మీరు పాకిస్థాన్ నుండా? లేదు ఇండియా నుండి! మా రైలు ప్రయాణం లో రెండు నిముషాల నిశ్శబ్దం.
మూడు సంవత్సరాల క్రితం నేను, మా శ్రీమతిగారిని కలవడానికి, ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt am Main) నుండి తను పీహెచ్డీ చేస్తున్న నగరం హాంబర్గ్ (Hamburg) కి బయలుదేరా. ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటలు. రైలు బయలుదేరే అయిదు నిముషాల ముందు రైల్వే స్టేషన్ కు చేరాను. నేను ఎక్కవలసిన రైలు ఏ ప్లాట్ఫారం మీద ఉందొ చూసుకుని, రిజర్వు చేసుకున్న భోగిలో ఎక్కాను. సీట్ పైన నా bag పెట్టి, నా లాప్టాప్ (laptop) తీసి వైఫై (Wifi) కనెక్ట్ చేసి నా పని చేసుకుంటున్న.
నా ఫోన్ మోగింది, ట్రైన్ ఎక్కావా అని మా శ్రీమతిగారు అడిగారు. ఎక్కాను, ఇంకో నాలుగున్నర గంటల్లో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసాను. నా పనిలో పడిపోయి, తరువాత స్టేషన్ వచిoదన్న (సుమారు గంట తరువాత) సంగతే మర్చిపోయాను. ట్రైన్ మరళ బయల్దేరింది, ఈ లోపల ఒక చిన్న కుటుంబం, రెండు సంవత్సరాల పాప, తన తల్లి తండ్రులు నా ఎదుట సీట్లలో వచ్చి కూర్చున్నారు. వారి సామాన్లు సర్దుకున్నాక వారి సీట్లల్లో కూర్చున్నారు. మా సీట్ల అమరిక ఇలా వున్నాయి!
కొంతసేపటికి నా ఎదురుగా కూర్చున్న పాప నన్ను చూడసాగింది. పాప నన్ను చూస్తున్న చూపుకి, బహుశా బూచోడిని చూస్తున్నాను అని అనుకుంటుందేమో అనే సందేహం నాకు కలిగింది. కొంచెం సేపు తర్వాత ఆ పాపను చూసి చిన్న నవ్వు నవ్వాను. తను కూడా నవ్వింది. మరళ నేను నవ్వాను, ఆ పాప ఇంకా గెట్టిగా నవ్వింది. ఆలా కొంచెం సేపు నవ్వుకున్నాము ఇద్దరమూ. కొన్ని సార్లు నా ముఖం లాప్టాప్ స్క్రీన్ (laptop screen) మధ్యలో దాచిపెట్టి, ఒక్కసారిగా మల్లి తన వైపు చూస్తే, ఇంకా బిగ్గరగా నవ్వ సాగింది. కొంతసేపటికే నేను ఆ పాప మంచి స్నేహితులం అయ్యాము.
ఈ లోపల పాప వాళ్ళ నాన్నగారు, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు అని అడిగారు. నేను హాంబర్గ్ (Hamburg) కి వెళ్తున్నానండి అని చెప్పాను. వారు ఎక్కడి దాకా వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఆ పాప వాళ్ళ అమ్మగారు హిందీ లో చెప్పారు. మీరే ఎం చేస్తుంటారు అని నన్ను వారిద్దరూ అడిగారు. నేను ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) యూనివర్సిటీ లో పీహెచ్డీ చేస్తున్నాను, మా సతీమణి గారి దగ్గరకు వెళ్ళ్తున్నాను రెండు రోజులు ఉండడానికి అని చెప్పాను. అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. తరువాత వారు మీరు పాకిస్థాన్ నుండా? అని అడిగారు! నేను, కాదండి ఇండియా నుండి అని చెప్పాను. తరువాత వారు ఒకరి మొకం ఒక్కరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. రెండు నిముషాల నిశ్శబ్దం..
ఏమి మాట్లాడడం లేదు ఏంటి అని నేను మరో నిముషం ఆగి, మీ పాప చాల అందంగా ఉంది అండీ అని అన్నాను. వారిద్దరూ ఒక్కసారి నవ్వేసి, వాళ్ళ పాప చేసిన అల్లర్లు, పాప తాతగారి ఇంట్లో (పాకిస్థాన్ లో ), పెద్దవాళ్ళు చేసే గారాబం, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడారు. మా ప్రయాణ గమ్యం వచ్చేసిందని మాకు అంతు పట్టలేదు (మాటలలో బాగా లీనం అయిపోవడం వలన, ఎంత వరకు అంటే, మీ జీతం ఎంత, మీ అవిడ జీతం ఎంత అని వారు అడిగేవరకు!).
దిగిపోయేముందు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు. నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. తరువాత రోజే మా ఇంటికి కార్ వేసుకొని వచ్చి, అయిన వారి ఇంటికి తీసుకెళ్లారు. నేను నా శ్రీమతి గారు ఆ పాప తో రోజంతా గడిపాము. ఇక వంటకాలంటారా, గుమగుమలే! వారు చేసిన లాహోర్ స్వీట్స్ చాలా రుచి కరంగా ఉన్నాయి. మంచి ఫామిలీ ఫ్రెండ్స్ అయ్యాం, ఇప్పటికి అప్పుడపుడు వారి ఇంటికి వెళ్లి గడుపుతుంటాం. ఈ రైలు ప్రయాణం నేను మర్చిపోలేనిది.
ధన్యవాదాలు,
ప్రవీణ్ కుమార్.
Foot Notes:
bahn.com – your mobility portal for rail travel throughout Germany and Europe
DB stands for Deutsche Bahn (German Train)