స్వచ్ఛమైన సాయంత్రపు గాలి కోసం దగ్గరలో ఉన్న నది తీరానికి చేరుకున్నాను.
అస్తమిస్తున్న సూర్యుడు తన ప్రతిరూపాన్ని అద్దంలా మెరిసే నీళ్లలో చూసుకోన సాగాడు.
పడమటి గాలులు నది పైపొరలతో ఆడుకోన సాగాయి.
సంధ్యా సమయాన సేద తీర్చుకోవడానికి పిల్లా జల్లాతో పాటు యువకులు, మధ్య వయసు మరియు వయసు పైపడిన వారు ఆ నది తీరానికి చేరుకున్నారు.
వారందరికీ దూరంగా నా నడకను కొనసాగించాను.
చూస్తూనే చూస్తూనే ఒక పెద్ద నావ ఆ వైపుగా వస్తుండడం గమనించాను. ఆ నావ ఇంధన రవాణాకు వాడుతారట. పాపం ఎన్నెన్ని సార్లు ఎంతెంత బరువును మోసిందో ఆ నావ. పిచ్చితల్లికి మన సుఖాలకు అవసరాలకు కావాల్సినంత ఇంధనం తన జీవితకాలం మోసినా సరిపోదు అని తెలియదేమో!
ఇంతలో నదిలో ఈదుతున్న ఒక హంస జంటను చూసాను! ఆ జంట తమ పొడుగాటి ముక్కులతో కొట్టుకుంటూ, ప్రేమించుకో సాగాయి. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆ హంస జంటకు సంబందించిన గూటిలో గుడ్డును గమనించాను!ఆ తల్లి పొదిగి పొదిగి అలసిపోయి స్వేచ్చా వాయువులకోసం విహారానికి వెళ్ళిందేమో! బహుశా తల్లితనానికి కూడా కాసింత స్వేచ్చ, విశ్రాంతి అవసరం ఏమో కదా…..
చక్కని చెట్లమధ్యలో నా ప్రయాణం కొనసాగింది! ఇంతలో చాపలకోసం గేలం వేసిన ఒక అతను కనపడ్డాడు! పెద్దచేపను పట్టడాయికి చిన్న చేపను ఎర వేస్తున్నాడు! పెద్ద చేపను పట్టడానికి చిన్న చేప ఒక ఎర, బలవంతుడు బలపడడానికి బలహీనుడు ఒక ఎర – ఈ ప్రకృతి అంచులలో దాగి ఉన్న ఈ అధర్మమే ఒక దర్మం ఏమో ….
కొంతసేపటికి కాళ్లు నోచి ఒక చెట్టుకింద కూర్చున్నాను! నాగరికత మొదలైన దగ్గరనుండి, నేను కూర్చున్న ప్రదేశంలో ఎంతమందో కూర్చిని ఉంటారు కదా? వారికి కూడా నాకు కలిగిన ఆలోచనే కలిగి ఉంటుందా? లేక ముందు ముందు ఎంత మంది ఈ ప్రదేశంలో కూర్చోడానికి వస్తారో అనే ఆలోచన ఎమన్నా వారికి కలిగిందా…? అయినా అసలు “ఆలోచన” అంటే ఏంటి?
మనిషి ఈ భూభాగంలో జీవించడానికి, తనను తానూ కాపాడుకోడానికి ఈ జీవ పరిణామంలో జరిగినైనా ఒక సంఘటనే ఈ “ఆలోచన” ఏమో కదా ….
సరే ఇంతకీ నేను Quora లో చెప్పదలచినది ఏంటి?
“నేను పైన ప్రస్తావించింది నా ఆలోచన ప్రపంచం. నేను ఎప్పుడు నా ప్రపంచంలోనే బ్రతుకుతాను, అప్పుడప్పుడు ఈ బ్రతికే ప్రక్రియలో Quora లో రాస్తుంటాను”
నా ప్రపంచం మీకు నచ్చితే హాయిగా చదవండి. నా ప్రపంచం మీకు నచ్చకపోతే నన్ను వదిలేయండి!
కానీ నా ప్రపంచంలోకి వచ్చి, నీ ప్రపంచం బాగాలేదు, నీ ప్రపంచంలో ఇది ఇలా ఉండకూడదు కదా అని ఉచిత సలహాలు మాత్రం నాకు వద్దు! కావలిస్తే నేనే అడుగుతాను. మీ ప్రపంచంలో మీరు హాయిగా ఉండండి, అందులోకి నేను రాను.
“సంధ్యవేళ ముగిసింతరువాత నా ప్రయాణం నా ఇంటికి తిరిగి మొదలుపెట్టాను…తిరిగి మరళ నా ప్రయాణాన్ని రేపు కొనసాగిస్తాను…బహుశా కొనసాగిస్తూనే ఉంటాను …….”