సుమారు 13 సంవత్సరాల వయసు అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోడానికి ఇంటి నుండి మా ఊరి రైల్వే స్టేషన్ దగ్గరకకు నా సైకిల్ వేసుకుని బయలుదేరాను. రైల్వే స్టేషన్లో నా సైకిల్ వదిలేసి హౌరా ఎక్సప్రెస్ ఎక్కి, ఎక్కడికో వెళ్ళిపోయి, ఎవ్వరికీ తెలియకుండా ఏదైనా చేసుకోవాలని గొప్ప ప్లాన్ వేసుకున్నాను షెర్లాక్ హోమ్స్ లాగా.
ఈ సంఘటనకు ముందు సరిగ్గా పదిరోజుల క్రింద నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు మా బడి పంతులు. మా క్లాసులో నేను తప్ప అందరు లెక్కల పరీక్ష పాస్ అయ్యారు. నాకు ఎప్పుడు అ పంతులు చెప్పిన లెక్కలు అర్ధం కాలేదు. అసలు ఎందుకు ఆ లెక్కలు చేయాలో, అలానే ఎందుకు చేయాలో నాకు అర్ధం కాలేదు. పైగా మా క్లాసులో అందరు తెగ మెచ్చుకునే వారు మా పంతులుని (ఒకటే భజన). మా క్లాసులో నేను లెక్కలు తప్పినందుకు కొంత చిన్న చూపికి గురి అయ్యాను, కానీ పెద్దగా నేను దానికి బాధ పడింది ఏమి లేదు.
సమస్య ఏంటంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మా నాన్న సంతకం కావాలి. మా నాన్న స్వయానా పంతులు గనుక కొంత నియమ నిబద్ధతలు కలవారు. ఆయనంటే చిన్నపుడు బాగా భయం. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తే ఏమి అవుతుందో, ఏమి అంటారో అని చాలా భయం వేసింది.
ఒక వారం రోజులు మా పంతులు రోజు అడిగేవాడు మీ నాన్న సంతకం ఏది అని. నేను ఎదో చెప్పి తప్పించుకునేవాడిని. కానీ రోజు రోజుకి నా మీద వత్తిడి ఎక్కువవడం తో నాకు ఏమి చేయాలో తోచలేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంట్లో చూపిస్తే ఒక బాధ, చూపించకపోతే బడిలో ఇంకో బాధ.
ఇక ఆ వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నాను.
నేను ఆ రోజు సరిగ్గా మా రైల్వే స్టేషన్ కి చేరుకునే సరికి ఆ బండి వెళ్ళిపోయింది. నేను మరల రేపు రైలు ఎక్కడానికి వెళ్దాం అని అనుకుని తిరిగి ఇంటికి బయలుదేరాను. ఈలోపల మా నాన్నగారు నా బ్యాగ్లో నుండి రిపోర్ట్ తీసుకుని చూసేసారు. బాగా తిట్టారు, ఒక వారం లో పరిస్థితి కుదుటపడింది. షెర్లాక్ హోమ్స్ ప్లాన్ విఫలమైంది.
ఇంటర్మీడియేటలో నన్ను ఒక ప్రైవేట్ కళాశాలలో చేర్చారు (మా ఊరిలోనే ఒక చిన్న కళాశాల). ఉదయం 7:30 నుండి రాత్రి 7:30 వరకు పాఠాలు. నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు. అందరు ఆ కళాశాల ఉపాధ్యాయులను తెగ మెచ్చుకుంటూ (భజన), చదివేస్తున్నారు. నాకు ఆ కళాశాలకు వెళ్ళబుది కాలేదు.
రోజూ కళాశాలకని బయలుదేరి, ఎక్కడికో వెళ్లి ఒంటరిగా కుర్చునేవాడిని, లేదా నా స్నేహితులతో కలసి కేరమ్ బోర్డు ఆడుకునేవాడిని . చాలావరకు ఇంటర్మీడియేటలో రైల్వే స్టేషన్లోనే గడిపాను (అప్పుడు షెర్లాక్ హోమ్స్ ప్లాన్న్స్ ఏమి లేవు).
మా కళాశాల యాజమాన్యం మా నాన్నకి చెప్పారు మీ కొడుకు క్లాసులకు రావడం లేదని. అప్పటికే మా నాన్న నా చదువు విధానం గురించి అర్ధమయ్యి , అప్పుడపుడు కళాశాలకు వేళ్ళు, నీకు నచ్చినప్పుడు చదువుకో అని చెప్పారు.
నాన్న చెప్పినట్టు కళాశాలకు వెళ్ళేవాడిని. కానీ, క్లాసులలో ఎక్కువ నిద్రవచ్చేది, నిద్రపోయావాడిని.
