శాస్త్రీయ రంగం లో మహిళలు

ఇస్రో చంద్రయాన్ -2 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలలో దాదాపు 30% మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ మిషన్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మహిళా శాస్త్రవేత్తలు ముత్తయ్య వనితా మరియు రీతూ కరిదా గారు. ముత్తయ్య వనితా గారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే రీతూ కరిదా గారు ఏరోస్పేస్ ఇంజనీర్. వీరిరువురికి ఇస్రో లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది.

మన దేశ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గారు ఫిబ్రవరి 28, 2020 ( సైన్స్ దినోత్సవ వేడుకలలో) మాట్లాడుతూ, చంద్రయాన్-2 మిషన్ ను పరిశీలించడానికి ఇస్రో వెళ్లినప్పుడు “ఒక మహిళా శాస్త్రవేత్త తన 6 నెలల చంటి బిడ్డను వదిలి పరిశోధన కోసం ల్యాబ్ కి వచ్చి పనిచేసింది, అలాంటి మహిళా శాస్త్రవేత్తలు మన ఇస్రో లో ఉండడం మనందరికీ గర్వ కారణం” అని చెప్పుకొచ్చారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం.

అయితే శాస్త్రీయ రంగం లో మహిళల సంఖ్యకు సంబంధించి కొన్ని రిపోర్టులో వచ్చిన గణాంకాలను, కొన్ని వాస్తవాలు చూద్దాం:

UNESCO ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ (అంతర్జాతీయ సంస్థ) గణాంకాల ప్రకారం ప్రపంచం అంతటిలో 30% శాతం మంది మాత్రమే మహిళలు రీసెర్చ్ రంగంలో ఉన్నారని తెలిపింది. అందులో కూడా ఫిజిక్స్ మరియు ఇంజనీరింగ్ రంగాలలో ఈ శాతం ఇంకా మరీ తక్కువుగా ఉందని పేర్కొన్నది. ఇంత తక్కువ శాతంకు చాలా కారణాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆఫీస్ ప్రదేశంలో భద్రత, లైంగిక వేదింపులు , లింగవివక్ష మొదలగునవి ఉన్నాయని పేర్కొంది

ఇక మన భారత దేశ గణాంకాలు కనుక మనం తీసుకుంటే, ఆశ్చర్యకరంగా కేవలం 15 % మహిళలే రీసెర్చ్ రంగంలో ఉన్నారు (ఈ సంఖ్య మన దేశ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గారు ఫిబ్రవరి 29, 2020 సైన్స్ దినోత్సవ వేడుకలలో తెలిపారు). ఇది చాలా ఆలోచింపదగ్గ విషయం. ఇది దేశ ప్రగతికి ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం 2011 UNESCO రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 14 %, శ్రీలంకలో 39 % మరియు పాకిస్థాన్లో 24 % మహిళా రెసెర్చెర్స్ ఉన్నారని అంచనా వేసింది. ఈ సంఖ్యల్లో కూడా మన దేశ మహిళలు చాలా వెనుకపడి ఉన్నారని మనకు అర్ధం అవుతుంది.

ఇందుకు ముఖ్యమయిన కారణాలు చూద్దాం. పిత్ర్రస్వామ్య వ్యవస్థ మన మానవ చరిత్రలో అడుగడుగునా పాతుకుపోయింది, ఇందులో ఏ దేశానికి మినహాయింపు లేదు. మహిళలకు ఓటు హక్కు రావడానికే కొన్ని సంవత్సరాల పోరాటం, కృషి జరిగింది. అప్పటినుండి మహిళలు మేము దేనిలోనూ పురుషులకు తక్కువకాదు అని ఈ సమాజానికి రుజువు చేస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణ మన దేశ మహిళలు చంద్రయాన్ -2 మిషన్ లో చేసిన ఎనలేని కృషి.

