సాయంత్రం ఊరికి బయలుదేరాలి, అన్ని సామాన్లు సర్దుకున్నానా లేదా? ఉండేది మూడురోజులే కదా, కొంత సామాను సరిపోతుందిలే! ఇంతకీ అసలు ట్రైన్ టిక్కెట్టు ఈరోజుకేనా లేక రేపటికా? ఈ ప్రశ్న తలుచుకుంటే ఒక్క క్షణం నా గుండె కలుక్కుమంది. టిక్కెట్టు మరోసారి చూసుకున్నాక గుండె తిరిగి నెమ్మదించింది. బహుశా ప్రయాణం ముందర అందరికి ఎదురయ్యే ప్రశ్నలే ఏమో ఇవ్వన్నీ!
మొత్తానికి ఇంటినుండి బయలుదేరి స్విట్జర్లాండ్ లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. చుట్టూ జనం, ఎవరు ఏ బాష మాట్లాడుతున్నారా అని అర్ధంచేసుకుంటూ పదహారో ప్లాట్‌ఫారమ్ మీదకు చేరుకున్నాను. ఇక్కడ మూడు అధికారిక భాషలు మాట్లాడతారట. ఒకటి జర్మన్, రెండు ఫ్రెంచ్ , మూడు ఇటాలియన్. స్విట్జర్లాండ్, ఈ మూడు దేశాల మద్య ఉంటుంది కాబట్టి ఈ మూడు అధికారిక బాషాలేమో! ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న ఒక షాపులో కాఫీ కొనుకుందాం అని అనుకున్నాను, కానీ దాని రేటు చూసు ఎందుకులే మూడు గంటల్లో ఇంటికి వెళ్ళిపోయి కాఫీ తాగుదాం అని అ నిర్ణయాన్ని తాత్కాలిక వాయిదా వేసుకున్నాను. ఈ దేశం లో కొండలు ఎంత ఎత్తుంటాయో, రేట్లు కూడా అంతే!
బండి ప్లాట్‌ఫారమ్ నుండి కదలడానికి సిద్ధంగా ఉంది, త్వరగా బండి ఎక్కి నా సీట్లో కూర్చున్నాను. అనుకున్న సమయానికే బండి బయలుదేరింది, లేట్ అవ్వడం ఇక్కడ చాల అరుదు! బండి మొదలైన అయుదు నిముషాల్లోనే గంటకు వంద కిలోమీటర్ల వేగం పుంజుకుంది. కిటికిలోనుండి చూస్తే పచ్చని నెల , చిన్న చిన్న కొండలు, నీలం రంగులో ఉన్న ఒక నది. చూడడానికి ఎంత చక్కగా ఉందొ ! బండిలో జనం ఉన్నా, కంపార్ట్మెంట్ ల్లోని నిశ్శబ్దం బయట ఉన్న ప్రకృతి అందాన్ని మరింత పెంచిందనిపించింది. నిజంగా ఇది ఒక అందమైన దేశం!
బహుశా ఈ బండికి కూడా ఇక్కడ ప్రకృతి అందం చాల నచ్చింది అనుకుంట , తనకు సాధ్యమైనంత వేగంతో ప్రకృతి అంచులలోకి చొచ్చుకుని పోతుంది. అలా పొలాల మధ్యలో బండి పోతావుంటే, ఒక్కసారి జీవితం గురించి ఆలోచనలు నాలో మొదలయ్యాయి. నా జీవిత బండి కూడా అలానే పరుగులు పెట్టుకుంటూ ఇంత దూరం వచ్చింది. కాకపోతే ఈ రైలు బండి మార్గం అంత అందంగా నా జీవితం సాగలేదు. బహుశా ఈ లోకంలో ప్రతీ జీవి యొక్క జీవిత బండి ప్రయాణం కూడా అందంగా ఉండదేమో! కానీ ఒకటి మాత్రం సత్యం, మన జీవిత బండి అందంగా ఉన్నా లేకున్నా, జీవితంలో ముందుకు సాగుతూ ఉండడం మాత్రం ముఖ్యం. ఒక్కోసారి ఎవరికోసం ముందుకు సాగాలి అనే ఆలోచన నాకు తరుచుగా వస్తుంటుంది, కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారే వెతుక్కోవాలేమో! బహుశా ఆ వెతుకులాటలో సాగే ప్రయాణమే జీవితం ఏమో !