ఈ ప్రశ్నకు వచ్చిన కొన్ని సమాధానాలు చదువుతుంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరంటే కొంచెం అసూహ్య కూడా కలుగుతుంది. మీతో నాకు తూచ్! మామూలు తూచ్ కాదు, పెద్ద తూచ్ ….. !
ఒకరేమో 550+/600 అంటారు, ఇంకోరేమో 9.5+/10 GPA అంటారు. మీరు మామూలోళ్లు కాదు రా బాబు. తోపులు అంతే!
ఇక నా మార్కులు సంగతికి వస్తే :
కొన్ని సబ్జక్ట్స్ లో మనం JUST PASS. ముఖ్యంగా నాకు అర్ధం కాని హిందీ లో ఎలా పాస్ అయ్యానో ఇప్పటికి అర్ధం కావడంలేదు. ఆ అనుభవం రాస్తే రక్త చరిత్ర అని హెడ్డింగ్ పెట్టుకోవాలేమో. దాని గురించి మనం అనుభవాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టి మరి చెప్పుకుందాం.
నేను పదవ తరగతి పరీక్షలలో ఎలా చదివాను:
మా నాన్నగారు పండితుడు. నేను పరమ సుంటను. A Classical Case.
పరమ సుంట అనేది సాపేక్షం (relative). మా నాన్న దృష్టిలో నేను క్రిటికల్ గా ఆలోచించే జీవిని. మా స్కూల్లో వారి దృష్టిలో నేను పరమ సుంటను.
ఉదాహరణకు మా నాన్న గురుత్వాకర్షణ గురించి న్యూటన్ ఆపిల్ పండు గురించి చెప్తే, అసలు ద్రవ్యరాశి ఉన్న ఏ పదార్థం కైనా గురుత్వాకర్షణ శక్తి ఎందుకు ఉండాలి అని ప్రశ్న వేసేవాడిని. అలా మా నాన్నగారు నేను ప్రశ్నించుకుంటూ, చర్చించుకుంటూ సమయం గడిపేవాళ్ళం.
మా స్కూల్ లో మా పంతులు పుస్తకం తీసుకుని చెప్పుకుంటూ పోయేవారు. ఇంకొన్ని సార్లు ఇది పరీక్షలకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేవారు.
నాకు ఈ బట్టీపట్టటాలు, పరీక్ష గొడవలు జీవితానికి చిరాకు తెప్పించేవి. నేను స్వేచ్చా జీవిని మరి.
ఇక నా గురించి నేను పులిహోర కలుపుకున్నది చాలు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది.
ఇక పదో తరగతి అనుభవాలు:
నా మనోభావాలు దెబ్బతిన్న సందర్భాలు.
అంకం 1: మా నాన్నగారు పదో తరగతిలో పాస్ అవుతానో లేదో అన్న అనుమానంతో ట్యూషన్లో పెట్టారు. ట్యూషన్ కి వెళ్లిన మొదటి రోజు మిర్చి సినిమా ప్రభాస్ అంత స్మార్ట్ గా తయ్యారు అయి వెళ్తే, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు శివ పుత్రుడు సినిమాలో విక్రమ్ లాగ మారిపోయేవాడిని.
ట్యూషన్లో మా మాష్టారు గట్టిగా చదవండి అనేవాడు. అందరు గట్టిగట్టిగా అరుస్తూ బట్టిపడుతున్నారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ శబ్దం, ఆ మనుషులు, ఆ బట్టి పట్టడం, ఆ అరుపుల్లో కూడా ఎవడు గట్టిగా చదువుతాడో అనే పోటీ. నిజంగా అది ఒక జుర్రాసిక్ పార్క్ అని అనిపించేది.
హిందీ పరీక్ష రేపు అనగా ఈరోజు ట్యూషన్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చి రాయమన్నారు. నాకు హిందీ అనగానే జ్వరం వచ్చేసింది.
అందరు ట్యూషన్లో హిందీ తెగరాసేస్తున్నారు. నా పెన్ను ముందుకు కదలడం లేదు. ఏదోకటి రాసేద్దామని,
नागार्जुन सागर और सिलसिलों नगरों में पानी आता हे .
पानी बरास्ता हे, और वुधार जाता हे, मे आता हे !!
తెలుగులో
నాగార్జున సాగర్ ఔర్ సిల్ సిల్లో గ్రామొమే పానీ అతా హే,
ఉదర్ పానీ బరస్తా హే, ఔర్ పానీ ఇదర్ అతాహే, మే తడుస్తా హే ….
అని ఏదో రాసేసాను. మా ట్యూషన్ మాస్టారు నన్ను తుక్కు రేగ కొట్టారు. అయితే నన్ను కొట్టినందుకు నేను ఫీల్ కాలేదు. అందరి ముందు బాగా చదివే నా ప్రెండు గాడిని తెగ పొగిడాడు. ఇక్కడే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి అమ్మాయిల ముందు , ముఖ్యంగా ట్యూషన్ లో ఒక అమ్మాయితో టీనేజ్ ప్రేమలో ఉన్నపుడు పక్కనోడ్ని పొగిడితే నా మనోభావం దెబ్బతినదా ?