2017 లో నీతి ఆయోగ్ (భారత దేశ సంస్థ) “Status of Women in Science among Select Institutions in India : Policy Implications” అనే రిపోర్టులో మరికొన్ని కారణాలను, వాటిని అధిగమించడానికి కొన్ని సూచలను ఇచ్చింది. అవేంటో చూద్దాం,

ఆడపిల్లలను చాలా వరకు స్కూల్ పాస్ అయ్యాక, కొంత మంది తల్లిదండ్రులు ఆర్థిక కారణాల దృష్ట్యా పై చదువులకు ప్రోత్సహించకపోవడం ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కొంత పై చదువులు చదివినా (ఉదాహరణకు BTech, http://B.Sc, BArch మొదలయినవి), వెంటనే ఉద్యోగానికో, లేక పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవడానికో చదువు మనిపిస్తారు. ఒకవేళ పిల్లల ఆసక్తి మేరకు, తల్లి దండ్రుల ప్రోత్సాహం మేరకు ఎంటెక్ పూర్తి చేసినా, తరువాత శాస్త్రీయ రంగంలోకి వెళ్ళడానికి మొగ్గు చూపడం లేదు. పెళ్లి వయసు రావడం, కుటుంబ బాధ్యతలు పెరగడం దీనికి కొంతవరకు కారణం.ఆడపిల్ల పెళ్ళి ఒక భారంగా భావించినంతవరకు ఈ కారణాలు కొనసాగుతాయి.

కొంతమంది మహిళలు పీహెచ్డీ మొదలుపెట్టి శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో స్దిరపడడానికి కృషి చేసినా, పీహెచ్డీ పూర్తి చేయకుండానే రీసర్చ్ ను మధ్యలోనే ఆపివేయడం జరుగుతుంది. దీనికి మరోసారి పెళ్లి, పిల్లలు, కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు కారణం. ఒకవేళ పీహెచ్డీ పూర్తిచేసిన తరువాత రీసెర్చ్ రంగంలో అనుభవం కొరకు (పోస్ట్ డాక్టరేట్ డిగ్రీ) కొనసాగించకపోవడం గమనించ దగ్గ విషయం.

దీనికి ప్రభుత్వాలు మహిళలకు కొన్ని స్పెషల్ పోస్ట్ డాక్టరేట్ డిగ్రీ స్కాలర్ షిప్లు, పేరెంటల్ సెలవులు, ఉద్యోగ భద్రత, ఉద్యోగం చేస్తున్న రీసెర్చ్ ఇంస్టిట్యూట్స్లో మహిళల పిల్లలకు డే కేర్ సెంటర్లు, ఒకవేళ భర్త భార్య రీసెర్చ్ లో ఉంటె వారికీ ఒకే ప్రాంతంలో ఉద్యోగం మొదలయినవి చేయవచ్చు. దీనికి తోడు ఆడపిల్లల తల్లి దండ్రులకు సెమినార్లు నిర్వహించడం లాంటివి. ఆడపిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని నింపడానికి సెమినార్లు మన సమాజంలో చాలా అవసరం.

ఇండియన్ అకాడమీ అఫ్ సైన్స్ సంస్థ ప్రచురించిన లీలావతి (Lilavati’s Daughters: The Women Scientists of India) అనే పుస్తకంలో మన దేశం నుండి ప్రఖ్యాతిగాంచిన మహిళా శాస్త్రవేత్తల ఆటో బయోగ్రఫీలను పొందు పరిచింది. అందులో ముక్యంగా వారి కఠోర దీక్షతో పాటు కుటుంబ సభ్యులనుండి ప్రోత్సాహం, భర్తనుండి , పిల్లలనుండి, అత్తమామల నుండి ప్రోత్సాహం వలన వారి కలను సాఫల్యం చేసుకున్నారని తెలిపారు. కొంతమంది చంటి పిల్లలను తీసుకుని తమ రీసెర్చ్ ల్యాబ్ లో పరిశోధనలు జరిపారని తెలియజేశారు. మన ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరిచినా, మార్పు మన నుండే మొదలవ్వాలి కదా? మన అక్కకు, చెల్లికి, భార్యకు, కూతురికి మనం ఇచ్చే చిన్న భరోసా ఎంతో మంది ముత్తయ్య వనితా, రీతూ కరిదాలను తయ్యారు చేసి మన దేశ ప్రగతికి తోడ్పడుతుంది. అయినా మన సమాజానికి ఆడ మగ అనే భేదం తెలుసు గాని, జ్ఞానానికి, విద్యకు తెలుస్తుందా?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x