నాది ప్రేమ వివాహం, భారత క్రైస్తవ చట్టం, 1872 ప్రకారం నా శ్రీమతిగారి కుటుంబం, నా కుటుంబం కోరిక మేరకు జరిగింది. నేను హేతువాదిని కాబట్టి చర్చలో పెళ్లి చేసుకోవడం పెద్దగా ఇష్టంలేకపోయినా, మా ఇరు కుటుంబాలు కోరికమేరకు చేసుకున్నాను. నేను ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తాను, కానీ పెళ్లి పీటలు (ఇక్కడ పెళ్లి స్టేజి అనమాట, మాకు పీటలు ఉండవు కదా) మీద నాకు కలిగిన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా నాకు ఉంది, అందుకనే రాయాలనిపిస్తుంది.
ఆ రోజు ఉదయం పోదున్నే 6 గంటలకు లెగవమని మా అమ్మగారు ఆర్డర్ వేశారు. నా పదో తరగతి పరీక్షలకు గాని, ఇంజినీరింగ్ పరీక్షలకు గాని 8 గంటలకు తక్కువ లేచింది లేదు. కానీ చేసేదేమిలేక అలారం పెట్టి పడుకున్నాను.ఉదయాన్నే అలారం మోగింది. దాన్ని అపి ఇంకొంచెం సేపు పడుకుందాం ప్రశాంతంగా అని అనుకున్నాను, కానీ ఆ లోపలే తలుపులు గట్టిగా కొట్టే సరికి దెబ్బకి లేచి కూర్చున్నాను!
ఉదయం 8 గంటలకు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి నిన్ను చర్చికి తీసుకువెళతారు అని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. అప్పుడు నేను ఎటూ అయన ఒక 15 నిముషాలు ప్రార్థన చేస్తారు కదా, అ సమయంలో ప్రశాంతంగా ఒక కునుకు వేయొచ్చు అనుకుని రెడీ అవడం మొదలెట్టాను. అనుకున్నట్టుగానే ప్రార్థనా సమయంలో ఒక కునుకు తీసా!
కోటు వేసుకుని దసరాబుల్లోడు లాగా రెడీ అయ్యిన నేను ఒకసారి అద్దంలో నా మొహం చూసుకునే సరికి “చంటి అబ్బాయి సినిమాలో చిరంజీవి అద్దె కోటు వేసుకున్న సీన్ గుర్తొచ్చింది”. ఇప్పుడు సుహాసినీని కలవడానికి నన్ను చర్చికి తీసుకుపోతున్నారు మా పాస్టర్లు.
కారులో కుర్చున్నాక మరళ ఒక చిన్న ప్రార్థన చేయమని మా పాస్టర్ నన్ను అడిగారు. అప్పుడు నేను మనసులో,
“దేవుడా ఓ మంచి దేవుడా, వేసుకోడానికి అద్దె కోటు ఇచ్చావ్, కూర్చోడానికి కార్ ఇచ్చావ్, వేసుకోడానికి జోడులు ఇచ్చావ్, కానీ తినడానికి ఎందుకు టిఫిన్ ఇవ్వలేదు?” అని ప్రార్థన చేదాం అనుకున్న, కానీ అక్కడ ఉన్నవారు నా ప్రార్థనకు బయపడతారని మా అమ్మగారు ముందే గ్రహించి, మా పాస్టర్న్ ప్రార్థన చేయమని చెప్పారు.
ఇక చర్చి దగ్గరకి “ఎంటర్ ది డ్రాగన్“
ఎంట్రన్సులో ఒక పెద్ద ఫ్లెక్సీ వేశారు నాఫోటోని. ఆ ఫ్లెక్సీ ఫొటోలో నన్ను నేను చూసుకుని, పెళ్లికొడుకు నేనేనా అనే డౌట్ కూడా వచ్చింది! ఆ ఫోటోషాప్ చేసినవాడిని పిలిచి “ఆ ఫ్లెక్సీ ఫొటోలో ఉన్న వాడికి చేయాండ్రా పెళ్లి! వాడికి చేయండి ” అని చెబుదాం అనుకున్న, టైం సరిపోలేదు!
మా వంశం ఈ సమాజానికి పెద్దగా పీకింది ఏమి లేదు అని, దయచేసి నా ఇంటి పేరు ఫ్లెక్సీ లో రాయొద్దు అని చెప్పాను. దాంట్లో మాత్రం నేను అదృష్టవంతుడనే, నా ఇంటి పేరు చూసే భాగ్యం నాకు కలగలేదు.
మొత్తానికి చర్చలోపలికి నేను వెళ్తుండగా, ఒక్కసారిగా అందరు లేచి నించున్నారు. తంబుర సితార నాదాలు మారు మోగిపోతున్నాయి. అక్కడ ఉన్నవారంతా నన్ను చూసి లెగవడంతో ఒక్కసారిగా హడలిపోయాను.
