నమస్కారం,
నాపేరు ఆర్థర్ ఫ్లెక్ (Arthur Fleck).
మా అమ్మగారి తో కలసి గోతం (Gotham ) పట్టణములో నివసిస్తుంటాను. నేను జోకర్ గా ఒక్క కంపెనీలో పనిచేస్తున్నాను. మాది చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మగారు, ఎప్పుడు నా ముఖంలో చిరునవ్వు వుండాలని, అందరిని నవ్విస్తూ వుండమని చెప్పారు. మా అమ్మగారిని నేనే చూసుకుంటాను. స్టాండప్ (stand up) కమెడియన్ గా ఎదగాలని చిన్నప్పటి నుండి నా ఆశ. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న .
నా దురదృష్టం ఏమిటంటే నాకు బాగా టెన్షన్ (ఉద్రిక్తత) పెరిగినప్పుడు, గట్టిగా నవ్వేస్తుంటాను (pseudobulbar affect, uncontrollable laugh disorder). ఇది ఒక్క జబ్బు, చాలా అరుదుగా వచ్చే జబ్బు. దీని వలన చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరోజు మెట్రో రైలులో ప్రయాణిస్తున్నాను. అందులో ముగ్గురు అబ్బాయిలు ఒక్క అమ్మాయిని ఏడిపిస్తూ వున్నారు. ఆ బోగీలో నేను ