పౌర విమానయాన రంగంలోని ప్రమాదాలతో పోల్చుకుంటే హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అని ఉత్తర అమెరికాకు చెందిన సంస్థ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు[1] (NTSB) అంచనా వేసింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) రవాణా రంగంలో నెలకొన్న ప్రమాదాలను సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలను అందచేస్తుంది. అలాగే బవిషత్తులో ప్రమాద నివారణకు తగు సూచనలను ప్రతిపాదిస్తుంది. అయితే NTSB సంస్థ కేవలం ఉత్తర అమెరికాలో సంభవించిన ప్రమాదాలనే విచారిస్తుంది.
మన దేశంలో ప్రముఖ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్[2] (DGCA) విమాన ప్రయాణాలకు సంబందించిన ప్రమాదాలను దర్యాప్తు చేసి బవిషత్తులో ప్రమాద నివారణలకు సూచనలు జారీచేస్తుంది. అయితే DGCA సంస్థ మన భారత రక్షణ శాఖకు సంబందించిన విమాన/హెలికాప్టర్ ప్రమాదాలను దర్యాప్తు చేయలేదు. మన భారత రక్షణ శాఖకు సంబందించిన వాయుశాఖ నిపుణుల బృందం విమాన/హెలికాప్టర్ ప్రమాదాలను అంతర్గత విచారణ జరుపుతుంది.
పౌర విమానయాన రంగం కంటే హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఎందుకు ఉంటుంది?
- సాధారణ విమానాలతో పోల్చుకుంటే హెలికాప్టర్ రూపకల్పన చాలా క్లిష్టమైనది (complex mechanical design). ముఖ్యముగా మెయిన్ రోటార్ మరియు టైల్ రోటార్ వేగంగా తిరుగుతుండడం (టార్క్ స్పీడ్) వలన హెలికాప్టర్ తీవ్రమైన వత్తిడికి గురి అవుతుంటుంది .
చిత్రం క్రెడిట్[3]
- క్లిష్టమైన మెకానికల్ వత్తిడుల కారణంగా హెలికాప్టర్ను ఎప్పటికప్పుడు మెయింటనెన్స్ ఇంజనీర్స్ పరీక్షించడం చాలా ముఖ్యం. ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు ఈ మెయింటనెన్స్ సరిగా లేనందున జరుగుతూ ఉంటాయి.
- విమానాలతో పోల్చుకుంటే హెలికాప్టర్లని క్లిష్టమైన ప్రాంతాలకు చేరుకోవడనికి వాడుతుంటారు. పైగా హెలికాప్టర్లు భూమికి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వలన ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.
- ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనేక హెలికాప్టర్ ప్రమాదాలకు దారితీసాయి. హెలికాఫ్టర్ భూమికి తక్కువ ఎత్తున ప్రయాణించడం వలన సాధారణ విమానంతో పోల్చుకుంటే అధికమైన ప్రతికూల వాతారణం ఎదురుకోవలసి ఉంటుంది. ముఖ్యముగా కొండలలో ప్రయాణిస్తున్నప్పుడు గాలి తీవ్రతను , గతిని, మేఘాలను, మంచును తట్టుకుంటూ ముందుకు ప్రయాణించవలసి వస్తుంది.
- తక్కువ ఎత్తులో ప్రయాణించడం వలన కరెంటు తీగలను, టెలిఫోన్ తీగలను, ఎత్తైన భవనాలను, కొండలను తపించుకుంటు పైలట్ హెలికాప్టర్ ను నడపవలసి వస్తుంది. ఇందుకు పైలట్ అనుభవం, నైపుణ్యం, చాకచక్యం చాలా అవసరం. అధిక ప్రమాదాలు ఇలాంటి సందర్భాలలో జరుగుతుంటాయి. పైలట్ నైపుణ్యం కూడా హెలికాప్టర్ ప్రమాదాల కారణాలలో ఒక ముఖ్యమైన చెప్పుకోదగ్గ కారణం.
మనదేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు ఎలా జరిగాయి?
నేను స్వయంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నాకు ప్రమాదాల కారణాలను అన్వేషించడం ఒక కుతూహులం. హెలికాప్టర్ మెకానిక్స్ నాకు ఇష్టమైన సబ్జెక్టులలో ఒకటి. ఈ ప్రశ్న చూడగానే నేను DGCA సంస్థవారు విడుదల చేసిన అనేక రిపోర్టులను[4] చదవడం మొదలుపెట్టాను. దురదృష్టవశాతూ DGCA వారు డేటాను సులువైన మార్గంలో ఇవ్వకపోవడం వలన నా పని చాలా ఎక్కువయ్యింది. ఉదాహరణకు NTSB వారు ఒక Excel షీటులో డేటాను ప్రజలకు అందచేస్తారు. అలాంటి సౌకర్యం DGCA లో లేనందున, నేను రిపోర్టులు అన్ని చదివి స్వయంగా డేటాను తయ్యారు చేసుకోవలసి వచ్చింది. ఈ డేటా తీసుకుని స్వయంగా కొంత పరిశోధన చేశాను. ఇందులో నాకు అర్ధమయిన ముఖ్యమైన విషయాలు.
- DGCA వారు 1960 నుండి 2011వ సంవత్సరం వరకు మన దేశంలో జరిగిన ప్రమాదాలను దర్యాప్తు చేసి నివేదికలు అందచేశారు. దురదృష్టం ఏంటంటే 2012 నుండి వారి నివేదికలను వారు వెబ్సైట్స్లో ఇంకా పెట్టలేదు (2012 నుండి కొన్ని చెదురు-మొదురు జరిగిన సంఘటనలు తప్ప ). బహుశా ఇంకా ప్రమాదాలను దర్యాప్తు చేస్తున్నారేమో.
చిత్రం క్రెడిట్[5]
- మొత్తం 145 ముఖ్యమైన ప్రమాదాలను DGCA తమ నివేదికలో పొందు పరచడం జరిగింది. ఇందులో చెప్పుకోదగ్గ నివేదికలు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం, లోకసభ స్పీకర్ బాలయోగి గారి హెలికాప్టర్ ప్రమాదం మొదలైనవి. వాటిగురించి మనం తరువాత చర్చించుకుందాం.
- హెలికాప్టర్ ప్రమాదాలకు కారణాలు నేను ముఖ్యముగా ఈ కింద విదంగా విభజించాను.
- మెకానికల్/మెయింటెనెన్స్
- పైలట్ తప్పిదం
- ప్రతికూల వాతావరణ పరిస్థితులు
- నిర్మాణం ఉన్న ప్రదేశాలలో ప్రమాదాలు (తీగలు మొదలైనవి)
- తెలియని కారణాలు
- మొత్తం 145 హెలికాప్టర్ ప్రమాదాలలో, 77 ప్రమాదాలు పైలట్ తప్పిదాలుగా, 43 మెకానికల్/మెయింటనెన్స్ లోపాలుగా, 24 ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, 22 నిర్మాణం ఉన్న ప్రదేశాలలో ప్రమాదాలుగా నిర్దారించబడినవి. ఇందులో పాఠకులు గమనించవలసినది ప్రమాదాల కారణాల సంఖ్య కూడితే మొత్తం 145 హెలికాప్టర్ ప్రమాదాలకంటే ఎక్కువ వుంటుంది. దీనికి కారణం కొన్ని సందర్భాలలో పైలట్ మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితి రెండు కారణం ఆవొచ్చు, లేదా మెకానికల్/మెయింటనెన్స్ లోపాలు మరియు పైలట్ తప్పిదాలు అవ్వవచ్చు. ఈ విషయాలను సులువుగా అర్ధం చేసుకోడానికి నేను Excel లో ఈ చిత్రపటం తయ్యారు చేశాను. ఈ చిత్రం ప్రమాదాలకు కారణాల శాతాన్ని సూచిస్తుంది.
PC credits: Praveen Kumar, plotted in Excel
Data Source: DGCA
- ఇందులో ముఖ్యముగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే 1990 కంటే ముందు ఎక్కువగా హెలికాఫ్టర్లు వ్యవసాయ పొలాలలో మందులు చల్లడానికి ఉపయోగించేవారు. ఇందు కారణంగా అనేక ప్రమాదాలు హై టెన్షన్ తీగలకు హెలికాఫ్టర్ తగిలి, పైలట్ తప్పిదాల వలన జరిగినవి. ఎక్కువ శాతం విసువల్ ఫ్లైట్ రూల్స్ (VFR ) అమలులో ఉన్నపుడు సంబవించినవి. అంటే పైలట్ క్యాబిన్లో ఉన్న సాంకేతిక పరికరాలను ఉపయోగించకుండా బయటకు చూసి నడిపే విధానాన్ని VFR అంటారు. ఒకవేళ పైలట్ విసిబిలిటీ తక్కువ ఉన్న పరిస్థితుల్లో IFR , అంటే ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ అనుగుణంగా సాంకేతిక పరికరాల సహాయంతో హెలీకాఫ్టర్ను నడపవలసి ఉంటుంది.
- ఎప్పుడైతే హెలికాప్టర్ ప్రయాణాలు అందరికి అందుబాటులోకి వచ్చాయో అప్పటినుండి ఎక్కువగా పైలట్ లేదా వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవించాయి (సుమారు 1995వ సంవత్సరం తరువాత) .
- 2001 వ సంవత్సరంలో Dauphin helicopter VT-ELA అరుణాచల్ ప్రదేశ్ కొండలలో ప్రతికూల వాతావరం, విసిబిలిటీ తక్కువగా ఉన్న కారణంగా కొండను ఢీకొంది[6]. ప్రయాణికులకు , పైలట్లకు తీవ్రగాయాలు అయ్యాయి.
