ఒక రొజు ఆఫీసులో బాగా అలసిపోయి పట్నం చివరిలో విమానాశ్రయం దగ్గర ఉన్న ఒక ప్రదేశానికి ఏకాంతంగా గడపడానికి వెళ్ళాను.
ఊరి చివర్లో ఒక చిన్న అడవి, అ అడవి అవతలి పక్క విమానాల రన్వే. అ అడవి లోపలకు వెళ్లి ఒక చెట్టుకింద కూర్చుని, వచ్చి పోయే విమానాలను చూస్తూ ఉండడం నాకు అలవాటు. నేను ఏకాంతంగా ఉన్నా, నన్ను నిరంతరం తాకుతూ తనలో ఒక భాగం చేసుకునేది అ చల్లటి అడవి గాలి. అలా కుర్చున్నానో లేదో ఇంతలోనే ఒక పెద్ద విమానం నా తలపై నుండి ఎగురుతూ మా ఊరి విమానాశ్రయం వైపు వెళ్ళసాగింది.
అ విమానం ఎక్కి మన దేశం వెళ్తే ఎంత బాగుండు అని అనిపించింది నాకు! విమానం దిగినెమ్మటే నా సొంత ఊరు వెళ్లి నా వాళ్ళందరిని కలుసుకుంటే బలే ఉంటుంది కదా? మా ఊరి సముద్రాన్ని పలకరించి ఎన్ని రోజులు అయిందో! అయినా నా పిచ్చి గాని అ సముద్రం నన్ను గుర్తు పడుతుందా? సముద్రం సంగతి కొంచెం సేపు పక్కనపెడితే నా స్నేహితులు ఎలా ఉన్నారు? నాతో మాట్లాడతారా?
Image:[1]
ఎందుకో నా మనసు నా స్నేహితులు నాతో మాట్లాడరేమో అని చెప్పింది. దీనికి ఒక కారణం నాకు స్నేహాన్ని నిలిబెట్టుకోవడం చేతకాకపోవడం. ఇందుకు కారణాలను నేను విశ్లేషించుకోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాను! ముక్యంగా నాకు జీవితం పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండడం, ఒక వేళ నా స్నేహితులతో అభిప్రాయభేదాలు వస్తే నేను ఇబ్బందిపడి ఇక వారితో మాట్లాడడం పూర్తిగా మానివేయడం ఒక ముఖ్యమైన కారణంగా నాకు తోచింది.
ఉదాహరణకు ఒక స్నేహితుడు “ఏరా జీతం ఎంత వస్తుందేంటి ? ఇళ్ళేమన్నా కొన్నావా లేదా అనే ప్రశ్న వేసాడు. తరుచుగా ఇలాంటి నా వ్యతిగత ఆర్థిక లావాదేవీలు అడుగుతుండేవాడు లేదా తాను తీసుకున్న నిర్ణయాలు చెపుతుండేవాడు . నాకు డబ్బు పట్ల గౌరవం ఉంది కానీ జీవితం అంతా లావాదేవీలు లెక్కపెట్టుకుంటూ నేను కూర్చోలేను. నాకు ఆర్థికపరమైన అంశాలమీద ఆసక్తి లేదు. నేను వాడితో మాట్లాడి ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఇలా నాకు చాలా మందితో అభిప్రాయ భేదాలు రావడం, కొన్ని సార్లు వారు నాకు విచిత్రంగా అనిపించడమో లేక నేను వారికి విచిత్రంగా అనిపించడమో జరుగుతుండేది. అందుకని నాకు స్నేహితులు లేరు, లేదా నన్ను స్నేహితునిగా నాకు తెలిసినవారు అంగీకరించలేదు!
ఒక రొజు ఎపిక్యురస్ (Epicurus ) ఫిలాసఫీ చదువుతున్నపుడు తాను చెప్పిన ఒక విషయం నన్ను చాలా ఆకర్షింది. ఎపిక్యురస్ జీవితంలో maximizing pleasure & minimizing pain[2] మీద అనేక ఆలోచనలను చేసి, అ ఆలోచనలను చాలా వరకు ఆచరణలో పెట్టాడు. జీవితంలో ఆనందంగా గడపడానికి అతి సాధారణమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని, చుట్టూ మన మనసుకు నచ్చిన స్నేహితులతో గడపాలని చెప్పాడు. స్నేహం జీవితంలో చాలా ముఖ్యమైనది అని చెప్పాడు. తాను చెప్పినట్టుగానే తన జీవితాంతం సాధారణమైన బట్టలు , రెండు బ్రెడ్ ముక్కలతో బ్రతికాడు. అంతేకాక తన మనసుకు నచ్చిన స్నేహితులతో గడపడానికి ఊరి చివరిలో “The Garden of Epicurus” ని స్థాపించి, గొప్ప తత్వ ఆలోచనలు తన స్నేహితులతో పంచుకున్నాడు. స్నేహంతో సహజీవనం చేసాడు.
నా జీవితంలో Epicurus లాగా నేను కూడా “The Garden of Rationalism & its Philosophy” ను స్థాపించాలను అని ఒక ఆలోచన! ఎక్కడో ఊరి చివర్లో చిన్న గార్డెన్, అందులో నా మనసుకు నచ్చిన మిత్రులతో కలసి జీవితం మీద మాకున్న తత్వాన్ని చర్చిస్తూ, స్నేహాన్ని ప్రతిక్షణం ఆస్వాదిస్తూ ఆనందంగా చనిపోవాలని ఉంది!
అన్నట్టు మరిచిపోయాను ఊరి చివర ఈ అడవి ప్రదేశంలోకి నేను ఎప్పుడు వచ్చినా, నా ఆలోచనలు పైన వినమనం లాగానే తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాయి! ఇక ఇంటికి వెళ్లే సమయం వచ్చింది.
ఉంటాను.
మళ్ళీ తొందరలోనే మాట్లాడుకుందాం.