మా అమ్మగారు చెపుతూ ఉంటారు, నువ్వు పుట్టిన తరువాత నిన్ను నేను తప్ప ఇంక ఎవరు ఎత్తుకున్నా బాగా ఏడ్చేవాడివి నాన్న అని. బహుశా నాకు అప్పుడు ఊహ తెలియకపోయినా, ఆ క్షణం నాకు మా అమ్మ కౌగిలే ఒక ప్రేరణ.
చిన్నపుడు బడిలో హోమ్ వర్క్ చేయనందుకు టీచర్ కొడుతుందేమో, మార్కులు సరిగా రాలేదు కనుక ఇంట్లో తిడతారేమో అనే భయంతో అసలు చదువు అంటేనే విరక్తి వచ్చేది. ఆనాడు చదువు నుండి, బడి నుండి తప్పించుకోవడమే నా ప్రేరణ.
కొంచెం పెద్దయ్యాక పదోతరగతిలో ప్రేమించిన ప్రేయసితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలని, తనను తాకుతూ ఉండాలన్న తపన. సా శరీరంలో జరిగే మార్పులకు నేను ఒక చిన్న బానిసగా మారాను. ఆ క్షణం నాకు నా ప్రేయసే ప్రేరణ.
ఇంటర్మీడియట్లో తెల్లారిందేగ్గర నుండీ రాత్రి అయ్యేవరకు బండకేసి ఉతికే బట్ట లాగ పిల్లల్ని ఉతికి పిండి చేసే బందిపోటు ఉపాధ్యాయుల నుండి దూరంగా పరుగు తీయాలనే బలమైన సంకల్పంతో కళాశాలకు దూరంగా చెట్టుల్లో, చేలల్లో తిరిగి ఇష్టమైన పుస్తకం చదవడం, క్రికెట్ ఆడడం చేసేవాడిని. ఆ రోజుల్లో క్రికెట్, పుస్తకాలే ఒక ప్రేరణ.
చదువంటే కేవలం మార్కులు, పుస్తకాలను బట్టి పట్టడం కాదు. ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని చివరికి మన చరిత్రను అర్ధం చేసుకునే ఒక హేతుబద్దమైన ప్రయాణం అని తెలిసింతరువాత, చదువు మరియు సైన్స్ నా ప్రేరణ.
కష్టం వచ్చినప్పుడు ఎవరు మనతో ఉండరు. అది బందువులకు, తల్లిదండ్రులకు సైతం వర్తిస్తుంది అని తెలుసుకునే పరిణితి వచినప్పుడు, అసలు నా ఉనికి ఏంటి అని తెలుసుకునే ప్రయాణం మొదలుపెట్టాను. ఆ ప్రశ్నల వేటలో అలెక్స్ హేలీ, చలం, ప్లేటో , సోక్రటీస్ , షోపణ్ణహెయిర్, నిషె, కంట్ , షేక్స్పియర్ మొదలైన వారితో అంతర్యుద్ధం చేశాను. ఆక్షణం నా ప్రేరణ నా ఉనికి కోసం అన్వేషణే.
ఈ విశ్వం అంతటిలో నేను ఎంత ఒంటరి అని అర్ధం అయినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ భయం నుండి తప్పించుకోవాలని నాకు పెద్దగా పొసగని ఈ సమాజంతో కొంత సాంగత్యం చేయడం మొదలుపెట్టాను. కుటుంబం, బాధ్యతలు అనే కల్పిత ఊహలను నాకు నేనే సృష్టించుకుని ముందుకు సాగడం అలవాటు చేసుకున్నాను. ఆ క్షణం కుటుంబం, సమాజం, స్థిరత్వం అనే కల్పిత ఊహలే నా ప్రేరణలు.
ఇంతికి అసలు నిజంగా నా ప్రేరణ ఏంటి? అసలు నా జీవనం కొరకు ఒక నిర్దిష్టమైన ప్రేరణ ఉందా? ఉంటె అ ప్రేరణ ఏంటి? అసలు ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరుకుతుందా?
ఇలాంటి ప్రశ్నలతో సంఘర్షణలు పడుతున్న సమయంలో రిచర్డ్ డాకిన్స్ రాసిన సెల్ఫిష్ జీన్
[2] అనే పుస్తకం చదివాను. అందులో నాకు తోచిన సారాంశం,
“A replicator survives in a survival machine whose wholesome point is to survive and replicate”
అంటే, అనేక అణువుల సమాహారంగా ఏర్పడిన డిఎన్ఏ అనే ఒక బణువు, ఒక సురక్షిత యంత్రాని ఎంచుకుని, తనను తానూ బ్రతికించుకుంటూ తన ప్రతిరూపాన్ని నిర్ముంచుకొనుటకు ప్రయత్నిస్తుంది — అని అర్ధం.
అంటే నా శరీర యంత్రంలో తలదాచుకున్న డిఎన్ఏ కు ప్రేరణ “కేవలం నన్ను బ్రతికించుకుంటూ, నా ప్రతిరూపాన్ని నిర్మించుకునే – ఒక స్వార్థం ”. బహుశా ఇదే నా నిజమైన అంతర్గత జీవన ప్రేరణ ఏమో! ఈ ప్రేరణ కారణంగా సాధ్యమైనంతవరకు సంఘానికి హాని కలగకుండా, కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ముందుకు సాగడమే జీవితమేమో.
స్వస్తి ,
ప్రవీణ్ కుమార్.