నేను భరించలేని మిత్రుడు…

అవునండి నా జీవితంలో కూడా ఒకడు ఉన్నాడు. వాడు నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నా ప్రియ మిత్రుడు. కానీ వాడిని భరించడం చాలా కష్టం. నేను ఒకటి తలిస్తే వాడు మరొకటి తలుస్తాడు. వాడితో ఎప్పుడు నాకు చిరాకే. ఇంకా వాడి గురించి మీకు చెప్పేకంటే, మా ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని వాదాలు, ప్రతి వాదాలు, సంఘటనలు చెప్తే మీకు బాగా అర్ధం అవుతుంది వాడి గురించి!

  • చిన్నపుడు జరిగిన ఒక సంఘటన, మా స్కూల్ లో ప్రిన్సిపాల్ ఒక క్రిస్టియన్ సిస్టర్. కొంత బాగానే చదువుతానని ఆవిడకు నేను అంటే మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఒకరోజు నా స్నేహితుడు, ఒరేయ్ ఒకసారి నేను అడిగిన ప్రశ్న నువ్వు ఆవిడను వెళ్లి అడుగు అని నా బుర్ర తినేసాడు. విసుగొచ్చి ఒకరోజు వెళ్లి సిస్టర్ మీరు ఆలోచించేవణ్ని తప్పులే, మీరు పెళ్లి చేసుకునుంటే బాగుండేది అని అనేశాను. అంతే ఆరోజు నుండే మొదలు అయ్యాయండీ నా కష్టాలు వాడివల్ల.
  • ఇంటర్మీడియట్ లో మా నాన్నగారి కొత్త బండి తీసుకొని మా కళాశాలకు వెళ్ళాను. అందరు చూస్తుండగా బండి పెద్దగా రైస్ చేయడం, స్పీడ్ గా నడపడం చేశాను. అదే రోజు సాయంత్రం వాడు వచ్చి నీ అహంకారం ఇవ్వాళ బయటపడింది నువ్వు గమనించావా అని నన్ను అడిగాడు. మీ నాన్న ఏదో లోన్ తీసుకుని అవసరానికి బండి కొంటె నువ్వు పోటుగాడిలా వ్యవహిరిస్తున్నావు! ఒక్కోసారి మీ ఇంట్లో మీ నాన్న డబ్బులేక బాధపడిన సంఘటనలు నీకు గుర్తులేవా? వాడి వేసిన ప్రశ్నలు నాకు వాడంటే భరించలేనంత కోపాన్ని తెపించాయి!
  • ఇంజనీరింగ్ లో ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండేది. తనను చూడాలనే ధ్యాస చాలా ఎక్కువగా ఉండేది. వాడు మళ్ళి నా జీవితంలోకి వచ్చి ఒక్కసారి ఈ సృష్టి మూలం నువ్వు చదివావ? ప్రతి జీవి తన ప్రతిరూపాన్ని నిర్మించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రేమలు, ఆకర్షణలు కలుగుతాయి. ప్రేమించడంలో తప్పులేదు, కానీ ప్రేమను నిలబెట్టుకోవడం కోసం ముందు నీ కాళ్ళ మీద జీవించడం నేర్చుకోవాలి, నీకు ఇంకా అలా జీవించేంత అనుభవం లేదు అని నా బుర్ర తినేసాడు!
  • నాకు అసలు పెళ్లి అవసరమా అని ఆలోచించే సమయంలో వాడు నాతో, ఒక మనిషికి తోడు అవసరం, నీకు మరీ అవసరం అని అన్నాడు. నేనేమో నాకు ఒక్కడిగా ఉండిపోయే మానసిక బలం ఉందని వాదించాను. వాడేమో కొంత ఉంది గాని అది నీకు సరిపోదు అని వాదించాడు. ఇలా నా వాదనకు ప్రతి వాదన చేస్తూ నా ఆలోచనలను ప్రశ్నించి ఇబ్బంది పెట్టేవాడు.
  • సరే పెళ్లి అయింది, అసలు పిల్లలు అవసరమా అని అనిపించేది నాకు. ప్రతి జీవి జీవించడానికి ఎదురీదాలి కదా. మనం అలా ఎదురీదే వచ్చాము కదా? ఇప్పడు వీళ్లు (పిల్లలు) వచ్చి మళ్ళి ఆ కష్టాలను ఎందుకు చూడాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. వాడేమో అలా నీ పేరెంట్స్ అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? అయినా కష్టాలను సమర్థవంతంగా ఎలా ఎదురీదాలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి పిల్లలకు నేర్పించి ప్రయోజకులను చేస్తుంది కదా, నీకు ఆ మాత్రం తెలియదా పిచ్చివాడా అని వాడి వాదన! అలా నన్ను ఆ రోజు తీవ్రంగా విమర్శించాడు.
  • నా మొదటి జీతం వచ్చినప్పుడు, కొంత ఖర్చు పెట్టి కొంత కుటుంబం కోసం దాచిపెట్టాను రా అని వాడికి చాలా గర్వాంగా చెప్పాను! వాడు మళ్ళి ఏదో చెప్పడం మొదలు పెట్టాడు! ఒరేయ్ పిచ్చోడా, నీకోసం ఒక అకౌంట్ తెరిచి, నీ జీతంలో 100 లో పది రూపాయలు కేవలం నీకోసమే అందులో వేసుకో అని చెప్పాడు. దురదృష్టం వెంటాడి, నిన్ను అందరు వదిలేసి ఒంటరి వాడను చేస్తే, ఆ పది రూపాయలే నిన్ను కాపుడుతుంది రా, నువ్వెందో గర్వాంగా నాకు నీ జీతం గురించి చెపుతున్నావ్ అని నా మీద మరో భరించలేని విమర్శ!

అలా నేను ఏది తలంచినా వాడు దానికి నన్ను ప్రశ్నించేవాడు, విమర్శించేవాడు, విసుకు తెపించేవాడు. నాలో సంఘర్షణను రగిలించేవాడు. నేను భరించలేని విమర్శలు చేసేవాడు. కానీ ఇలా ఎన్ని సార్లు జరిగినా వాడ్ని వదిలి పెట్టలేక పోయేవాడిని. అన్నట్టు మరచిపోయాను వాడి పేరు మీకు చెప్పలేదు కదా, వాడి పేరు “నాలోని అంతర్ముఖుడు”. వాడు తప్ప నాకు ఆప్త మిత్రులు ఎవరు లేరు. వాడిని వదలనూలేను, అలా అని భరించనూలేను! ఈ జీవితానికి ఇంతేనేమో.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x