హైదరాబాద్ నగరంలో చదువుకునే రోజులు అవి,
మొదటి రెండు సంవత్సరాలు కొంత బాగానే గడిచింది. కొన్ని కారణాల చేత మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేకపోయింది. నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించాను. ఒక రెండు సంవత్సరాల పాటు కష్టాలు తప్పలేదు. కొన్ని సార్లు రూమ్ రెంట్ కట్టడానికే డబ్బులు సరిపోయేవి కాదు. అలాంటి రోజులో ఒక పూట మాత్రమే భోజనం దొరికేది. ఏంటో ఆకలి వేస్తుందన్న ఆలోచన కూడా ఉండేది కాదు కొన్ని సార్లు.
రెండు రోజుల సెలవుకోసం మా ఇంటికి వెళ్ళాను. ఒకసారి ఇంట్లో ఉన్న వంటగదికి వెళ్ళాను. కొంత బియ్యం, పప్పు ఇంకొన్ని సామాన్లు తప్ప పెద్దగా నాకు వేరే వస్తువులు ఏమి కనపడలేదు. పైగా ఆ బియ్యం కూడా ప్రభుత్వం వారు ఇచ్చిన కిలో రెండురూపాయల బియ్యం, ఎవరిదగ్గరో కొని ఇంట్లో వాడుతున్నారు. ఇక మా ఫ్రిడ్జిలోకి ఒకసారి తొంగిచూసాను, అంతా కాళీ! మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి గురించి బెంగ నాకు ఎవ్వరిలోను కనిపించలేదు. ముందుకు పోవడం అనే ఆలోచనే కనపడింది!
సరే అని నేని తిరిగి హైదరాబాద్ కి బయలుదేరాను. పరిక్షలు దగ్గర పడుతుండడంతో ఒకరోజు నా స్నేహితుడు తన ఇంటికి వచ్చి ఒక సబ్జెక్టు చెప్పమన్నాడు. సరే అని నేను వెళ్లి వాడికి ఒక రోజంతా ఆ సబ్జెక్టు నేర్పించాను. సాయంత్రం ఏదన్నా తిందాం అని నా స్నేహితుడి తన వంటగదిలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్ళ ఫ్రిడ్జ్ నిండా వస్తువులు, పండ్లు వగైరా చాలా ఉన్నాయి. వారిది కొంత మెరుగైన కుటుంబం లాగ అనిపంచింది. ఎందుకో ఆ రోజు నాకు మా ఇంట్లోకూడా పరిస్థితి మెరుగు పడితే, మా ఫ్రిడ్జినిండా వస్తువులు ఎప్పుడు ఉండాలి అనే ఆలోచన, చిన్న కోరిక కలిగింది.
ఆ రోజునుండి సరిగ్గా 10 సంవత్సరాలు, మా పరిస్థితి కొంత మెరుగు పడుతూ వచ్చింది. నేను ఎపుడు మా ఫ్రిడ్జ్ నిండుగా ఉండేటట్టు చూసుకుంటా! అదో చిన్న తృప్తి నాకు! నా భాగస్వామి ఎప్పుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది, ఎందుకు నిండుగా కొంటావ్, కొన్ని సార్లు పాడవుతుంటాయి అని. కానీ నాలో కలిగే చిన్న ఆనందం తనకు తెలియదు కదా :). ఈరోజు మా ఫ్రిడ్జ్ ఇదిగో …..
ఒక్కసారి నేను పది సంవత్సరాల వెనక్కు తిరిగి చూసుకుంటే, ఆ రోజు ఆకలే నాకు జీవిత పాఠాలు నేర్పింది అనిపిస్తుంది. ఆకలి నుండే కోరిక పుడుతుంది, కోరిక తీర్చుకోమని ఆ ఆకలే మనుకు నేర్పుతుంది. ఆ కోరిక తీరాక మనసుకు చిన్న ఆనందాన్ని ఇస్తుంది. ఆ చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడమే జీవితమేమో అని అనిపిస్తుoటుంది.
ధన్యవాదాలు,
ప్రవీణ్.
గమనిక: మా ఫ్రిడ్జిలో ఉన్న వస్తువులు అన్నీ నేనే తినెయ్యను, మా ఇంట్లో వారికీ, తరుచుగా వచ్చే స్నేహితులకు వండి పెడుతుంటా! మా శ్రీమతి గారు ఏదో అలా నన్ను వేస్ట్ చేస్తావ్ అని తిడుతుంటారు, నిజానికి నేను వేస్ట్ చేయను, గుడ్ బాయ్ నేను :p