కొంచెం పెద్ద అవుతున్న క్రమంలో నాకు మా నాన్నకి చాలా అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆయనంటే నాకు ఇప్పటికి కొంత గౌరవం ఉన్నా, నేను ఆయనతో చాలా విషయాలు అంగీకరించలేక పోయేవాడిని. ముఖ్యమైన అభిప్రాయ బేధం మాత్రం మా అమ్మ పట్ల, ఆమె కుటుంబం పట్ల ఆయనకు ఉన్నా అవగాహనా, నడుచుకున్న విధానం. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం వలన దీని గురించి నేను ఇక్కడ రాయలేను. ఇలాంటి అనేక అంశాలు నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. నిరాశవాదం నా మైత్రిని చాలారోజులు కోరుకుంది.
నా ఇంజనీరింగ్ చదువులో కూడా చాలావరకు పాఠాలు ఏమి అర్ధం కాలేదు. ఎందుకు చెపుతున్నారో అర్ధం కాలేదు. నాకు ఇంజనీరింగ్లో విద్యావిధానం పట్ల పూర్తి వ్యతిరేక భావన కలిగింది . కళాశాలకు వెళ్ళడం తగ్గించేసాను. ఆ వాతావరణం నాకు పెద్దగా నచ్చలేదు .
ఇంజనీరింగ్ అయిపోయింతరువాత చాల మంది పెద్దలు నాకు ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఉద్యోగం, భద్రత, సంఘంలో కుటుంబ పేరు లాంటివి.
వారు చెప్పిన మాటలకు, నీతులకు, బోధనలకు నాకు నిరుత్సాహం మరింత పెరిగింది.
నేను పైన చూపిన సంఘటనలు అన్ని నా జీవితం మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఇప్పటికి నాకు చాలా మంది ఉపాధ్యాయులతో , పెద్దలతో , సంఘముతో , విద్యావిధానంతో , మా నాన్నతో సాపత్యం కుదరలేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు అనుకోండి అది వేరే విషయం.
ఒక రోజు నేను ఫెడ్రిక్ నీషే (జర్మన్ ఫిలోసఫర్) గురించి చదువుతున్నపుడు అయన రాసిన ఒక వాక్యం నన్ను బాగాలోతుగా ఆలోచింపచేసింది.
“Aus der Kriegsschule des Lebens.—Was mich nicht umbringt, macht mich stärker,” — german language
“Out of life’s school of war—what doesn’t kill me, makes me stronger.”
జీవిత పోరాటంలో నిన్ను ఏదయితే చంపదో అది నిను బలవంతుడను చేస్తుంది.
ఈ వాక్యం చదివి నేను నా జీవితం గురించి విశ్లేషించుకోవడం మొదలుపెట్టాను.
చిన్నప్పటినుండి నాకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్ధం కాక నరకం అనుభవించాను.ఆ నరకం నన్ను చావుదాకా తీసుకువెళ్ళింది, కానీ నన్ను చంపలేదు! ఆ నరకం నుండి బయట పడడానికి నేను స్వయంగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. సొంతంగా అర్ధం చేసుకున్నాను, లెక్కలు ఎందుకు చదవాలో తెలుసుకున్నాను, ఇష్టపడి చదవడం నేర్చుకున్నాను. ఆ చేదు సంఘటనలు నన్ను మరింత మానసికంగా బలవంతుడను చేసాయి.
“They did not kill me, they just made me stronger”
మా నాన్న గారికి నాకు ఉన్నా అభిప్రాయభేదాలు నన్ను అయన నుండి దూరం చేసాయి. అయన మా కుటుంబంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన నేను నరకం అనుభవించాను. కానీ ఆ నరకం నన్ను చంపలేదు. ఇలాంటి సంఘటనలు చాలా చూసింతరువాత నేను ఎమోషనల్ స్టెబిలిటీ ని సంపాదించగలిగాను. ఆయనను నా పెళ్ళికి ఆహ్వానించాను, కానీ నా పెళ్ళికి రాను అని కబురు పెట్టారు. అప్పటికే
“nothing can hurt me anymore”
అనే ఎమోషనల్ స్టెబిలిటీ పొందిన నేను , పర్వాలేదు రాక పోతే, అయన ఇష్టం అని అనుకున్నాను.
ఇక కొంత మంది పెద్దల అహంకారం, సంఘము యొక్క మూర్కత్వం నన్ను కృంగదీసినా, ఇంజనీరింగ్ తరువాత నాకు ఉద్యోగం లేనప్పుడు నన్ను నా స్నేహితులతో పోలుస్తూ తూకం వేసినా, అవి నన్ను చంపలేదు.
వయసుకు గౌరవం కాకుండా , సెన్సిబిలిటీతో మాట్లాడిన చిన్న వారినైనా గౌరవించడం మొదలు పెట్టాను. నాకు నచ్చినట్టు బ్రతకడం నేర్చుకున్నాను, ఇష్టమైన వాళ్ళను గాడంగా ప్రేమించడం మొదలుపెట్టాను, నాకు నేనే గురువును అయ్యాను. ఒక్కమాటలో చెప్పాలంటే మానసికంగా మరింత బలవంతుడను అయ్యాను.
నా జీవితంలో అతి పెద్ద పాఠం : “what doesn’t kill me, makes me stronger “
ఫుట్‌నోట్స్
[1] What Does Not Kill Me – Nietzsche Postcard by CrankyOldDude