లెక్కల పరీక్ష గంట ముందే ముగించి నా బడి సంచి వెనకాల తగిలుంచుకుని పరిగెత్తుకుంటూ మా స్కూల్ యెల్లో బస్సు దగ్గరకు చేరాను. సీట్ నెంబర్ మూడు, కిటికీ దగ్గర నా సంచి అడ్డం పెట్టి, దాని పక్క సీట్లో నేను కూర్చున్నాను. అంజు (పేరు మార్పు ) వస్తుందేమో అని ఎదురుచూస్తూ అలానే ఆ పక్క సీటులో ఒక అరగంట ఆలోచిస్తూ గడిపేసాను.
“సీట్ నెంబర్ మూడుకి ఏమి ప్రత్యేకత ఉందొ నాకు తెలియదు గాని, అంజు ఎప్పుడు అక్కడే కూర్చునేది. కొన్ని రోజులు నుండి అంజూని బాగా గమనించి, నేను తనతో పాటు కూర్చొడం మొదలుపెట్టాను.
నా జూనియర్ అంజు చాలా మంచి స్టూడెంట్ అని మా క్లాసుకి వచ్చే ఒక మేడం చెప్పేది. అంజూ చాలా బాగా రాస్తుందు అని, అన్ని సబ్జెక్టులో ఫస్ట్ మార్కులు వస్తాయని తెగ పొగిడేది. చదువే కాదు అంజు చూడటానికి కూడా చాలా బాగుండేది. మంచి పొడవు, సన్నటి మాటలు పైగా తెలివైన అమ్మాయి. తెలుగు ఉర్దూ కలిపి ముద్దు ముద్దుగా మాట్లాడేది.
ఎలాగైనా అంజు ద్రుష్టి నా మీద పడడానికి నేను ఆ రోజుల్లో నా నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించేవాడిని. మా క్లాసులో నేను చాలా మంచి విద్యార్థి అని నమ్మించడానికి అంజు ఎక్కడ కనపడితే అక్కడ పుస్తకం ముందు వేసుకుని చదువుతన్నట్టు నటించేవాడ్ని. చివరికి బస్సులో కూర్చుని కూడా అంజు చూస్తున్నపుడు చదువుతూ ఉండేవాడిని. అలా ఆ రోజుల్లో నా నటన పట్ల అద్భుతమైన డెడికేషన్ కనపరిచేవాడ్ని. “
ఇంతలో అంజు యెల్లో బస్సులోకి రానే వచ్చేసింది. తెలుపు రంగు చొక్కా, బులుగు గౌను, పొడవాటి జుట్టుతో నా పక్కన కూర్చుంది. ఈరోజు ఎం పరీక్ష అని అడిగింది అంజు. ఈరోజు లెక్కలు అని, పేపర్ చాలా తేలికగా వచ్చిందని, వందకు వందా వస్తాయని చెప్పాను. అంజు వావ్ అంది!
తరువాత ఏమైందో తెలియదు గాని, మరుసటి వారం నుండి అంజు సీట్ నెంబర్ మూడులో కూర్చోవడమే మానేసింది. కనీసం నన్ను పలకరించడం కూడా మానేసింది. అసలు విషయం ఏంటా అని ఆరాతీస్తే, మా లెక్కల మాస్టారు మా క్లాసు లెక్కల పరీక్ష మార్కులు రిజిస్టర్లో రాయమని అంజుకి ఇచ్చారంట. నా నటన అంజుకి తెలిసిపోయింది. మన లెక్కల పరీక్ష యధావిధిగా మా వంశ్య సంప్రదాయం ప్రకారం దొబ్బింది.
స్వతహాగా పుట్టుకతోనే నటనను పండించగల నేను, ఆ రోజునుండి నా సహజ నటనకు దూరం అయ్యాను. టైం బాగాలేక ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నాను గాని, అసల చిన్నపటి మా స్కూల్ లో నటన గనక నేను అలాగే కొనసాగించు ఉంటే ఈరోజు నన్ను మించిన పాన్ ఇండియా స్టార్ ఎవడు ఉండేవాడు కాదు!!
కళామ్మతల్లి ఒక గొప్ప నటుడని ఈ రోజు కోల్పోయిందంటే దానికి కారణం అంజూనే, నన్ను అస్సలు ఎంకరేజ్ చేయలేదు 😉!
ఏదిఏమైనా అంజూ ఒక జ్ఞాపకం!