నా మానాన నేను ట్యూషన్లో అర్థంకాని హిందీని బట్టీ పడుతుంటే నా స్నేహితులు ప్రతాప్ మరియు శ్యామ్ వచ్చి – “వొరేయ్ నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి” అని నన్ను వారితోపాటు రమ్మని సైగచేసారు.
నా మనసులో కొంపదీసి మా మాస్టారు ట్యూషన్ ఎతెస్తున్నాడా అనే ఆశావాదపు ఆలోచనలు మొదలైయ్యాయి.
ఆ పబ్లిక్ స్కూల్ (మా ఊరిలో ఇది ఒక స్కూల్ అనమాట) అమ్మాయి లేదు, నీ పేరు-తన పేరు రాసి FLAMES వేస్తుంది రా? నిన్ను ఇష్టపడుతుందనుకుంట అని చెప్పారు.
ఇలాంటి విషయాల్లో మా స్నేహితుల ఇంటెలిజెన్స్ సమాచారం దాదాపు ఇజ్రాయేల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంత నాణ్యతగా ఉంటుంది కనుక నేను కూడా నమ్మేసాను. బయటకు నేను ఆ అదేముంది లేరా అని పైకి ఎచ్చులుపోతూ, లోపల మాత్రం నాకు మధ్యాన్న భోజన పథకంలో వండిన కోడు గుడ్డు కూరలో కోడి గుడ్డు దొరికినంత సంతోషంగా ఉండింది.
మొత్తానికి మా ఇంటెలిజెన్సు వర్గం వారు ఇచ్చిన సమాచారం నిజం అవ్వడం, నేను ఆ అమ్మాయి మాట్లాడుకోవటం మొదలయింది. అప్పుడపుడు ట్యూషన్లో హిందీని బట్టికొట్టే సమయంలో ఆ అమ్మాయి వైపు ఒక లుక్ వేసేవాడిని, ఆ లుక్ మధ్యలో ఒక బాక్గ్రౌండ్ సాంగ్ కూడా వేసుకునేవాడిని : –
Film: Kuch Kuch hota hai (Sharukh and Kajol)
“Tum paas aaye yun muskuraye
Tumne na jaane kya sapne dikhaye
Tum paas aaye yun muskuraye
Tumne na jaane kya sapne dikhaye
Ab to mera dil jaage na sota hai
Kya karun haaye kuch kuch hota hai
Kya karun haaye kuch kuch hota hai “
చదువులో పెద్దగా ఎప్పుడూ శ్రద్ధ పెట్టని నేను, సమయానికి మా ఇంటినుండి ట్యూషన్ కి బయలుదేరుతున్నానని మా నాన్నగారు సంతోషపడి మా అమ్మగారికి “బాబుకి ఒక గ్లాస్ హార్లిక్స్ కలుపు” అని చెప్పేవారు. నా మనసులో మాత్రం నాన్నకి అసలు విషయం తెలిస్తే నాలుగు ఉతికి మా అమ్మ చేత నాకు సెరెలాక్ తాగించి, ఆయనే స్వయంగా దగ్గరుండి గుడ్-వర్డ్స్ చుక్కలు వేస్తారేమో అని అనుకునేవాడిని.
సరే మొత్తానికి రోజూ మా ఇంటినుండి ట్యూషన్కి నా సైకిల్ మీద తెగ స్పీడ్గా వెళ్ళేవాడిని. అప్పట్లో నా సైకిల్ కు రాజధాని ఎక్సప్రెస్స్ అని పేరు కూడా పెట్టాను. ఒకవేళ హీరో బాలకృష్ణ గారు తొడ కొట్టి నా రాజధాని ఎక్సప్రెస్స్ ని వెనక్కు వెళ్ళమన్నా — ఒక అడుగు కూడా వెన్నకి వెళ్లలేనంత స్పీడ్ గా తొక్కేవాడిని. ఒక పదిహేను నిముషాల్లో చేరుకునేవాడిని మా ట్యూషన్కి. నా సైకిల్ తాళం మాత్రం ఒక అరగంట ప్రయత్నిస్తే కానీ పడదు అనమాట, తుప్పుపట్టిన నా బుర్రలాగే అదికూడా, అస్సలు పనిచేయదు! తాళం పడగానే మెరుపు వేగంతో ట్యూషన్ లోపలికి వెళ్ళేవాడిని!
అలా మా ప్రేమకథ అర్థంకాని హిందీ, అర్థంలేని లెక్కలలాగా సాగిపోతుండగా, ఒకరోజు మా ట్యూషన్ మాస్టారు మాకు ట్యూషన్ లేదని చెప్పకుండా వాళ్ళ స్వగ్రామానానికి వెళ్లారు. అందరు ట్యూషన్కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళపోవడం మొదలు పెట్టారు, నేను , ఆ అమ్మాయి నా ఇద్దరి స్నేహితులు మాత్రం అక్కడే ఉండిపోయాం.
