నా స్నేహితుడు ఒక రోజు పొద్దున్నే ఫోన్ చేసాడు, “నా పెళ్లి కుదిరిందిరా, నువ్వు తప్పకుండ రావాలి, అనూకి కూడా చెప్పాను, ఇద్దరు టికెట్స్ బుక్ చేసుకోండి” అని చెప్పాడు.
నేను, వాడు, అనూ ఎంటెక్ క్లాసుమేట్స్. మేమందరం మంచి స్నేహితులం. పీహెచ్డీ చేయడానికి నేను అనూ జర్మనీకి వచ్చాం, వాడు మాత్రం ఇండియాలోనే పీహెచ్డీ చేస్తున్నాడు. అప్పటికి నేను అనూ ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. కానీ అనూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చకపోవడంతో నన్ను వద్దు అనుకున్నారు. తర్వాత నేను అనూ జర్మనీ వచ్చేసాం, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి తెలీదు నేను కూడా జర్మనీ లో ఉన్నానని.
ఎలాగూ జర్మనీ వచ్చి సంవత్సరం అయ్యింది కదా అని నేను అనూ నా స్నేహితుడి పెళ్లి కోసం పాట్నా వెళ్ళడానికి నిర్ణయించుకుని, నెల ముందే టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. సర్రిగా ప్రయాణంకి మూడు రోజులముందు, అనూ వాళ్ళ ఇంట్లో మా సంగతి తెలిసిపోయింది (అను డైరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదవడం వళ్ళ తాను నన్ను బాగా ఇష్టపడుతుందని వాళ్ళకి అర్ధమయింది). మొత్తానికి మేము ఇండియా వస్తున్నాం కదా, ఇక పెళ్లి చేసేదాం అని మా ఇరువురి ఇంట్లోవాళ్ళు నిర్ణయించుకుని మా పెళ్లి పనులు మొదలుపెట్టారు.
మాకు మా పెళ్ళికి సమయం చాల తక్కువుండడం వలన, పాట్నా వెళ్లే ఆలోచన విరమించుకుందాం అనుకున్నాం. కానీ ఫ్లైట్స్ టికెట్స్ క్యాన్సిలేషన్ అవ్వకపోడం వలన పాట్నా వెళ్లవలిసి వచ్చింది. పాట్నా ఎయిర్పోర్ట్లో దిగంగానే నా స్నేహితుడు పెద్ద పూలబొకేతో మమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి వచ్చాడు. అప్పుడు నేను వాడితో “మేము నీ పెళ్ళికి ఉండడం లేదు రా” అని అన్నాను. వాడు బిత్తరపోయి, అదేంటి రా నాకోసం ఇన్నిగంటలు ప్రయాణం చేసి వచ్చారు, పెళ్ళికి ఉండనంటారు ఏంటి రా అని అడిగాడు. అప్పుడు మేము వాడితో “వచ్చింది నీ పెళ్ళికే, కానీ ఇంకో వారంలో మా పెళ్లి, ఎల్లుండి మా నిశ్చితార్ధం” అని చెప్పాము.
వాడికి రెండు నిముషాలు ఏమి అర్ధం కాలేదు, కొంచెం సేపు అయ్యాక “కాంగ్రాట్యులేషన్స్ రా” అని చెప్పి మమ్ములను నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కించాడు.
అలా మా స్నేహితుడి పెళ్లికని వెళ్లి, మేము ఇద్దరం పెళ్లిచేసుకున్నాము.