అది ఒక చీకటి రాత్రి ….
రాత్రి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది, ఈ చీకటి రాత్రి ఏంటి బాబు అని నన్ను అపార్థం చేసుకోకండి!
విషయం ఏంటంటే, మరుసటిరోజు నాకు అర్ధంకాని హిందీ పదో తరగతి ఫైనల్లింగ్ పరీక్ష అనమాట. మన హిందీ లేవులు “ఏక్ గావ్ మె కిసాన్ రెహత్తాత“ మాదిరి! అందుకే అది చీకటి రాత్రి అని వర్ణించాను. అసలు మా వమిఁశ్యం లో హిందీ పాసు అయినట్టు చరిత్రలోనే లేదు. మాది చరిత్ర తెలుసుకోవాల్సినంత వమిఁశ్యం కూడా ఏమి కాదు అనుకోండి అది వేరే ఇషయం !
అసలే భయంతో నిద్రరాక చస్తుంటే, మా కాలనీ చర్చి స్పీకర్లు నుండి “ప్రభు యేసు నా రక్షక …ఎంత గొప్పవాడు“ అని మోతాదుకు మించిన శబ్దాలతో భజన స్తోత్రాలు వినపడసాగాయి. ఏమిటి నాకు ఈ కర్మ అని అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. నా బాధను గమనించిన మా నాయన, తలుపులు, కిటికీలు వేసుకుని పడుకో, రేపు పొద్దునే మరలా ఒకసారి హిందీ పుస్తకాన్ని తిరగెద్దువు అని చెప్పి, గుడ్ నైట్ చెప్పాడు.
తిరిగి పొద్దున్నే నాలుగు గంటలకు మా నాయన నన్ను చదుకో అని నిద్రలేపాడు. పుస్తకం తీసిన పది నిముషాలకే మరలా మా కాలనీ చర్చి స్పీకర్లు నుండి “తప్పిపోయిన కుమారుడి-” అనే బైబిల్ లోని కథ మోగింది. ఆ బైబిల్ లోని కుమారుడు తప్పిపోవడం సంగతి పక్కనపెడితే, రేపు హిందీ పరీక్ష తప్పితే నేను మా కాలనీ నుండి తప్పిపోవాల్సివస్తుంది! పంతులుగారి కొడుకు పది తప్పాడో అని అదే చర్చిలో అనుకుంటే మన లేవులు ఏం గావాలె ? అసలే మనం మన కాలనీ లో పేమస్సు వూత్తు ! పైపెచ్చు మా కాలనీ చర్చి యవ్వన ఆడపడుచులు రూతు, ఎస్తేరు, మార్తా ముందు మన లేవులు తగ్గిపోదూ?
పొద్దునే చర్చిలో పాటలుపెట్టి పిల్లల్ని పదో తరగతి పరీక్షలకు చదవనివ్వకుండా చేస్తునందుకు మా నాయనకు చిర్రుఎత్తుకొచ్చింది. ఒకసారి కోపంతో లుంగీ ఎగేసి చర్చి పాస్టర్ బ్రదర్ సామ్యేలు, బ్రదర్ వరం మీద గొడవకు పోయాడు మా నాయన. పొద్దు పొద్దునే నాకు ఒక్కటి పడింది. మొత్తానికి ఏమి మాటాడాడో గాని చర్చి నుండి పాటలు ఆగిపోయాయి. సాయంత్రం మా పంచాయితీ గంట కొట్టి మా నాయన్ను పిలిపించారు సంఘపెద్దలు. నాకు ఈ సారి రెండు వచ్చేసింది!
పెద్దలందరూ ఇక్కడ చేరారు గనుక, పంచాయితి గంట కొట్టడానికి కారణం ఏంది సెక్రటరీ గారు అని అడిగాడు మా కాలనీ పెసిడెంటు గారు. మన మాస్టారు చర్చీ మీదకు పెందలాడే గొడవకుపోయి, పాటలు ఆపకపోతే టేప్రీకార్డర్లో క్యాసెట్ ఎత్తుకుపోతానని బెదిరించాడు అని సెక్రటరీ మా పెసిడెంటుతో మొత్తుకున్నాడు. సుమారు గంట వాదోపవాదాలు ఇన్న మా పెసిడెంటు గారు, కాలనీ లో ముసలోళ్ళు చర్చికి రాలేరు, వారికి వినపడడం కోసం పాటలు ఆపే ప్రసక్తే లేదు, కానీ పరీక్షలప్పుడు కొంత సౌండ్ తగ్గిస్తామని పంచాయితీ ముగించారు! మా ఊరోళ్లంతా టీచర్ గారు చర్చికి పోడు, పిల్లల్ని కూడా పోనీయడు, అంతా నాస్తిక ఎవ్వారంలాగా ఉందే అని చెవు కోరుకున్నారు!
నా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి, మనం హిందీ పరీక్ష పాసు, పైపెచ్చు పదో తరగతి ఫస్టుక్లాసు లో పాస్సింగు అయ్యాం. మా కాలనీలో ఆ వారం కలరింగ్ అంతా మనమే!! నేను ఫస్టుక్లాసు లో పాస్సింగు అయినందుకు మా నాన్న మరుసటి రోజు ఒక కొత్త టేప్రీకార్డరు కొని చర్చిలో గిఫ్టుగా ఇస్తూ చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తే, “నేను నా పిల్లలు అన్ని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పు చేస్తే ఆ దేవుడనైన ప్రశ్నిస్తాం”.