నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా ప్రశ్నలు నన్ను నిద్రపట్టకుండా చేసేవి. అందులో ముఖ్యమైనవి ప్రేమ, ఆకర్షణ, పెళ్లి, జీవితం, కామం (సెక్స్), స్వేచ్ఛ.
నేను చిన్నప్పటినుండి క్రిస్టియన్ స్కూల్లో చదివాను. నేను మా సిస్టర్స్ (sisters/nuns) ని అడిగిన ప్రశ్నలు వారిని కూడా నిద్రపట్టనివ్వకుండా చేసాయి అని చాలా సార్లు నాతో చెప్పారు కూడా. మా నాన్నగారికి కంప్లైంట్స్ కూడా చేసారంట (విశ్వసనీయమైన సమాచారం మేరకు! “మా అమ్మగారి ద్వారానే లెండి”). ఒక సందర్భంలో ఒక సిస్టర్ తో మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాను. 8వ తరగతి విద్యార్థి నుండి ఇలాంటి ప్రశ్న బహుశా వూహించలేదేమో కానీ, ఆవిడ ఆ రోజంతా నిద్రపోకుండా మరుసటి రోజు నేను నా మనసుని దేవుడికి ఇచ్చేసాను, నేను ఈ సిలువను (cross) పెళ్లిచేసుకున్నాను అని చెప్పారావిడ! అప్పుడు ఇంకా నాకు పెళ్లి మీద ఉన్న అభిప్రాయం గందరగోలానికి గురిచేసింది. 20 సంవత్సరాల తరువాత ఒకరోజు నేను ఆవిడకు ఫోన్ చేసా. నేను అడిగిన ప్రశ్న ఆవిడ ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఆవిడ ఇంకా అదే నిబద్దతతో సిస్టర్ గా ఉండడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆవిడ అభిప్రాయాలను నేను ఎప్పుడు గౌరవించాను, అలాగే నా అభిప్రాయాలను కూడా ఆవిడ గౌరవిస్తుంది. అలాగే నా అభిప్రాయాలను మీరు గౌరవిస్తారని భావిస్తున్నాను.
10వ తరగతిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. తనంటే తీవ్రమైన ఆకర్షణ. తనను ఎప్పుడెప్పుడు చూడాలనే తపన, తనను తాకాలని కోరిక. అసలు ప్రపంచ జ్ఞానం లేని నాకు, రూపాయి సంపాదనలేని నాకు, మానసిక భలం, శారీరిక భలం లేని నేను 10వ తరగతిలో ప్రేమలో పడడమేంటి. అసలు ఆకర్షణకు, కోరికకు, ప్రేమకు వ్యత్యాసమేమిటి అనే ఆలోచనలు నాలో అప్పుడే మొదలు అయ్యాయి. ఇప్పుడు తను ఎక్కడవుందో నాకు తెలియదు.
మెల్లగా ఫిలాసఫీ (తత్వశాస్త్రం/Philosophy) మీద కొంచెం ఆసక్తి కలిగి చిన్న చిన్న పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అందులో నన్ను ముక్యంగా ఆకట్టుకున్నది ప్లేటో (Plato) రాసిన ఒక వ్యాసం. మనం మన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మనలో ఏ లక్షణాలు లేవో, కానీ మనకు కావాలనుకుంటామో, అలాంటి లక్షణాలు వున్న జీవిత భాగస్వామి నీకు తోడియితే మీ ఇరువురి ప్రయాణం మిమ్మల్ని పరిపూర్ణ౦గ తీర్చుదిద్దుతుంది అని చదివాను. ఇది ప్రేమలో ఎదగడం! చాలా కొత్తగా మరియు లాజికల్ (logical) గా అనిపించింది.
German philosopher Arthur Schopenhauer ప్రేమ మనిషిని చాలా లోబరుచుకుంటుంది అని, చివరకు అన్ని భాదలు దాని వల్లనే వస్తాయని రాసాడు. మిమ్మలను మరణం వైపుకు ప్రేమ, పెళ్లి తీసుకువెళతామని రాసాడు. కేవలం ఈ సృష్టిలోని ప్రాణులు అన్ని వాటి ప్రతిరూపాలు నిర్మాంచుకోవడానికే మనకు ఆకర్షణ, సెక్స్, ప్రేమ, పెళ్లి లాంటి కాన్సెప్ట్స్ మనలో ఇమిడి ఉన్నాయని చెప్పాడు. Arthur Schopenhauer ఒక పెస్సిమిస్ట్ (pessimist). కానీ ఇందులో కొంత నిజమున్నదని అనిపించింది.
నేను నా చదువు పూర్తి అయిన తర్వాత, కొంత సంపాదన నా చేతికి వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న. ప్లేటో చెప్పిన మాటలు నాకు గుర్తుకువచ్చాయి. నాలోని ఏమి లక్షణాలు లేవో అవి ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాను. తనకు ఆకర్షితుడయ్యాను (ఆలోచనలకూ మరియు అందానికి!). ఉదాహరణకు, ప్రపంచంలో బాధలన్నీ నావే అని నేను ఫీల్ అయితే, తను మాత్రం నేను సంతోషంగా ఉంటె చాలు ఈ ప్రపంచం గురించి మనకెందుకు అనే టైపు. తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లికూడా చేసుకున్నాను.
పెళ్లి చేసుకునే ముందు మాత్రం నా భార్యతో మనసువిప్పి ఇలా మాట్లాడాను:
పెళ్ళికి ప్రేమ ఉండాలి. ప్రేమకు ఆకర్షణ (ఆలోచనలకూ మరియు అందానికి!) ఉండాలి. ప్రేమకు స్వేఛ కుడా ఉండాలి. ప్రేమలో గౌరవం ఉండాలి, గౌరవం లో కుడా ప్రేమను వెతుక్కోవాలి. Arthur Schopenhauer చెప్పినవి కూడా తనకు చెప్పాను, ప్రేమ మరియు పెళ్లి జీవితం చాలా సవాలుతో కూడుకున్నది అని. ఎప్పుడు మనలను మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని. మనసు విప్పి మాట్లాడుకోవాలని చెప్పా. నా భార్యకు కొంచెం సహనం ఎక్కువ కాబట్టి నేను చెప్పే ఎదవ logics అన్ని వింటుంది!
చివరికి నేను చెప్పదలచినది ఏమిటంటే, పెళ్లి, ప్రేమ, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం లాంటివి, గొప్ప గొప్ప తత్వవేత్తలకు, కవులకు, పెద్దవాళ్లకే అర్ధం కాలేదు. నాలాంటి వాడికి ఏమి అర్ధమవుతాయి చెప్పండి. కానీ తెలిసిన దానిలో ఇద్దరు కలిసి జాగ్రత్త బ్రతకడం నేర్చుకున్నాం అంతే! ఎవరికయినా వీటిగురించి పూర్తి అవగాహనా ఉందని చెపితే ఆలోచించవలసినదే !
ప్రేమలో పడడం కాదు, ప్రేమలో ఎదగడం మనం నేర్చుకోవాలి మన వివాహ జీవితంలో!