కీర్తి తొందరగా వచ్చి ఈ దోస తిను, ఎంత సేపు రెడీ అవుతావు? మీ నాన్న నీ గురించి కింద ఎదురుచూస్తున్నారు అని కీర్తి వాళ్ళ అమ్మ హడావిడి చేయసాగింది.
ఎప్పటినుండో నేషనల్ వాలీబాల్ అండర్ 16 టోర్నమెంట్ లో పాల్గోవాలన్న కీర్తి ఆశ రేపు నిజం కాబోతుంది. పైగా కీర్తి మిత్రుడు గోపి కూడా ఆ టోర్నమెంట్ కోసం తనతో పాటు వస్తున్నాడన్న ఆలోచన కీర్తికి మరింత ఆనందాన్ని కలిగించింది. గోపి పట్ల ఆకర్షణ గత రెండుసంవత్సరాలుగా ఉన్నా, ఎప్పుడు మనస్సు విప్పి గోపితో మాట్లాడింది లేదు కీర్తి. గోపితో పాటు ఒక సాయంత్రం రైలు ప్రయాణం, ఒక వారం టౌర్నమెంట్లో గడిపే అవకాశం ఇంకెప్పుడు రాదేమో అనే భయంకూడా కలిగింది కీర్తి మనసులో! ఎలాగైనా ఆ వారం రోజుల్లో ఒకసారి గోపితో మనస్సు విప్పి మాట్లాడాలి అని అనుకుంది కీర్తి!
అమ్మ వెళ్ళొస్తానని చెప్పి, వారం రోజులు సరిపోయే ముద్దులు అమ్మకి పెట్టి రైలు ఎక్కడానికి బయలుదేరింది కీర్తి. రైల్వేస్టేషన్ కి చేరుకోగానే కీర్తివాళ్ళ నాన్నగారు పి.టీ మాస్టారు రాజుని కలిసి ఎలా ఉన్నారు మాస్టారు అని ఆప్యాయంగా పలకరించారు. రాజు మాస్టారు ఆ ఊరిలో ప్రముఖ క్రీడాకారుడు, పెద్ద మనిషి, కీర్తి వాళ్ళ స్కూల్ జట్టును ఎంతో పటిష్టంగా చేసిన ఘనత ఆయనదే. మీరు పిల్లల్లతో ఉన్నంత వరకు ఈ టోర్నమెంట్ మనమే గెలుస్తాం మాస్టారు అని కీర్తి వాళ్ళ నాన్న రాజు మాస్టారు తో అంటుండగా, అయిదు నిముషాలలో రైలు బయలుదేరుతుందని మైకులో ప్రకటించారు.
పిల్లలందరూ రైలు ఎక్కి తమ సామానులు సర్దుకుని చాలా ఉత్సాహంతో కిటికీవైపుకు చూడసాగారు.ఆ రైలుబోగీలో గోపి ఎక్కడున్నాడో వెతుకుతుంది కీర్తి! తన సీట్ కి కొంతదూరంలో గోపి ఉన్నట్టు గమనించిన కీర్తి అక్కడకు వెళ్లి గోపి పక్కన కొంచెం సేపు కూర్చుంది. నీ మీదే రేపు మహిళా జట్టు ఆధారపడి ఉంది కీర్తి, బాగా ఆడు అంటూ కొంచెం సేపు మాట్లాడుకున్నారు కీర్తి మరియు గోపి. రాత్రికావడం తో ఎవరి బెర్తులో వారు నిద్రపోవాలని టీచెర్లు ఆజ్ఞాపించగా పిల్లలందరూ ఎవరికి కేటాయించిన సీట్లల్లో పడుకోవడానికి వెళ్లారు.
తెల్లవారుజామున హైదరాబాద్ స్టేడియంకి చేరుకోగానే, రెండు గంటల విశ్రాంతి తరువాత మహిళా అండర్ 16 వాలీబాల్ కప్ మొదలయింది. ఎంతో ఆశతో కీర్తి ఆటను చూడడానికి ముందువరసలో కూర్చున్నాడు గోపి. ఆట మొదలయింది, అనుకున్నటుగానే గోపి వాళ్ళ స్కూల్ మహిళా జట్టు ముందంజలో దూసుకుపోతుంది. రాజు మాస్టారి చాణక్య వ్యూహాలతో అవతలి జట్టును అతలాకుతలం చేస్తుంది కీర్తి జట్టు. కానీ కీర్తిలో ఎదో మార్పు గమనించాడు గోపి. ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా , ఎగిరి దూకి ఆడే కీర్తిలో నిరుత్సాహం గమనించాడు. కీర్తి కళ్ళు ఎర్రగా, కంటి నీరుతో ఉండడం చూసాడు. కొంతసేపటికి కీర్తి జట్టు గెలిచింది.
PC: [1]
అట ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న కీర్తిని పక్కకులాగి కీర్తి ఎం చేస్తున్నావ్, ఎందుకు అలా ఉన్నావ్, కళ్ళు ఎర్రగా , కంట్లో నీరు కూడా, నీకు ఏమైంది? అని ప్రశ్నించగా, గోపి భుజాలమీద పడిన కీర్తి, గోపి రాత్రి అందరు పడుకున్న తరువాత రాజు మాస్టారు నా దగ్గరకు వచ్చి, ఎక్కడెక్కడో చేతులు వేసాడు, నేను అరిస్తే ఇంటికి పంపేస్తాను అని బెదిరించాడు. రాత్రంతా నా ప్యాంటు లోపల చేయి పెట్టి నాకు నరకం చూపించాడు గోపి అని కన్నీరుపెట్టుకుంటూ జీవితంలో మొదటిసారి గోపితో మనసువిప్పి మాట్లాడింది కీర్తి.
ఫుట్‌నోట్స్