విచిత్రమైన పెళ్లి !

నా వివాహం ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగింది. ఆ క్రమంలో జరిగిన కొన్ని విషయాలు నాకు చాలా అర్థరహితంగా అనిపించాయి. అవి ఇక్కడ పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు అర్థరహితం అనిపించినంత మాత్రనా అవి నిజంగానే అందరికి అర్థరహితం అని అనిపించక పోవచ్చు, గమనించ గలరు! మీకు కొంచెం నాగురించి చెప్పి, ఈ సమాధానం మొదలుపెడతాను. నేను చిన్నప్పటినుండి హేతువాదిని! హేతువాద ఆలోచనలతోనే బ్రతికాను. కాబట్టి నేను చూసే ప్రపంచం కొంత వేరుగా ఉండొచ్చేమో! నా శ్రీమతిగారి కుటుంబం ఆధ్యాత్మిక జీవితంకు దగ్గరగా బ్రతుకుతున్నవారు (వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను).

ఇక నా వివాహం జరగకముందు నాకు ప్రేమ-పెళ్లి చూపులు జరిగాయి. అందులో నేను, నా శ్రీమతి గారి కుటుంబం పాలుపంచుకోవడం జరిగింది (గమనకి అప్పుడు ఎండాకాలం కావడంతో మజ్జిగ ఇచ్చారు, పాలు ఇవ్వలేదు!). విషయం ఇక్కడనుండి మొదలుపెడితేనే బాగుంటుందేమో —

పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న మా కాబోయే మామ గారు నుండి, “బాబు నువ్వు ఏ చర్చికి వెళతావు?”

నేను ఫస్ట్ బాల్ డక్ అవుట్!

ఇప్పుడు నేను ఏం చెప్పాలి? సరే అప్పుడపుడు వెళ్ళ్తాను అని చెప్పానంటే ఏ చర్చి కి వెళ్తావు అని అడుగుతారేమో, లేకపోతే చర్చి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురమ్మంటారేమో అని అదో ఆలోచన!

సరే కాలేజీలో అటెండెన్స్ అంటే మేనేజ్ చేయొచ్చు కానీ, ఈ చర్చికి అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తాం! ఎందుకొచ్చిన గొడవ లే అని నేను చర్చికి వెళ్లనని చెప్పేశా!

ఇదే నాకు మొదటిసారిగా విచిత్రంగా అనిపించింది, ఇదేంట్రాబాబు నా పేరు కూడా తెలుసుకోలేదు, ఈ చర్చి గోల ఏంటి అని!

సరే కొంచెంసేపు ఏదోలా మేనేజ్ చేశాను నా ప్రేమ పెళ్లి చూపులని. అంత అయిపొయింది, నేను అక్కడికి తీసుకువెళ్లిన డజన్ ఆపిల్ పండ్లు వారికీ ఇచ్చి బయలుదేరుదాం అని అనుకునే లోపే, బాబు ప్రార్థన చేసుకుందాం లెగువు అని అన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఒక పని చేసే ముందు ప్రార్థన, జరిగిన తరువాత ప్రార్థన చేసే అలవాటు ఉందన్నమాట వారికి (ముఖ్య గమనిక –ప్రార్థన సమయం కేవలం అరగంట మాత్రమే ).

మళ్ళీ ఇప్పుడు ఇంకో భయం వేసింది నాకు, వారు ప్రార్థన చేస్తే బాగానే ఉంటది కానీ, నన్ను ప్రార్థన చేయమంటే నేను బుక్ అవుతాను — అప్పుడు నాకు వెంకీ మామ గుర్తుకువచ్చాడు! , “దేవుడా ఓ మంచి దేవుడా, తినడానికి ఆపిల్ పండ్లు ఇచ్చావ్, తాగడానికి మజ్జిగ ఇచ్చావ్…..”

అదృష్టం నాకు ఆ అవకాశం దొరకలేదు 🙂


కట్ చేస్తే, పెళ్లి ఎక్కడ జరగాలి అని చర్చ! సరే ఇరువర్గాలవారు (మా ఇంటివారు, నాకు కాబోయే ఇంటివారు) తీవ్రంగా చర్చించి బాప్టిస్ట్ చర్చి వైపు మొగ్గుచూపారు!

ఇక్కడో పెద్ద సమస్య. పెళ్ళికూతురికి బాప్తీసమ్ (baptesim) సర్టిఫికెట్ ఉంది కానీ, పెళ్లి కొడుకుకి లేదు. ఆ సర్టిఫికెట్ ఉంటె గాని ఆ చర్చలో పెళ్లి జరగదు! సరే ఇప్పుడు నేను బాప్తీసమ్ తీసుకోవాలని పెద్దల నుండి విశ్వసనీయ సమాచారం. తప్పేదేముంది, సరే కానీయండి అని చెప్పాను. మా కాబోయే మామగారు ఒకరోజు ఫోన్ చేసి బాబు విశాఖపట్నం బీచ్ దగ్గరకు వచ్చేయి తొందరగా అని చెప్పారు. సరే అని నేను కూడా బయలుదేరాను.

