మా కాలని ని ఆనుకునే రైలు పట్టాలు ఉండేవి. ఇటుపక్క పట్టాలేమో మద్రాసు పోయే బండ్లుకు అటుపక్క పట్టాలు బెజవాడ, కలకత్తా పోయే బండ్లుకు అనమాట! రైలు బండి శబ్దం వినిపించగానే పరిగెత్తుకుంటూ పోయి ఏ బండి పోతుందో కనిపెట్టుడు చిన్నప్పటి ఒక అలవాటు మాకు! పొద్దుగాల పొద్దుగాల ఒంగోలు పాసెంజరు నుండి రాత్రి మద్రాసు పోయే సర్కారు ఎక్సప్రెస్స్ దాకా బండ్లను లెక్కపెట్టుడు చిన్నపటి ఒక సరదా!
PC: Indian Railways.
వచ్చిపోయే అన్ని బండ్లలో పెద్ద బండిగా మాకు తెలిసిన బండి “కోరమండల్ ఎక్సప్రెస్స్”! సుమారు సాయంత్రం నాలుగు ఇంటికి పెద్ద కూత పెట్టి, ఆరు ఎసి పెట్టెలతో, ఎర్రటి ఇంజనుతో ఏమా పాస్టుగా పోయేది కోరమండల్ ఎక్సప్రెస్స్. ఆ రోజుల్లో ఎర్ర ఇంజను ఉండే అతి కొద్ది బండ్లలో ఒక బండి ఈ కోరమండల్ ! మా కాలనీ పెద్దోళ్ళు ఏ బండిదగ్గరికైనా పిల్లకాయల్ని పంపండి కాని కోరమండల్ బండి దెగ్గరకు మాత్రం పంపమాకండి అని చెప్పుకునేవారు. దాంతో కోరమండల్ బండిని ఏరోజన్నా చూసుంటే ఆ రోజు ఒక గొప్ప ఇషయంలా ఉండేది మా పిల్లకాయలకి.
రొంత పెద్ద అయ్యాక కోరమండల్ బండి కలకత్తా నుండి మద్రాసు పోతుందని తెలుసొచ్చింది, పైగా కలకత్తా లేస్తే విశాఖపట్నం, తరువాత బెజవాడ. బెజవాడ లేస్తే మద్రాసు అంతే, మధ్యలో స్టాపింగులు ఎక్కడ లేవట. ఒకవేళ బెజవాడ నుండి విశాఖపట్నం కోరమండల్ లో ఎల్లాలంటే సాధ్యపడదు, టిక్కెటు కేవలం 700 కిలోమీటర్లు ఉంటేనే ఇత్తారట ! కోరమండల్ బండి పోతాంటే ఏ బండైనా పక్కకు క్రాసింగు పెట్టి ముందు కోరమండల్ ను వదులుతారంట. నిజంగా ఆ రోజుల్లో మాకు కోరమండల్ బండి అంటే ఒక గొప్ప అద్భుతం. నా జీవితంలో ఒకేసారి ఎక్కాను ఆ పెద్దబండిని. ఆ రోజు నేను ఏదోసాదించిన చిన్ని ఆనందం నా మనసుకు!
అలాంటి గొప్ప వైభవం ఉన్న కోరమండల్ బండి పోను పోను అనేక కొత్త బండ్లు వచ్చి , ట్రాఫిక్ పెరిగి చిన్న బండిగా మారిపోయింది. స్పెషల్స్ పేరుతో డబ్బులు దండుకునే ట్రైనులు అచ్చి మా కోరమండల్ బండిని వెనక్కి నెట్టాయి. నిజంగా ఈ రోజు కోరమండల్ బండి పట్టాలు తప్పడం చూసి గుండె కల్లుక్కు మంది! పాతరోజులే బాగుండేయి, తక్కువ ట్రాఫిక్, మంచి బండ్లు!
PC: Indian railways!