అంకం 1, ప్రతీకార చర్య:
బాగా చదివే నా ఫ్రెండ్ గాడి మీద ప్రతీకార చర్య మొదలు పెట్టాను. మరుసటి రోజు మా స్కూల్ లో జరిగే హిందీ పరీక్షల్లో నేను రాసిన ఆన్సర్ షీట్లో నా రోల్ నెంబర్ కి బదులుగా వాడి రోల్ నెంబర్ రాసేసాను.
వాడికి ఆ పరీక్షల్లో 30/100 వచ్చాయి. అవి నా మార్కులే అయినా, వాడికి 100 కి 30 మార్కులే వచ్చాయి అన్న ఆలోచనే నాకు భలేగా అనిపించింది. తరువాత మా హిందీ టీచర్ నన్ను చెక్క స్కేల్ తో సన్మానించింది అనుకోండి, అది వేరే విషయం!
అంకం 2: మా ట్యూషన్ నాకు నచ్చకపోయినా రోజూ క్రమం తప్పకుండా వెళ్ళేవాడిని. దానికి కారణం నేను ఇంతకముందు కోరా సమాధానాల్లో సరదాగా రాసిన ఒక ప్రేమ కధలో ఓ అమ్మాయి. ఆ వయసులో ప్రేమలో ఉంటె “నా సిగ్గు, నా లజ్జ”! సో ట్యూషన్ లో నాకు ఎంత మంచి పేరు ఉన్నా :p , సిగ్గు లేకుండా రోజు వెళ్ళేవాడిని. సరే దాని సంగతి పక్కన పెడితే,
నా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ , ట్యూషన్లో మనం ప్రేమలో ఉన్న అమ్మాయి గారి నాన్న గారు కూడా గవర్నమెంట్ టీచర్. పైగా నాకు 10th చివరి పరీక్షల్లో ఇన్విజిలేషన్ కూడా ఆయనే.
మా నాన్న ఫిజిక్స్ పరీక్షకు నన్ను తీసుకువెళ్లేటప్పుడు రేబాన్ కళ్లజోడులు పెట్టుకుని మావాడే అని పోజులు కొట్టుకుంటూ ఆ అమ్మాయి గారి నాన్న గారికి చెప్పాడు. అంటే నేను ఆ పరీక్షల్లో పాస్ అవుతాననే నమ్మకం కావొచ్చు.
ఇక హిందీ పరీక్ష కు నన్ను తీసుకువెళ్ళేటప్పుడు మా నాన్నగారి ఒక్కసారిగా అపరిచితుడు సినిమాలో రెమో క్యారెక్టర్ నుండి రాము క్యారెక్టర్ లోకి మారిపోయారు. అయన మొహం భయంతో నిండిపోయింది.
ఇక్కడిదాకా బాగానే ఉంది, మా నాన్నగారు వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మా వోడు హిందీలో బాగా వీకు! కొంచెం చూడండి అని చెప్పారంట. ఇంక నయ్యం స్లిప్పులు ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పలేదు. అప్పుడు పూర్తిగా వేదనయిపోయేవాడిని. మా నాన్న గారు నన్ను అ రకంగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ముందు పరువు తీసేసాడు. అయన వెళ్లి ఆ అమ్మాయితో చెప్పారంట “నేను ఎంత పెద్ద జాతి రత్నాన్నో ” . ఇక్కడ కూడా నా మనోభావం పూర్తిగా దేబతినేసింది.
అంకం 2 లో ప్రతీకార చర్య లేదు. మా నాన్న నన్ను ఫుట్ బాల్ ఆడతాడు అని భయం.
ముఖ్య విషయం:
యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బట్టీపట్టకుండా చదవచ్చు, మార్కులు గొప్పగా రాకపోయినా మంచి స్థాయిలోకి రావచ్చు. అలా అని system కి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళడానికి Elon Musk, Bill Gates కి వచ్చిన అవకాశం మనకు రాకపోవచ్చు. సో ఇష్టపడి , కస్టపడి చదవండి!! బహుశా నేను తప్పు కూడా కావొచ్చు గమనించగలరు.
కొసమెరుపు :
ఇక నేను ట్యూషన్లో ఒక అమ్మాయి అని చెప్పాను కదా, దాదాపు 15 సంవత్సరాల తరువాత మన తెలుగు కోరా లో నేను రాసిన కొన్ని సమాధానాలు చదివి మనకు సందేశం పంపింది అనమాట! బాగా రాస్తున్నావ్ అని, ఐ అం హ్యాపీ ఫర్ యువర్ కెరీర్ సో ఫార్ అని మనల్ని కొంచెం పొగడగానే,
మన పీలింగు: :p
స్వస్తి
ప్రవీణ్.