- 2002 వ సంవత్సరంలో Bell 206 Helicopter VT –-DAP గౌరవ లోక్ సభ స్పీకర్ బాలయోగి గారిని భీమవరం నుండి హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో ప్రతికూల వాతావరణం, తక్కువ విసిబిలిటీ కారణంగా, కొవ్వాడలంక దగ్గర ఒక చెరువులో ముందస్తు ప్రణాళిక లేని లాండింగ్ కు పైలట్ విఫల ప్రయత్నం చేసి తిరిగి గాలిలోకి ఎగిరే ప్రక్రియలో చెరువు నీళ్లు తగిలి ప్రమాదం సంభవించిందని DGCA నివేదికలో తెలిపింది[7].
- 2009 వ సంవత్సరంలో Bell 430 Helicopter VT-APG – గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తుండగా, బేగంపేట విమానాశ్రయం నుంచి 08:38 IST బయలుదేరి ప్రతికూల వాతావరణంలోకి ప్రవేశించింది. ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ హెచ్చరిక సంకేతాలతో పైలెట్లు సతమతవుతున్న క్షణంలో, తీవ్రమైన గాలివత్తిడికి హెలికాప్టర్ నల్లమల అడవులలో కుప్పకూలింది[8] .
- 2011 వ సంవత్సరంలో Ecureuil AS 350 B3 హెలికాప్టర్ – గౌరవ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తరన్గ్ నుండి ఇటానగర్ ప్రయాణిస్తుండగా, ప్రతికూల వాతావరణం కారణంగా కొండలలో గోర ప్రమాదానికి గురి అయ్యింది. దీనికి పైలెట్ల కూడా కొంతవరకు కారణం కావొచ్చు[9] .
దీనిద్వారా పైలట్లు కొండ ప్రాంతాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను సరిగా అంచనా వేయడం లో విఫలం చెంది, IFR ఫ్లైట్ రూల్స్ పరిస్థితుల్లో ప్రమాదానికి గురి అవుతున్నారని అర్ధం అవుతింది. బహుశా 2021 ఊటీలో జెన్. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ఇలాంటి పరిస్థితులే కారణం కావొచ్చు.
- చివరిగా ఒక్కసారి మనం 1995 నుండి 2011 వ సoవత్సరం వరకు సంవత్సరానికి ఎన్ని హెలికాప్టర్ ప్రమాదాలు సంబవించాయో ఈ చిత్రం ద్వారా చూదాం. ఈ చిత్రం R language ఉపయోగించి నేను తయ్యారు చేసినది. డేటా DGCA నుండి తీసుకున్నది.
PC credits: Praveen Kumar , plotted in R-language
Data Source: DGCA
- ఈ చిత్రం ద్వారా 1995 నుండి 2011 వ సంవత్సరం వరకు మన దేశంలో హెలికాప్టర్ ప్రమాదాలు పెరుగుతున్నవి అని అర్ధం చేసుకోవచ్చు (ఎరుపు రంగు గీత పెరుగుతున్న ప్రమాదాలకు సంకేతం).
- హెలికాఫ్టర్ల సంఖ్య పెరుగుతున్నందున ప్రమాదాలు పెరుగు తున్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ NTSB వారి నివేదిక ప్రకారం ఉత్తర అమెరికా లో హెలికాఫ్టర్ల ప్రమాదాల సంఖ్య సంవత్సర-సంవత్సరానికి తగ్గుతూ వస్తుందని అంచనా. అయితే మనం దేశంలో ఎందుకు పెరుగుతున్నాయి ? దీనికి నేను సమాధానం చెప్పలేను.
- ప్రభుత్వం , ఏవియేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక సమగ్ర విచారణ జరిపి భవిషత్తులో ప్రమాదాల నివారణకు కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
ఇక మన దేశ రక్షణ శాఖ వారు ప్రమాదాల సంఖ్య , వాటి కారణాలు ప్రజలకు దాదాపు తెలియచేయరు కాబట్టి , వారు మరింత పారదర్శికంగా ఉంటూ, కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వాల సహాయంతో అమలు పరచకపోతే, మనం మరిన్ని ప్రమాదాలకు సాక్షులం అవ్వవలసివస్తుందేమో.
References:
[2] Home | Directorate General of Civil Aviation | GoI
[3] International Virtual Aviation Organisation
[4] http://164.100.60.133/aircraft/air-ind.htm
[5] http://164.100.60.133/aircraft/air-ind.htm
[6] http://164.100.60.133/aircraft/air-ind.htm
[7] http://164.100.60.133/aircraft/air-ind.htm
[8] http://164.100.60.133/aircraft/air-ind.htm
[9] http://164.100.60.133/aircraft/air-ind.htm