మా జోనాథన్ మామ!

ఓరోజు సాయంత్రం ఇంటి పక్కన వీధిలో నా స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటున్నాను, ఇంతలో జోనాథన్ మామ డాన్స్ ఆడే సమయం వచ్చేసింది అని కబురు వచ్చింది. ప్రతి డిసెంబర్ నెలలో మా కాలనీలో డాన్స్ ప్రోగ్రాములు నిర్వహించడం ఓ ఆనవాయితి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరం పరుగు తీసాం జోనాథన్ మామ డాన్స్ చూడడానికి.

జోనాథన్ మామకు మా కాలనీలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మామ సుమారు ఆరు అడుగులు ఉండేవాడు, కాలనీ అంతటిలో అందగాడు. ఏ ఇంట్లో పని ఉన్నా జోనాథన్ మామ పట్టుకుంటే పని అయిపోయినట్టే. మామకు మంచితనమే కాదు, గుండె ధర్యం కూడా ఎక్కువే. కాలనీలో వరదలు వచ్చిన సమయంలో కాలువ గట్టుకెళ్ళి ఒంటిచేత్తో ఆనకట్ట కట్టేవాడు. మా కాలనీలో మొదటి ప్రేమ వివాహం మామదే. చెన్నై వెళ్లి ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి, పెళ్ళాడి మా కాలనీ లోకి తీసుకొచ్చాడు. ఈ సంఘటన నుండి కోలుకోడానికి మా కాలనీ పెద్దలకు సుమారు ఆరు నెలలు పట్టింది. ఇక మా కాలనీ డాన్స్ ప్రోగ్రాముల విషయానికి వస్తే, ప్రతీ ఏడు జోనాథన్ మామ స్పెషల్ పెర్ఫార్మన్స్ ఉండేది. ఈ సంవత్సరం ఏ పాటకు డాన్స్ వేస్తాడో అని అందరూ ఎదురుచూశాం.

ఇంతలో స్టేజీమీద లైట్లు అన్ని ఆరిపోయాయి, కరెంటు పోయిందేమో అని అనుకున్నాం. గీతాంజలి సినిమాలో “ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా“ అనే పాట మొదలయింది. ఒళ్ళునిండా ఎర్ర రంగు లైట్లు తగిలించుకుని ఓ వ్యక్తి స్టేజి మీద రెండు చేతులు చాపి, ఓ ప్రియా ప్రియా అని విరహవేదనను చూపించసాగాడు. ఇంకెవరు, ఆ వ్యక్తి మా జోనాథన్ మామ. ప్రియురాలిని చేరుకోలేని ఓ ప్రియుడుగా వేసిన డాన్స్ ఇప్పటికి ఎవ్వరం మర్చిపోలేదు. డాన్స్ అనేదానికంటే మా మామ ఒంటిమీద ఉన్న ఎర్ర బల్బులు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆ సాయంత్రం అంతటిలో హైలెట్.

ప్రోగ్రాం అయిపోయినేమ్మటే, ఊరంతా జోనాథన్ మామ డాన్స్ మీదనే చర్చ. కరెంటు అనే భయం లేకుండా ఒళ్ళంతా వైర్లు పెట్టుకుని డాన్స్ వేసిన మా మామ కథ మా కాలనీ లో ఒక అందమైన జ్ఞాపకం. మా మామను కాలనీలో ఆడవాళ్ళూ అందరు పొగుడుతుంటే, మా అత్త సిగ్గు నాకు ఇప్పటికి గుర్తే!

ఆ డాన్స్ వేసిన సంవత్సరం లోపే జోనాథన్ మామ మా అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. జాండిస్ తో కొన్ని రోజులు అంతర్యుద్ధం చేసి మా అందరికి దూరం అయ్యాడు. మా మామ బ్రతికింది ముప్పయ్ సంవత్సరాలే, కానీ మామ జ్ఞాపకాలు మా కాలనీ బ్రతికున్నంతవరకు అలాగా నిలిచి ఉంటాయి. ఎన్నిరోజులు బ్రతికాం అన్నది కాదు, బ్రతికి ఉన్నత వరకు ప్రతీ క్షణం జీవించాలి అని మా మామ జీవితం చెప్పకనే చెప్పింది.

మా మామ జీవితం చిన్నదే కావచ్చు కానీ నా అభిప్రాయంలో అది ఒక అందమైన జీవితం, జీవితాన్ని జీవించిన జీవితం!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x