అప్పుడు శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి క్లాస్రూమ్ ఎంట్రన్స్ సీన్ గుర్తుకువచ్చిది. నా చెయ్య వణికింది!
ఇక పెళ్లి పీటల సీన్:
నన్ను పాస్టర్ గారి ముందు కూర్చోబెట్టారు. నాకు ఆయనకు పెద్దగా సాపత్యం లేదు. అయన నన్ను పెద్దగా పాటించుకోనట్లే కనపడ్డారు. ఇంతలో పెళ్లి కూతురు వస్తుంది అందరు లేచి నిలబడమన్నారు పాస్టరుగారు!
ఇపుడు నాకో ఆలోచన ,
ఇంతకీ నేను నించోవాలా , లేదా ?
ఒక వేళ నించుంటే “మనోడు నించున్నాడేంటి అనుకుంటారా?”
లేదా కూర్చుంటే “వీడికి పొగరంటారా?”
ఇంత పేద జీవిత సమస్య వచ్చిపడిందే అనుకునే లోపే మా పాస్టరుగారు నా చెవులో “నువ్వు కూడా లెగు, అందుకనే అప్పుడపుడు చర్చికి రావాలి అని అన్నారు! ఇలాంటి విషయం చిన్నపుడు నుండి జరుగుతుండడంతో నేను పెద్దగా సిగ్గుపడలేదు.
ఇక పెళ్లి కూతురు వచ్చారు, నా పక్కనే కూర్చున్నారు.
మా పాస్టర్ గారు ప్రసంగం మొదలెట్టారు.
“ఆదాము ఎముక నుండి అవ్వను ప్రభువు సృష్టించాడు” — అలాగే ఈరోజు పెళ్ళికొడుకు (అంటే నేను) పుట్టినప్పుడే తన శరీరంలో నుండి ఒక ఎముకను తీసి పెళ్లి కుమార్తె ను సృష్టించాడు ప్రభువు అన్నారు.
నాకు ఒక్కసారిగా భయం వేసింది. అంటే ఇప్పుడు నా శరీరంలో ఒక ఎముక మిస్సింగ్ ఆ?
వెంటనే వెళ్లి Xray తీయించుకోవాలా ఏంటి అనే ఆలోచన నాలో మొదలయింది .
ఇప్పుడు పెళ్లి కుమారుడు లేచి ప్రతిజ్ఞ తీసుకుంటారు అని మా పాస్టర్ గారు చెప్పారు. నేను ఎమ్మటే లేచి,
“India is my country, all Indians are my brothers and sisters” అని మొదలెడదామనుకున్న, కానీ ఇప్పుడు వేరే ప్రమాణం అంట”
నా చేత నా కాబోయే శ్రీమతి గారిని ఎప్పుడు బాగా చూసుకుంటానని ప్రమాణం చేయించారు. చేశాను!
ఇక ఆ పెళ్లి పీటలమీద ఉన్నపుడు మా ఫోటోగ్రాఫర్ చేసే హడావిడి అంత ఇంత కాదండి! వాడు మణిరత్నం సినిమాని డైరెక్ట్ చేస్తున్నంత హంగామా చేస్తున్నాడు. నేను మనసులో వీడు నన్ను అరవింద స్వామి అనుకుంటున్నాడా ఏంటి? కింద నుండి, పక్కననుండి , పైనుండి తెగ ఫోటోలు తీస్తున్నాడు అనుకున్నాను.
ఇదంతా ఒక ఎత్తు అయితే, నాకు భోజనం పెట్టకుండా, పెళ్ళికి వచ్చిన వారంతా తెగ తినేస్తున్నారు. కానీ అందరు తిన్నాకే తినాలని నాకు ఆర్డర్!
నేను మా తమ్ముడికి సైగ చేసి, ఒక చికెన్ ముక్క వేరే రూంకి తీసుకురమ్మని చెప్పా! పిల్లి లాగా కొంచెం సేపు జారుకుని ఆ చికెన్ ముక్క తిన్న!
ఆహ అది “the most beautiful Mukka of my life so far” అండి.
ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లి పీటలమీద నాకు భావోద్వేగాలు ఏమి లేవు. కాసింత భయం, బోలెడంత ఆకలి, 30 years ఇండస్ట్రీ ఫోటోగ్రాఫర్!
ప్రశాంతతే లేదు!
పెళ్లి అయిపోయాక ప్రశాంతంగా శ్రీమతి గారు నేను పారిస్ వెళ్ళాం! ఒకరినొకరు మరింత అర్ధం చేసుకోడానికి ఆ సమయం దోహద పడింది.