పిల్లలకు ఎప్పుడు స్వేచ్ఛనివ్వాలి?

పదో తరగతి చదువుకునే రోజులవి,

ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బయాలజీ పాఠం వినే రోజు రానే వచ్చింది.

స్కూల్ కి ఏరోజు ఆసక్తిగా వేళ్ళని నేను, పెందలాడే లేచి హడావిడి చేస్తున్న దృశ్యాన్ని చూసి మా అమ్మగారు బహుశా నన్ను శివపుత్రుడు సినిమాలో హీరో విక్రమ్ ను చూసినట్టు చూసింది అనిపించింది.

పైగా బయాలజీ పాఠం ఎలాగైనా వినాలనే ఉత్సాహంలో “చిరుగాలి వీచెనే…. చిగురాశ రేపెనే….వెదురంటి మనసులో రాగం వేణువూదెనే” లాంటి పాటను నా మనసులో పాడుకుంటూ ఉండేసరికి బహుశా మా అమ్మగారికి నా మీద ఉన్న ఆలోచన బలపడిందేమో అని నా అనుమానం!

పొద్దున్న స్నానం చేసి, యూనిఫామ్ వేసుకుని సుమారు 15 నిముషాల ముందు మా బస్సు స్టాప్ కి చేరుకున్నాను. మా బస్సు స్టాప్ కి మా ఇంటి నుండి కొంత దూరం నడవాలి, ఆ రోజు నేను నడుస్తున్న ఉత్సాహానికి కబాలి సినిమాలో “నిప్పురా … తాకరా ” అనే బాక్గ్రౌండ్ స్కోర్ బాగా సూట్ అవుతుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు.

మొత్తానికి బస్సులో స్కూలుకి చేరుకున్న నేను, పొద్దున్నే అసెంబ్లీ మరియు ప్రేయర్ తొందరగా అయిపోవాలని మొట్టమొదట సారి నేను నమ్మని దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా అత్యుత్సాహమే గాని ఎప్పుడు జరిగేంత సమయమే పట్టింది అసెంబ్లీ అయిపోడానికి!

ఇక గంట మోగింది, మా బయాలజీ మేడం గారు వచ్చి బోర్డు మీద “Human Reproductive System” అని రాసారు. ఎప్పుడు చిన్నగా కనపడే ఆ బోర్డు ఒక్కసారి మా ఊరి విజయలక్ష్మి థియేటర్ 70 mm స్క్రీన్ లాగా కనిపించింది. మా మేడం ఈ పాఠంలో కొన్ని ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అని రెండు ప్రశ్నలు టిక్కు పెట్టి, ఈ పాఠం మీరే చదువుకోండి అని చెప్పి 5 నిముషాల్లో ముగించారు!

ఒక్కసారి నా కబాలి బాక్గ్రౌండ్ స్కోర్ కాస్తా “నీ గుండె పగిలింది, నా ఊపిరి ఆగింది, ఎవరు కొట్టారు నిన్ను ఎవరు కొట్టారు?” అనే బాక్గ్రౌండ్ స్కోర్ అయ్యింది! నా స్కూల్లో ఇది ఒక చీకటి రోజు అని నా ఆత్మ కథలో రాసుకుంటాను (ఏ నెహ్రు , గాంధీ గారికేనా ఆత్మలుండేది, నాకు ఉండదా ఆత్మ?)

అమావాస్య రోజున చంద్రుడు వెలిసినట్టు, సినిమా థియేటర్లో కరెంటు పోతే జనరేటర్ మొదలెట్టినట్టు , ఎడారిలో చల్లటి గోల్డ్ స్పాట్ సీసా ఇచ్చినట్టు నా దీన పరిస్థితిని ఆదుకోడానికి ఒక రాజులా వచ్చి ఒక గొప్ప ఐడియా (ఐడియా అఫ్ 21st డికేడ్) ఇచ్చాడు నా స్నేహితుడు ప్రతాప్! ఒరేయ్ పిచ్చోడా ఇవ్వని తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న స్వాతి పుస్తకంలో “సుఖ సంసారం”చదువు అని చెప్పాడు. ఒక్కసారిగా నాకు ప్రతాప్ టెర్మినేటర్ సినిమాలో హీరో అంత గొప్పవాడిలా కనిపించాడు!

