చంద్రయాన్-3 మిషన్!

ISRO వారి చంద్రయాన్-3 మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయినప్పటి నుండి, మన దేశంలో జాతీయవాదం అనేక రంగాలలో అసాధారణమైన రీతిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. బలమైన జాతీయవాదపు ప్రకంపనలు మన దేశ రాజకీయ రంగాన్ని, మీడియాను, క్రీడా రంగాన్ని , సినిమా రంగాన్ని చివరకు సాధారణ జనాభాను సైతం ఆవరించాయి.

మన దేశంలో ఇటువంటి మాస్ హిస్టీరియా జాతీయవాదం సాధారణంగా హై-వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో గమనించబడుతాయి!

ISRO సాధించినది నిస్సందేహంగా ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం. ముఖ్యంగా మనం గనుక చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే, మన ఇస్రో చేపట్టిన ఈ చంద్రయాన్ ప్రయోగం యావత్ మానవాళి ప్రగతికి దిశా నిర్దేశం చేస్తుందని అనడానికి ఎలాంటి సందేహం లేదు.

ఏదేమైనప్పటికీ, సైన్స్ మరియు సాంకేతికతలు యావత్ ప్రపంచానికి సంబందించినవి, ఇవి కేవలం ఒక దేశానికో , ప్రాంతానికో పరిమితం అయ్యేవ్వి కావు. ఒకవేళ ఏదైనా దేశం వాటి సార్వభౌమాధికారాలు మావే అని చెప్పుకుంటే అది ఆ దేశం యొక్క చారిత్రిక తప్పిదమే అవుతుంది తప్ప మరొక్కటి కానే కాదు.

సైన్స్ పుట్టుక్క మరియు దాని గమనం గురించి మనందరం తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన అంశం. హేతుబద్దమైన ఒక ప్రశ్నకు, ఒక ఆబ్జెక్టివ్ మెథడాలజీ (గణాంకాలు, సూత్రాల) ద్వారా సమాధానాన్ని అన్వేషించే క్రమంలో సైన్స్ పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి, వాటిని సైన్స్ పత్రికలలో ప్రచురణకు పంపి, వాటిని మిగతా శాస్త్రవేత్తలు క్షున్నంగా పరిశీలించి, ముఖ్యమైన సైన్స్ సమావేశాల్లో చర్చి జరిపిన తరువాత మాత్రమే ఫలితాలను ప్రచురిస్తారు. ఆ ప్రచురించిన ముఖ్యమైన ఫలితాలను తీసుకుని శాస్త్రవేత్తలు తరువాత ప్రయోగాలు ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఇది నిరంతరంగా సాగే ఒక ప్రక్రియ. తప్పులు ఉంటె సరిదిద్దుకోవడం, కొత్త ఫలితాలను ఛేదించడం సైన్స్ లో ఒక భాగమే. ప్రపంచ శాస్త్రవేత్తల సహకారం, వాదోపవాదాలతోనే అనేక కొత్తవిషయాలు సైన్స్ ప్రచురణల ద్వారా ప్రపంచానికి తెలియచేస్తుంది. కనుక సైన్స్ ప్రపంచ శాస్త్రవేత్తల సహకారంతోనే ముందుకు పోతుంది. సైన్స్ ను కేవలం దేశ సరిహద్దులకే పరిమితం చేయడం అవివేకం. ప్రపంచ శాస్త్రవేత్తల సహాయంతోనే సైన్స్ ఇప్పటివరకు ముందుకు వెళ్ళింది, ఇక ముందు కూడా వెళుతుంది. ఉదాహరణకు న్యూటన్, కెప్లర్, ఐన్‌స్టీన్, ఆర్యభట్ట, సర్ సి. వి రామన్, ప్రో. విక్రమ్ సారాభాయ్ మరియు ఇతర శాస్త్రవేత్తలు సైన్స్ పురోగతికి దోహదపడిన వారు. వీరు సైన్స్ విశ్వ గురువులు.

నిస్సందేహంగా మన ఇస్రో అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఒక సంస్థ. కానీ ఇస్రో తన ఖ్యాతిని , గౌరవాన్ని, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. జాతీయవాదం ఇస్రో ఆఫీస్ వెనక తలుపును తన్నుకుని హాల్లోకి ప్రవేశించి దేశమంతటా ఇస్రో విజయాన్ని తన ఖాతలో వేసుకుని ముందుకు పోతుంది. నేను ఇంతకుముందు రాసిన “జాతీయవాదం వెనక తలుపు తన్నుకుని” అనే వ్యాఖ్యతో చాల మంది అంగీకరించకపోవచ్చు. జాతీయవాదం ISRO వెనక తలుపు తన్నుకుని కాదు, నేరుగా ముందు తలుపునే తన్ని ఇస్రో గ్లోబల్ లైవ్ టెలికాస్ట్ స్క్రీన్‌లపై ప్రత్యక్షమైంది అని కొందరు అనుకోవచ్చు, నేను దీనిని ఖండించలేను! స్క్రీన్ ల పై ప్రత్యక్షమవడమె కాదు, మన ఇస్రో ఛైర్మన్‌ ప్రజలకు మిషన్ పరిస్థితి ఏంటో లైవ్ టీవీ లో వివరిస్తున్నపుడు, ఒక వ్యక్తిగత ఫోన్ కాల్ ద్వారా అంతరాయం కలిగించే పరిస్థితికి జాతీయవాదం చేరుకుంది. మన దేశ విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మరియు కాలేజీల్లో చాలా మంది యువతీ యువకులు ఈ తీవ్రమైన జాతీయవాద ప్రభావానికి గురవుతున్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఒక బలమైన జాతీయవాదం చేసే ఆకృత్యాలు అంత ఇంత కావు. అవి ప్రపంచ స్థితిగతులను క్రూరంగా ఎలా మార్చాయో జర్మనీ, ఐరోపా , జపాన్ చరిత్ర ద్వారా మనం ఇప్పటికే చూసాం.

ఇస్రో మన భారతదేశంలో ఒక స్వతంత్ర సంస్థ. ఇస్రో ప్రపంచ మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ మరియు టెక్నాలజీ ద్వారా ప్రపంచ సమస్యలకు పరిష్కారాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తుంది . ఇస్రో డైరెక్టర్ ప్రపంచ సంస్థలైనటువంటి NASA, JPL, ESA మరియు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థలు, చంద్రయాన్-3 విజయానికి ఎలా సహకారాన్ని అందించాయో ఇప్పటికే నొక్కి చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశాలు కేవలం జాతీయవాదానికి ముడి పెట్టకుండా ప్రజానీకానికి శాస్త్రీయ దృక్పథాన్ని (భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 A(h) ప్రకారం) ప్రోత్సహించడానికి ఇస్రో ప్రయత్నం చేస్తుందని నేను మనసారా ఆశిస్తున్నాను.

ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రుని యొక్క దక్షిణ ద్రవానికి సంబందించిన విషయాలు, ఉపయోగపడే నీటి రూపాల ఉనికి గురించి శాస్త్రీయ పరిశోధనలు ఇంకా ఇస్రో ప్రచురించలేదు. అవి ప్రచురించిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా వాటిని చర్చించి విశ్వ రహస్యాలను మనం అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. మెరుగైన మానవాళి కోసం చంద్రయాన్-3 విలువైన శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x