సాయంత్రం కొంత సేపు సేద తీర్చుకోడానికి మా ఇంటి మేడమీదకు వెళ్ళాను. అంతా చీకటి, నిశబ్దం. మా ఇంటి పక్కనే ఉన్న పొలం నుండి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంది. ఆ పొలంలో మిడతల దండు నిశబ్దానికి భంగం కలిగించేలా అప్పుడపుడు శబ్దాలు చేయసాగాయి. మా వీధి కుక్క నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి అరవడం మొదలుపెట్టింది.
ఆ రోజు అమావాస్య కావడంతో చంద్రుడు ఆ రోజు తనకి తాను సెలవు ప్రకటించుకున్నాడు. నల్లటి ఆకాశంలో అక్కడక్కడా వెలుగుతున్న నక్షత్రాలు నాకు కనపడ్డాయి. ఎంత బాగున్నాయో ఆ నక్షత్రాలు చూడడానికి. అవి నాదగ్గర నుండి ఎంత దూరంలో ఉన్నాయో కదా? కనీసం కొన్ని వందల కాంతి దూరం ఉండొచ్చేమో!
ఇంతకీ ఆ నక్షత్రాలు అసలు అక్కడకు ఎలా చెరుకున్నాయి?
ఏంటో ఈ పిచ్చి ప్రశ్నలు నన్ను ఎప్పుడు నిద్రపోనివ్వవు!
ఎప్పుడో చదివినట్టు గుర్తు, దాదాపు 13.6 బిలియన్ల సంవత్సరాల క్రితం కంటికి కనిపించనంత శక్తివంతమైన వేడి నలుసు బద్దలయ్యి ఈ విశ్వంగా మారిందట. అప్పటినుండి విశ్వం చల్లారుతూ చల్లారుతూ అణు కణాలను ఏర్పాటుచేసుకుందట! నెమ్మదిగా ఆ కణాలు దగ్గరయ్యి నక్షత్రాలు అయ్యాయట! అలాగే తరువాత ఎన్నో పెద్ద పెద్ద గ్రహాలు, గాలాక్సీల ఏర్పడాయట!
[1]కేవలం ఒక రాయిగా ఉండే భూమిని ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో నుండి ప్రయాణించి వచ్చి పడిన ఒక నక్షత్రంలోని కణాలు మన భూమి మీద జీవకణాన్ని సృష్టించిందట! అలా మొదలయింది మన భూమి మీద జీవం. కోన్ని వేల సంవత్సరాలనుండి ఎన్నో క్రిములు, కీటకాలు, జంతువులు, పక్షులు యుద్దాలు చేసుకొని, మరణించి, తిరిగి పుట్టి మన భూమి మీద జీవనాన్ని కొనసాగించాయట. ఇలా కొన్ని వేల సంవత్సరాల తరువాత మన భూమి మీద మనిషి పరిణామం చెందాడట!
మనిషి తన ఉనికి కోసం ఎన్నో మృగాలతో, క్రిమి-కీటకాలతో పోరాడి పోరాడి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద బ్రతుకుతున్నాడట!
మనిషి తన ప్రతిరూపాన్ని నిర్మించుకోవడానికి కొన్ని మిలియన్ల శుక్రకణములను స్త్రీ అండoలోకి విడుదల చేసి, అందులో ఎన్నో లక్షల శుక్రకణాలు చనిపోయి, యాదృచ్చికంగా కేవలం ఒక శుక్రకణం అండoలోకి ప్రవేశించి మరో మనిషి ప్రాణాన్ని పోస్తుందట.
ఏమి ఈ జగన్నాటకం…………!
అయినా, నా జీవితంలో నా పుట్టుకకు మించిన యాదృచ్చికం ఇంకేమ్మనా ఉంటుందా?
“Out of all improbables, remarkable concurrence of many events together led to my birth in this universe”.
My birth is a coincidence afterall!
ఫుట్‌నోట్స్