సాయత్రం ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి, స్వాతి పుస్తకంలో Dr సమరం రాసిన సుఖ సంసారం చదవడం మొదలు పెట్టాను! అదేంటో కానీ, స్కూల్లో ఒక్కసారి చదివితే ఎప్పుడు అర్ధం కానీ పాఠాలు, ఈ సుఖ సంసారం ఒక్కసారి చదివితే తెగ అర్ధమయిపోయినట్టు అనిపించింది. ఇలా ఒక స్వాతి పుస్తకం పూర్తి చేసి, ఆశ ఆగక మరో పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాను! ఆ పుస్తకం చదవడంలో నిమగ్నమయిపోయిన నాకు ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. కొంత సేపటి తరువాత నా వీపు విమానం మోత మోగింది అని అర్థమైంది!

నేను సుఖసంసారం చదవడం గమనించిన మా అమ్మగారు, గెట్టిగానా వీపు విమానం మోత మోగించారు! మీ నాన్నకు చెప్తాను ఆగు అని నన్ను భయపెట్టారు. అమ్మ అంటే చేత్తో కొట్టి వదిలేసింది, ఇక మా నాన్నగారైతే ఇంట్లో ఉన్న ఖరీదైన లేథెర్ బెల్ట్ను వాడతారని కనీసం ఒక అరడజను సార్లు మూత్రవిసర్జన చేసి వచ్చాను! మా నాన్న గారు రానే వచ్చారు, మా అమ్మగారు నా విషయం చెప్పకనే చెప్పారు! ఇక నేను బెల్ట్ ఎప్పుడు తీస్తారా అని వెయిటింగ్!

మా నాన్నగారు “ఒరేయ్ ఇటు రా” అని అన్నారు! నాకు ఎందుకో మా నాన్నగారిలో ఈవిల్ డెడ్ సినిమా దర్శకుడు కనపడుతున్నట్టు అనిపించింది! ఇక నా పని అయిపోయింది అనుకున్నాను!

పోయి నీ బయాలజీ పుస్తకం తీసుకురా అని అడిగారు! నాకు అర్ధం కాలేదు, హోమ్ వర్క్ కోసం అడుగుతున్నారని అనుకున్నాను! కానీ ఆ రోజు పాఠం “”Human Reproductive System” గంట చెప్పారు నాకు అర్థమైనట్టు! మా నాన్నగారు స్వయానా బయాలజీ టీచర్, రోజు నా హోమ్ వర్క్ చూస్తుంటారు కాబట్టి ఆ పాఠం చెప్పారు నా మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుని.

నిజానికి నాది సుఖసంసారం చదివి అర్ధం చేసుకునే వయసు కాదు. కేవలం ఆ వయసులో కలిగిన స్టిమ్యులేషన్ వల్ల అలా చేసేనేమో! కానీ మా నాన్నగారు నా మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుని, పరిపక్వతతో వ్యవహరించారు. ఆశర్యం ఏమిటంటే ఆ రోజు నుండి నాకు స్వేచ్ఛను ఇచ్చారు. ఆ రోజు నుండి ఆయనకు మరింత దగ్గరవ్వగలిగాను. అలా అని మా నాన్నగారు గొప్పవారని ఇక్కడ మీకు చెప్పే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అందరిలోనూ బాలలు బలహీనతలు ఉంటాయి!

ఇక మీకు చెప్పదలచినది ఏంటంటే, పిల్లలకు ఎప్పుడు స్వేచ్ఛనివ్వాలి అనేది వారి తల్లిదండ్రుల సొంత నిర్ణయం, కానీ సరైన సమయంలో స్వేచ్ఛ నివ్వడం వల్ల నేను మా తల్లిదండ్రులకు దగ్గరయ్యాను అని మాత్రం చెప్పగలను.నా భావాలను వారితో స్వేచ్ఛగా పంచుకోగలిగాను, సరైన మార్గంలో నడవగలిగాను.

అన్నట్టు మర్చిపోయాను, ఆ మరుసటి రోజు నన్ను సుఖ సంసారం చదవమన్న ఆ ప్రతాప్ గాడిని శివపుత్రుడు సినిమా క్లైమాక్స్లో విక్రమ్ విల్లన్ను కొరికినట్టు కొరకాలనుకున్నాను, మా అమ్మ కల్పిత ఊహను నిజం చేయకూడదని వదిలేసాను! 🙂

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x