సముద్రం దగ్గరకు చేరుకోగానే ఒక నలుగురు దైవ సేవకులు బైబిల్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు! విషయం ఏంటంటే ఆ రోజు నేను నా పాపాలు కడుక్కోవాలంట ఆ సముద్రం లో (రెండో ముఖ్య గమనిక — అక్కడ సబ్బు, షాంపూ ఇవ్వలేదు )! సరే ప్రాసెస్ మొదలయింది. నలుగురు బైబిల్ చదివారు, ఏదో కేవలం ఒక అర్ద గంట మాత్రమే వాక్యం చెప్పారు (నాకు ద్వాపరియుగం అంత సమయం పట్టిందనిపించింది!). ఇక తరువాత నుండి మొదలయింది ప్రశ్నల పరంపర —

బాబు నువ్వు బైబిల్ లోని వాక్యం చదువు అని అడిగారు. అది ఎక్కడుందో వెతికేసరికే సముద్రం లో పొద్దున్న అల పోయి మధ్యాహ్నం అల మొదలయిందని అనిపించుంటది అక్కడున్నవారికి! సరే చదవడం మొదలుపెట్టాను –నాకేమో నోరు తిరగడం లేదు ఆ వాక్యాలకు . ఇక నా సంగతి అర్ధమయిపోయింది అక్కడ ఉన్న పాస్టర్లకు — ఇతనికి బైబిల్ పెద్దగా టచ్ లేదని!

“సరే బాబు ఇక నీ పాపాలను ఒప్పుకునే సమయం వచ్చింది అన్నారు”

బాబు, నువ్వు సిగ్గరేట్, మందు ఎప్పుడన్నా ముట్టుకున్నావా. ముట్టుకుంటే అంగీకరించి ఇక ముందు దేవుడుకి బాద్యుడగా ఉంటాను అని ప్రమాణం చేయి అన్నారు.

ఇప్పుడు నేనేం చెప్పాలి, “బలే వారే సార్, ఎప్పుడో స్పెషల్ అకేషన్స్ తప్పిపితే రెగ్యులర్ గా ఏమి లేదు” అని చెప్పాలనుకున్న :p , మళ్ళీ ఎందుకొచ్చిన గొడవరా బాబు అని , “లేదు” అని చెప్పేశా!

తరువాత ఏ స్త్రీ నయినా ప్రేమించావా అని అడిగారు?

అప్పుడు నేను మనసులో “ఎనిమిదో తరగతితో మొదలు పెడితే, పెద్ద లిస్ట్ ఏ ఉంది కదా!” ఇప్పుడు చెపితే సముద్రం లో సాయంత్రం అల కూడా వచేస్తుందేమో అని నేను, ఒకరిని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ వారు నన్ను ప్రేమించలేదు అని చెప్పాను.

ఇక ఇలా చాలా జరిగాయి –ఇవ్వని రాస్తే మీకు చదవడానికి నీరసం వస్తుంది, తరువాత నన్ను Quora లో పెద్ద సమాదానాలు రాస్తూ దండయాత్ర చేస్తున్నావ్ అని బహిష్కరిస్తారేమో!

***************************************

ఇక మా పెళ్ళిజరిగేటప్పుడు జరిగిన తంతు చెప్పనవసరం లేదు, బైబిల్ లో కొన్ని వాక్యాలు చదవమన్నారు –మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయ్యాను, మా ఇద్దరి చేత ప్రమాణాలు చెప్పించారు, ఇక నేను ఆ ప్రమాణాలు సర్రిగా చదవలేదు! ఇప్పుడు నా శ్రీమతి గారి కుటుంబం తరుపున వచ్చిన పాస్టరుగారు తెగ చెప్తున్నాడు నా శ్రీమతి గురించి. చిన్నపుడు నుండి చర్చలో విశ్వాసంగా ఉంటుందని, బైబిల్ బాగా చదువుతుంది, పాటలు పాడుతుంది, విశ్వాసం తో ఉంటుంది అని ఇలా చాలా మంచి మాటలు చెప్పారు. సరే అప్పటిదాకా బాగుంది కానీ ఇప్పుడు మా కుటుంబం తరుపున పాస్టర్ వేదికనెక్కాడు. ఇప్పుడు లెక్క ప్రకారం అయన నా గురించి చెప్పాలి!

నేనేమో చిన్నపటి నుండి ఎప్పుడు చర్చి వంక చూడలేదు, పైగా ఆ పాస్టర్తో నాకు పెద్ద గొడవ చిన్నప్పటినుండి. అయన మొదలెటాడు, ఎదో వాక్యం చెప్తూ మా కుటుంబం లో మా తల్లి దండ్రుల గురించి చెపుతూ బాగానే కవర్ చేసారు. కానీ నా గురించి మాత్రం ఒక్క మాట చెప్పలేదు! వేదిక దిగే సమయంలో మాత్రం నాకు “సింగమలై లుక్” ఇచ్చి దిగారు మా పాస్టర్ గారు ! నేను “టైం రా టైం” అనుకున్న. ఇలా చాలా విచిత్రాలు జరిగాయి పెళ్లి రోజున!

సరే పెళ్లిఅయిపోయింది ఇక సాయత్రం ప్రశాంతంగా ఇంటికెళ్లి పడుకోవచ్చు అనుకున్నా! నేను మా శ్రీమతి గారింటికి వెళ్లాలని కబురొచ్చింది! సరే అని ప్రశాంతoగా పడుకోవడనికి రూంలోకి వెళ్ళాము, ఇక మా కోసం మా అత్త గారు రూంలోకి పాలు పండ్లు తీసుకొచ్చి, “మీ దాంపత్య జీవితం కోసం ప్రార్థన చేసుకుందాం అని మొదలెట్టారు “పరిశుద్ధ దేవుడా …….” As usual, ఒక అరగంట మళ్ళీ దైవధ్యానంలోకి!

ఇవి నాకు విచిత్రంగా అనిపించినా సంఘటనలు!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x