ఆ రోజుల్లో యేసుప్రభు బెత్లహేమును ఎంత ఆశీర్వదించారో నాకైతే తెల్వదు గాని, మా కాలనీని మాత్రం అద్భుతంగా బ్లెస్స్ చేసారు. బహుశా అయన రెండో రాకడ మా కాలనీలోనే ఏమో!
మా కాలనిలో క్రిస్టమస్ సంబరాలు గొప్ప హైలెట్టు.
క్రిస్టమస్ సంబరాల్లో చెప్పుకోదగ్గ అద్భుతమైన ఘట్టం : “కిస్మిస్ పేషల్ డ్రామా” !
మా కాలనీ పెసిడెంటు, సెక్రటరీ, పెద్దలు ఆ పేషల్ డ్రామా తాలూకూ స్క్రిప్ట్ రైటర్సు . వారి మధ్యలో తెల్లవార్లూ ఈస్టోరీ డిస్కషన్లు జరిగేవి. ఆ రోజుల్లో డెడికేషన్ ఆలా ఉండేది మరి!
కాలనీ కుర్రోళ్ళు ఆ డ్రామాలో హీరోల పాత్రల కోసం కాలనీ మంత్రివర్గంలో కొంతమందికి మందు పోయించేవారు. మరి బయట ఊరి నుండి హీరోయిన్లు వత్తారుగా, అందుకే మరి అంత డిమాండు!
“పెసిడెంటుగారు, ఆ అమ్మాయి మొగుడ్ని వదిలేసి ప్రియుడుతో యవ్వారాలకోసం లేచిపోయింది”, ఇప్పుడు దాని మీద మన పస్టు హీరో, రెండో హీరో మీద పగ తీర్చుకోవాలి కదా?, అని పుల్ గా తాగేసిన మా సెక్రటెరీ పెసిడెంటు గారితో అన్నాడు.
అదెట్టా పెసిడెంటు గారు, అమ్మాయికి ఇట్టం లేకపోయినా ఆళ్ల కుటుంబం బలవంతంగా పెళ్లి చేసింది. ఆ దొంగముండా కొడుకు అమ్మాయిని సరిగా చూసుకోలేదు, అందుకని లేచిపోయింది. ఇప్పుడు మన పస్టు హీరో ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం మీద కదా పగ తీర్చుకోవాలి?, అని అన్నాడు ఒక పెద్దాయన.
ఇదంతా కాదుగాని , పెసిడెంటుగారు ఆ అమ్మాయి నా దగ్గరికి ఒచ్చేసింది కదా, ఇప్పుడు ఓ మంచి సాంగ్ ఏట్టాలి కద నాకు? – అని ఆ డ్రామాలో రెండో హీరో పెసిడెంటు గారిని అడిగాడు.
అదెట్టా పెసిడెంటుగారు, లెక్కప్రకారం హీరోయిన్ తో నాకు కనీసం రెండు పాటలు లేకుండా రెండో హీరోతో అప్పుడే పాటేంటి? అని అలిగాడు మనోభావాలు దెబ్బతిన్న పస్టు హీరో.
పెసిడెంటుగారు ఈ పాటలికేమి గాని, మా కూతురు లేచిపోయింది. తల్లితండ్రులుగా మా బాధను ఎలివేట్ చేస్తూ అద్భుతమైన ఏడుపు సీను ఒకటి ఎట్టండి. అద్భుతంగా పండిస్తాం, అని హీరోయిన్ తల్లిదండ్రులు డిమాండు చేసారు .
ఈ చర్చలతో విసిగిపోయిన మా పెసిడెంటు గారు, అందరికి సర్దిచెప్పి స్క్రిప్ట్ బైండ్ చేసారు.
ఆ…. పెసిడెంటు గారు ఇంతకీ మన డ్రామా కథ పేరు ఏంటో ?, అని అడిగారు కాలనీ పెద్దలు.
మా పెసిడెంటు కాళ్ళమీదకాళ్ళేసుకుని, ఆకాశం వైపుకు చూసి ఆలోచిస్తూ, ఒక్కసారిగా , ఆ.. మన డ్రామా కధ పేరు —- “వింత మనుషులు విచిత్ర జీవితాలు “ అయ్యా !!
ఒక్కక్షణం అక్కడున్న వారంతా అవ్వాక్కు అయ్యి పదినిముషాలు నిశబ్దంగా ఉండిపోయారు.
ఇంతకీ మా పెసిడెంటు గారు – “వింత మనుషులు విచిత్ర జీవితాలు” అంది ఆ డ్రామా కథనా? లేక అక్కడ పాటలకోసం, సన్నివేశాలకోసం, టాలెంట్లు చూపెట్టడం కోసం మా పెసిడెంటు గారి బుర్రతిన్న మా కాలనీ వాసులనా? 🤔🤔🤔