ఒకవేళ మనం జీవిత పాఠాలు త్వరగా నేర్చుకోకపోతే, జీవితమే కఠినమైన రీతిలో మనకు పాఠాలు నేర్పుతుంది —
ఇది ఇంటర్మీడియట్లో చాలా మర్యాదపూర్వకమైన భాషలో నా డైరీలో రాసుకున్నది. కానీ యవ్వన వయసులో నా అంతరంగం నాకు చెప్పిన మాట — “నీ జీవితం నీకు సరదా తీరుస్తుందిరా నా బట్టా” అని.
ఇంతకీ నాకు అప్పుడు ఎందుకు అలా అనిపించింది?
సమయానికి తిండి పెట్టె తల్లితండ్రులు ఇబ్బందుల్లో ఉన్నపుడు, మార్కుల కోసం కాదు పిల్లల జీవితం అనే కనీస ఇంగిత జ్ఞానం చదువు చెప్పే టీచర్లకు లేనప్పుడు, సమాజం బంధువులు తోడేళ్ళుగా మారినప్పుడు, వరుస వైఫల్యాలు నిన్ను మల్లెమాలతో సత్కరిస్తున్నపుడు, నా అంతరంగం నాకు చెప్పిన మాట “నీ జీవితం నీకు సరదాతీరుస్తుందిరా నా బట్టా” అని.
నా బొంగులో జీవితం రైలుపట్టాలు మీదకు పోయి సద్దాం అనే ఆలోచన లేని రోజు లేదు అప్పట్లో!
కానీ ఎప్పుడైతే బంధాలకు అతీతంగా నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టానో జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూడసాగాను. బహుశా నేను అంతర్ముఖుడిగా మారింది ఆ క్షణాల్లోనేమో!
అవును ఇంతికి నన్ను నేను ప్రేమించుకోవడం ఎలా మొదలుపెట్టాను?
బాగా గుర్తు మనసుకు బాధ కలిగినప్పుడు పోయి సముద్రపు వడ్డున కూర్చునేవాడిని! సముద్రంతో కొంచెంసేపు మాట్లాడే వాడిని. నేను ఎన్ని బాధలు చెప్పుకున్నా ఆ సముద్రం ఓపికగా విని అలల సవ్వడులతో సమాధానం ఇచ్చేది! అప్పట్లో నాకు మంచి స్నేహితుడు ఆ సముద్రం! వాడిని చూసి చాల రోజులు అయింది ఇప్పుడు. ఎలా ఉన్నాడో వాడు మరి ఇప్పుడు?
మా నాన్నగారికి ఒక చిన్న పుస్తక షెల్ఫ్ ఉండేది. ఎందుకో ఒక రోజు Alex Haley రాసిన రూట్స్ పుస్తకం తీసి చదివాను! పుస్తకం చదువుతున్నంత సేపు నా కళ్ళలో నీళ్లు ఆగలేదు! సమాజం మగవాళ్ళు ఏడవరు అని చేసిన తప్పుడు ప్రచారం పెక్కటిల్లేట్టుగా నా కంట్లో నీళ్లు సంద్రంలా పారాయి. నల్ల జాతి ఎదురుకున్న వివక్ష , బానిసత్వం ముందు నా బాధలు ఎంత? నల్ల జాతీయులను జంతువును వేటాడి నట్టు వేటాడి, ఊసల పంజరాల్లొ బందించి, నౌకలలో ఎగుమతి చేసి, తిండి–మలవిసర్జన ఆ పంజరాల్లొనే చేయించిన సంఘటనల ముందు నా బాధలేంత? అప్పటినుండి పుస్తకాలు నా మిత్రులయ్యాయి!
సమయం దొరికినప్పుడు సమాజానికి దూరంగా కొండలలో కోనలలో నా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాను. కొండల్లో దాగి ఉన్న నిశ్శబ్దపు అలలు నన్ను చలింపచేస్తాయి. నాకు నన్ను లోతుగా పరిచయం చేస్తాయి. ఆ కొండల తీరాన రాత్రి పడుకుంటే నాతో నేను సంసారం చేసుకుంటున్న అద్భుతమైన అనూభూతిని కలుగచేస్తాయి.
PC:[1]
ఇలా నాకు సమయం దొరికినప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటూ నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను. నా జీవితం ఎన్ని రోజులు సాగినా, అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు ఆగిపోయినా – ఆ చివరి క్షణం వరకు నా ప్రేమ నాకే! మరి నన్ను ఇన్ని రోజులు బ్రతికించింది నాపై నాకున్న ప్రేమే కదా?
ఫుట్‌నోట్స్
[1] 15 Proven Ways to Draw the Illusion of Depth – Ran Art Blog