ఎప్పుడూ నాలాగే మట్టిబుర్రతో ఆలోచించే మా స్నేహితులు, మాకు పని ఉంది రా, మేము అలా బయటకు వెళ్తాము మీరు మాట్లాడుకోండి అని చెప్పి వెళ్లేసరికి, ఒక్కసారిగా వారి మానసిక పరిపక్వతకు వారు నాకు గొప్ప మహా ఋషులు లాగా కనపడ్డారు. కన్నా తల్లిదండ్రుల తరువాత నా స్నేహితులే నాకు అంతా అనే సెంటిమెంట్ డైలాగులు కూడా నా మనసులోకి వచ్చాయి ఆ క్షణాన!
అక్కడ ఎవ్వరు లేరు కదా, ఇంక నేను ఆ అమ్మాయి మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. ఏమి మాట్లాడుకున్నామో నాకు గుర్తు లేదు గాని, బహుశా మళ్ళీ ఒక మంచి అర్ధం కానీ హిందీ పాట వేసుకునికి ఉండివుంటాం,
Film: Mohabbatein (Sharukh and Aiswarya)
Humko humise chura lo, dil mein kahin tum chhupa lo
Humko humise chura lo, dil mein kahin tum chhupa lo
Hum akele kho naa jaaye, door tumse ho naa jaaye
Paas aao gale se lagaa lo.
మొత్తానికి ట్యూషన్ సమయం దాటిపోయింది, కానీ మా మాటలు మాత్రం పూర్తికాలేదు. సరే టైం అయింది బయలుదేరదాం అని నేను అంటే , ఇంకొంచెంసేపు మాట్లాడుకుందాం అని ఆ అమ్మాయి, ఇలా చాలాసేపు గడిచింది. నిధానంగా ట్యూషన్ బయట ఆవరణకు చేరుకొని వీడుకోలు చెప్తుండగా, హఠాత్తుగా ఆ అమ్మాయి మా అమ్మ వస్తుంది అని చెప్పి తన ఇంటివైపుకు పరుగెత్తుకు వెళ్ళింది. ఆ అమ్మాయి అమ్మగారు నా వైపుకు నడుచుకుని వస్తుంటే నాకు అమ్మోరు సినిమాలో రమ్యకృష్ణ గారు నా దగ్గరకు నడుచుకువస్తున్నటుగా అనిపించింది. సరే నేను కూడా అక్కడ నుండి పారిపోదాం అనుకునే లోపే నా సైకిల్ తాళం ఎంత తిప్పినా ఆ తాళం విప్పడం అవ్వలేదు. నాకు ఏమి చేయాలో తెలుయక నా సైకిల్ ను బుజాలమీదకు వేసుకుని పక్క వీధిలోకి పరిగెత్తాను. (బాక్గ్రౌండ్ సాంగ్: తమ్ముడు సినిమాలో చివరి పాట, రమణ గోగుల గారి గాత్రంతో :-
look at my face in the mirror,
and I wonder what I see,
I’m just a traveling soldier,
and I can be all I can be
ఆ రోజూ ఎలానో గడిచిపోయింది, కానీ మరుసటి రోజూ ఆ అమ్మాయివాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పినట్టుగా మా ఇంటెలిజెన్సు వర్గాలనుండి సమాచారం. మా నాన్నగారు ఆ అమ్మాయి వారి నాన్నగారు గవర్నమెంట్ టీచర్లు కావడంతో ఇంటెలిజెన్సు సమాచారం నిజమే అని నిర్దారణకు వచ్చాను. ఆ రోజునుండి నేను మంచి వాడిగా చేసిన నటన అంతా ఇంతా కాదు! ఉదయాన్నే లెగవడం, చదువుకున్నటుగా నటించడం, సమయానికి స్కూల్ కి వెళ్లడం, రాగానే మళ్ళీ చదువుకోవడం ఇలా అనమాట.
మా నాన్నగారు నా నటన చూసి బహుశా అపరిచితుడు సినిమాలోని ఒక డైలాగ్ తన మనసులో అనుకున్నారేమో “ఒరేయ్ NTR ని చూసా, ANR ని చూసా, కమల్ని చూసా రాజనీకాంతి ని చూసా, కానీ నీ అంత మహా నటుడని చూడలేదు” అని!
మా నాన్నగారు అనుకున్నా, అనుకోకపోయిన నేను నా జీవితం మొత్తంలో నా గురించి గొప్పగా చెప్పుకునేది మాత్రం నేను మా ఇంట్లో ఒక నెల రోజులపాటు బుద్ధిమంతుడిలా చేసిన నటన. బహుశా నా నటనకు ఆస్కార్ కూడా వచ్చేదేమో! మోహన్ బాబుగారే చెప్పాలి మరి!