నేను దేవుణ్ణి నమ్మనండి. ఎందుకు నమ్మను అనే విషయం మీ ప్రశ్న తరువాత నన్ను నేను లోతుగా ఆత్మ పరిశీలన చేసుకుని ఈ సమాధానం రాస్తున్నాను. నాకు ఊహ తెలిసిన తరువాత జరిగిన ఒక సంఘటన నాకు బాగా గుర్తు వస్తుంది.
నేను ఐదో తరగతి చదివేటప్పుడు బైబిల్ క్లాసుకి వెళ్లాలని నా స్కూల్ ప్రిన్సిపాల్ కబురుపెట్టారు. అది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కావడంతో ఆమె బైబిల్ క్లాసుకి వెళ్ళమని ఆదేశం ఇచ్చినట్టు నాకు తెలిసింది. మిగతా వారికి (వేరే మతాలకు చెందిన వారికి ) మోరల్ సైన్స్ క్లాసుకి పంపించారు. నా స్నేహితులు కొంతమంది వేరే క్లాసుకి వెళ్లడం, నేను వేరే క్లాసుకి వెళ్లడం నాకు చాలా బాధ అనిపించింది.
బైబిల్ క్లాసులో మొదటిగా నాకు చెప్పిన ఒక్క విషయం, మనందరం పాపులమని. నాకు ఒక్కసారి మైండ్ పోయింది. ఇదేంటి మా టీచర్ ఇలా అంటుంది అని. తరువాత దేవుడు మనం చేసిన పాపాలను కడగడానికి సిలువ మీద చనిపోయాడని చెప్పారు. నేను లెగిసి, టీచర్ అసల నాకోసం అయన చనిపోవడం ఏంటి, నన్ను అయన అడగలేదు కదా?, నా పాపానికి, అయన సిలువకు సంబంధం ఏంటి? అని అడిగినట్టు గుర్తు. అక్కడ నుండి మొదలయింది నా ప్రస్థానం, మా టీచర్లు ఏది అడిగినా నేను కొంత వ్యతిరేకంగా మాట్లాడడం జరిగేది. కాని ఒక మంచి విషయం ఏమిటంటే నా ఆలోచనలకూ మా స్కూల్ లో స్వేచ్చని ఇచ్చారు. మా నాన్నగారు నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉండమని చెప్పారు, పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
అలా అన్ని విశ్వాస గ్రంధాల గురించి తెలుసుకోవడం, చదవడం చేశాను. కానీ దేవుడి మీద నమ్మకం కలగలేదు. ఇక మతం సంగతి వదిలేయండి, మతం ఒక ఆర్గనైజ్డ్ doctrine అని నాకు ఈ ప్రపంచ చరిత్ర కొంత చదివింతరువాత అర్ధమయింది.
నాకు సైన్స్ మెథడాలజీ బాగా నచ్చింది. ఒక విషయాన్ని ఆబ్జెక్టివ్ గా చూడడం, ఒక విషయం మీద క్షున్నంగా చర్చ జరిగిన తరువాత ఒక నిర్ణయానికి రావడం, వాదోపవాదాలు జరగడం, ఆలా ఆబ్జెక్టివ్ రియాలిటీ వైపు అడుగులు వేసాను. నేను హేతువాదిని అండి, అన్ని మతములను తిరస్కరిస్తాను. దేవుడు ఉన్నాడని ఇప్పుడు దాకా తగిన ఆధారం లేదు కాబట్టి నేను నమ్మను. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, సైన్స్ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాదానాలు దొరకవేమో, సైన్స్ కి కొన్ని పరిధులు ఉంటాయి, ఒక విషయం ఎలా జరిగిందో చెపుతుంది గాని ఎందుకు జరిగిందో చెప్పలేదు (science can answer questions on how and when but not why!). ఉదాహరణకు బిగ్ బాంగ్ జరిగి మన విశ్వం ఏర్పడింది అని సైన్స్ చెపుతుంది, కానీ బింగ్ బాంగ్ ఎందుకు జరిగిందో చెప్పలేదు. కానీ అన్నిటికి దేవుడు కారణం అనేది చాలా సునాయాస సామాధానం, దానితో నేను ఏకీభవించలేను.
నేను దేవుడిని నమ్మేవాళ్ళకి వారి నమ్మకం తప్పు అని నేను చెప్పను. మన రాజ్యాంగం మనందరి విశ్వాసాలకు స్వేచ్చనిస్తుంది. నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. కానీ ఒకటి మాత్రం వాస్తవమండి, విశ్వాసం వేరు, ఒక మూడ నమ్మకం వేరు. మూఢ నమ్మకాల పేరుతో మనుషులను, వారి హక్కులకు భంగం కలిగితే తప్పకుండ ప్రశ్నిస్తాను. ఉదాహరణకు చిన్న పిల్లల మీద వాటికన్ సిటీలో జరిగిన లైంగిక దాడి (వారికి పిల్లల మీద హక్కు దేవుడు ఇచ్చాడనే మూఢనమ్మకం), చిన్న పిల్లలను బడికి పంపకుండా వారికి శక్తులున్నాయి, దేవుడితో మాట్లాడుతున్నారు అని వారిని వాడుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. సైన్స్ ని తప్పుగా వాడుకుంటే కూడా తప్పకుండ ప్రశ్నిస్తాను (ఉదాహరణకు న్యూక్లియర్ వెపన్స్).