మా ఊరి రధంబజారులో చివరాకరిన ఉన్న బాదంపాల కొట్టు గొప్ప పేమస్సు.
మా కాలేజీ ఆడలేడిసు ఒకరయినా కనపడకపోతారా అని మా ఊరి “ఇమాక్సు” – అన్నపూర్ణ థియేటర్ మీదగా నా చైకుల్ని తొక్కుకుంటు పోయేవాడ్ని రధంబజారుకి. అందానికి అతీతంగా ఆడలేడీస్ ను గౌరవించడం మా విమిశ్యం లోనే ఉంది.
అలాంటి ఆశలతో నా చైకుల్ని తొక్కుకుంటూ రాధంబజారులో ఉన్న గడియారస్తంభం చేరుకునేవాడ్ని. మా ఊరికి ఆ గడియారస్థంభం ఒక తాజ్ మహల్ లేదా ఒక రామమందిరం . అంటే మా ఊళ్ళో అందరు చెక్క్యులర్ మనుషులు, అందుకే తాజ్ మహల్ లేదా రామమందిరం అని వాడాను!
మా నాన్న జేబులో, లేదా మా వంటగదిలో మా అమ్మదాచే డబ్బాలో ఒక పదిరూపాయలు దొంగతనం చేసేవాడ్ని. అంటే నేను మంచి దొంగ కదా, అందుకే కేవలం పదిరూపాయలు.
మొత్తానికి రధంబజారులో ఆ బాటా చెప్పుల షాపు, మాకు ఎప్పుడు అప్పు ఇచ్చే కిరానా షాపు, పూలమ్మే పూలకొట్టు మీదగా వెళ్లి బావున్నారాయణస్వామి గుడికి చెరుకునే వాడిని.
గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు , మా రధంబజారులో చివరాకరిలో ఉన్న బాదంపాల కొట్టు దగ్గర ఆగేవాడిని. డబ్బుపెట్టే కుర్చీలో ఉన్న ఆ సేటుకు అరున్నార అప్పచెప్పి బాదంపాలు ఆర్డర్ ఇచ్చేవాడ్ని.
మాకసలే రాయల్టీ ఎక్కువ కాబట్టి రోడ్డువైపుకు తిరిగివుండే కుర్చీలో కూచ్చుని , గాజు గలాసులో బాదంపాలు తాగుతూ వచ్చి పోయేవాళ్లకి ఫోజుకొట్టేవాడ్ని.
ఈరోజుకి ఎన్ని డ్రింకులు తాగినా, మా ఊరి రధంబజారులో దొరికే బాదంపాలని కొట్టిందే లేదు ఎహె.
అందుకే మా ఊళ్ళో బాదంపాలు పేమస్సు. ఆ కొట్టులో కూచ్చుని అందరికి పోజులు కొట్టిన నేను భి “పేమస్సే నెహే”! 😎
చిత్రం : రధం బజార్ బాపట్ల , ఆంధ్ర.