పది సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లా మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పిల్లల ఆశ్రమంలో రెండు రోజులు వాలంటీరుగా గడుపుదామని వెళ్ళాను!
రాత్రి ప్రయాణం చేసిన కారణంగా అలసిపోయి పెందలాడే లెగవలేక పోయాను. కానీ ఉదయాన్నే పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్న శబ్దాలకు లెగిసి బయటకు వచ్చాను. పోదున్నే కొత్త మొహాన్ని చూసిన రాజు, “అన్నా క్రికెట్ ఆడడానికి వస్తావా?” అని చిరునవ్వుతో, ఉత్సహంతో అడిగాడు. సరే అని రాజుతో కొంచెం సేపు క్రికెట్ ఆడాను. అందరి పిల్లలాగే రాజులో చిలిపిదనం, అమాయకత్వం అలుపెరగని శక్తీని గమనించాను. ఆడడం పూర్తి అయిన తరువాత బడికి వెళ్ళాడు రాజు. రాజుని తిరిగి సాయంత్రమే చూడగలిగాను. ఆశ్రమంలో ఉన్న ఒక చిన్న ఆసుపత్రిలో కనపడ్డాడు రాజు. రాజుకి HIV పాజిటివ్ ఉన్నదని తెలుసుకున్నాను. నన్ను చూసి అదే చిరునవ్వుతో, అదే ఉత్సాహంతో పలకరించాడు రాజు.
స్రవంతి అనే ఇంకో పాపని కూడా అక్కడే చూసాను. స్రవంతికి రెండు కళ్ళు లేవు. తన శరీరం నడవడానికి, తన సొంత పనులు చేసుకోనివ్వడానికి సహకరించదు. పైగా, స్రవంతి తన మెడను నిముషానికి కనీసం పదిసార్లు అయినా తిప్పుతుంది. అది ఎలాంటి వ్యాధో నాకు గుర్తులేదు. స్రవంతికి ఒక బామ్మా ఉందని తెలుసుకున్నాను (రక్త సంబంధం కాదు అట). ఆ బామ్మగారు దగ్గరలో ఉన్న గ్రామం నుండి ఒక కిలోమీటరు నడిచివచ్చి స్రవంతికి రోజు కాలకృత్యాలు చేసి భోజనం పెడుతుందట. ఒక రోజు నేను బామ్మా ఎందుకు నీకా శ్రమ, ఇక్కడ ఉన్నారు కదా స్రవంతిని చూడడానికి అని అడిగితే ఆ బామ్మా, బాబు “స్రవంతి అంటే నాకు ఇష్టం, నాకు మనవరాలి లాగా” అని అంది.
అసలైన జీవితం అంటే ఏంటి అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కొన్ని ప్రశ్నలకు సమాదానాలు ఉండవేమో! అందుకనే ఆ ప్రశ్న నాకు ఇప్పటికి ప్రశ్నలాగే మిగిలిపోయింది.
కానీ స్రవంతి బామ్మగారిలోని ప్రేమ, రాజులో ఉత్సహం నాలోను కలగాలని, నాతోనే ఎల్లప్పుడు ఉండాలని నాకు ఒక స్వార్థం. అలాంటి ప్రేమను, ఉత్సహాన్ని నా జీవితంలో ఇంకొకరికి పంచె శక్తి వచ్చిన రోజు నా జీవితానికి అర్ధం వస్తుందని నా మనస్సు నాకు చెపుతూ ఉంటుంది. దాని కోసమే నా ప్రయాస …… ఆ ప్రయాస కోసం నా ప్రయాణమే నా అసలైన జీవితం ఏమో అని అనిపిస్తుంటుంది!