వేసవి సెలవలంతా నేను లెక్కల పరీక్షలో గట్టుఎక్కుతానా లేదా అనే ఆలోచనతోనే ఎక్కువగా గడిచిపోయేవి.
ఒక ముఖ్యమైన అనుభవం మీతో పంచుకోవాలి. ఈ అనుభవం నా ఆత్మకథలో రాద్దాము అని అనుకున్నాను. కానీ రైటర్స్ బ్లాక్ వళ్ళ ఇంతవరకు అది మొదలుపెట్టలేదు అనుకోండి, అది వేరే విషయం.
ఇక మొదలుపెడదాం, వీడు జీవితంలో ఎందకు పనికివస్తాడు అనే ఒక మానసిక సంఘర్షణతో కొట్టుమిట్టులాడుతున్న మా నాన్నగారి మొహం క్లోజ్ అప్ నుండి మొదలవుతుంది ఈ సీను. స్కూల్ లో అందరు బాగా చదివి మంచి మార్కులు తెచుకుంటుంటే, నేను మాత్రం ఎందుకు చదవాలో అర్ధంకాని తటస్థస్థితిలొ చిన్న సైజు గజినీ లాగ ఉండేవాడిని. నన్ను చూసి మా నాన్నగారు తనకు స్వాతిముత్యంలో కమలహాసన్ పుట్టేడేమో అని అనుకుని ఉండొచ్చని నా భలమైన అనుమానం.
ఎనిమిదో తరగతి వేసవిసెలవల్లో మా ఊరి చెరువులో చేపలు పడుతున్నారంటే వెళ్లాను. అక్కడ మా ఊరిలో వాళ్ళు జాలర్ల డబ్బాల్లో ఒక్కొక చేపను చూస్తూ, అది భంగారుపాపా? కొరమేనా? లేక ఇంకేమన్నా రకమా అని అఖిల పక్ష రౌండు టేబులు సమావేశాలలో చర్చించుకున్నట్టు చర్చించికుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడ ఒక పెద్దాయన పని చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, డబ్బాల్లో ఉన్న చేపలను బండిలో ఎక్కించాలి , అలా చేస్తే మూడు చేపలను ఇస్తాను అన్నాడు.
అప్పుడే కమల్ హాసన్ కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. నేను ఇప్పుడు పని చేసి, అ మూడు చేపల్ని మా లెక్కల పంతులుకి ఇస్తే నా మీద కనికరంతో కూడిన జాలిని ఏమైనా చూపిస్తాడేమో అని. పూర్వం ఓ రాజు ఏడుచేపల వేటకు వెళ్లినట్టు నేను కూడా అనుకునున్నట్టుగానే మూడు చేపల కోసం బాహుబలిలో ప్రభాస్ లాగా డబ్బాను భుజం మీద ఎత్తుకుని బయలుదేరాను (ఇక్కడ బాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదంతే!). పని ముగించుకుని, మూడు చేపల్ని మా పంతుల దగ్గరకు వెళ్లి ఇచ్చెసివస్తాను అని మా నాన్నకు చెప్పాను. విషయం అర్ధమైన మా నాన్నగారు, వీడు స్వాతిముత్యం కమలహాసన్ కాదు, ఎర్రగులాబీ కమల్ హాసన్ అన్నటుగా ఒక లుక్ ఇచ్చారు.
అనుకున్నట్టుగానే పంతులికి మూడు చేపలు ఇచ్చాను. ఇక మిగిలిన సెలవులంతా పాస్ అవుతానా లేదా అనే ఆలోచన లో బ్రతికేసాను. ఫలితాలలో మనం యధావిధిగా లెక్కల్లో ఫెయిల్. ఆ రోజు అర్ధమయ్యింది , చేపలు తిమింగలాలు అయ్యి నన్ను బంగాళాఖాతంలోకి ఈడ్చుకెళ్లాయని. మా నాన్నగారు ఏమంటారో అన్న భయంతో విషయం చెప్తే, పర్లేదు లేరా జీవితంలో కనీసం చేపలు పట్టుకుని అన్న బ్రతకగలవ్ అని ఒక మంచి డైలాగ్ విసిరారు. మా నాన్నగారిలో ఒక మంచి వ్యంగ్య రచయత ఉన్నాడని ఆ రోజే మనకు అర్ధమయింది. ఇక వేసవి సెలవుల్లో ఎప్పుడు చేపల వేటకు వెళ్లొద్దు అని నిర్ణయం తీసుకున్నాను.
అలా లెక్కల చంద్రముఖితో నా వేసవిసెలవలంతా “పారాయ్” అయ్యేవి అనమాట!