోవడమేనెమో!
మనల్ని మనం ప్రేమించుకోలేని వాళ్ళం, ఇంకొకరిని ప్రేమించగలమా?
ఇంకొకరిని ప్రేమించేముందు నేను నిజాయితీగా ప్రేమలో పడింది నాతోనేనేమో!

చిత్రం: Niranjan Mohite, Aug 18, 2020, Instagram.