సంజయ్ తన జీవితంలో మొదటి సారి ఊరుని వదిలి ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. మొదటి రోజు కళాశాల చాలా కొత్తగా అనిపించింది. ఉరుకుల పరుగుల జీవనంతో ఏదో కొత్తలోకంలోకి వచ్చిన అనుభవం. సంజయ్ ఎప్పుడు ఒంటరితనాన్ని ఇష్టపడేవాడు, ఎక్కువ మాట్లాడడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంతో నిదానంగా ఆలోచించే వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుకంటే సాహిత్య పుస్తకాలంటే మక్కువ. చివరి బెంచులో కూర్చుని చదువుకుంటూ వుంటాడు.
సంజయ్ ని ఒక సంవత్సరం పాటు బాగా గమనించిన సుస్మిత సంజయ్ ని ఎక్కువగా చూడ సాగింది. ఈ విషయం గమనించాడు సంజయ్. ఒక రోజు కళాశాలలో ఎదో ఫంక్షన్ జరుగుతుండడంతో అందరు ఆ ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. ఆ ఫంక్షన్ పెద్దగా నచ్చకపోవడంతో సంజయ్ కాలేజీ బయట కాంటీన్ లోకి వెళ్లి కూర్చున్నాడు. సంజయ్ బయటకు వెళ్లడం గమనించిన సుస్మిత కాంటీన్లోకి వెళ్లి సంజయ్ ముందు కూర్చుంది.
ఏంటి సంజయ్ వచ్చేసావ్, ఫంక్షన్ నచ్చలేదా అని అడిగింది సుస్మిత?
లేదు సుస్మిత నచ్చలేదు, సౌండ్ చాలా ఎక్కువగా ఉంది, తల నొస్తుంది అని చెప్పాడు సంజయ్.
ఏం పుస్తకం చదువుతున్నావ్ సంజయ్?
చలం మైదానం!
అవునా, అందులో నీకు ఏమి నచ్చింది సంజయ్?
స్వేచ్ఛ సుస్మిత.
సుస్మిత సంజయ్ ని చూస్తూ ఉండిపోయింది ఒక అయిదు నిముషాలు.
ఏంటి సుస్మిత అలా చూస్తూ ఉండిపోయావ్ అని అడిగాడు సంజయ్?
సంజయ్ నీతో జీవితాంతం స్వేచ్ఛగా బతకాలని ఉంది నాకు అని చెప్పింది సుస్మిత.
ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉన్నారు సంజయ్ సుస్మితలు. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంత ప్రేమ వారిద్దరి మధ్యలో ఏర్పడింది. కానీ సుస్మిత ఇంట్లో అమెరికా సంబంధం వచ్చిందని సంబరం చేసుకుంటున్నారు సుస్మిత తల్లి తండ్రులు. ఇంతలో సుస్మిత ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. ఇంట్లో వాళ్ళు ససేమీరా అన్నారు. సంజయ్ సుస్మిత ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లి దండ్రులను సుస్మితను పెళ్లిచేసుకుంటాను అని అడిగాడు. దానికి వారి తల్లిదండ్రులు, చూడు బాబు నీకు మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తే చదువుకుంటున్నావ్. ఉద్యోగం కూడా లేదు, మరి మా అమ్మాయిని ఎలా చూసుకుంటావ్ అని అడిగారు? దానికి సంజయ్ దగ్గర సమాధానం లేదు. కొంత సమయం ఇవ్వండి అని సంజయ్ ఎంత బ్రతిమిలాడినా సుస్మిత తల్లిదండ్రులు వినలేదు. సుస్మితకు అమెరికా సంబంధం ఖాయం చేసేసారు, రేపు పెళ్లి. సంజయ్ నిస్సహాయత స్థితిలో ఉన్నాడు.
నాన్న … నాన్న అని సంజయ్ ని తన చిన్న కూతురు జుట్టుపట్టుకుని లేపింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంజయ్ నిద్రలేచి ఇదేంటి ఎప్పుడో 10 సంవత్సరాల కిందట జరిగిన విషయం ఇప్పుడు కలలోకి వచింది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ లోపల సంజయ్ భార్య హారిక టీ తెచ్చి, లేగవండి ఆఫీసుకి వెల్దురు గాని అని సంజయ్ ని ఆఫీస్ కి వెళ్ళడానికి అన్ని సిద్ధంచేసింది. ఆఫీసుకి వెళ్లే ముందు హారిక కు తన పిల్లలకు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు సంజయ్.
జీవితంలో ప్రేమ చాల గొప్పది. ప్రేమించబడడం ఒక గొప్ప వరం. కానీ జీవితం ఇంకా గొప్పది. తన ప్రేమలో వైఫల్యం చెందినా, జీవితంలో ముందుకుసాగాలని నిర్ణయించుకుని తన సొంత ఇంటిని, తన భార్య హారికతో తన పిల్లలతో నిర్మించుకున్నాడు. సంజయ్ కి సుస్మిత ఒక మధుర జ్ఞాపకం అంతే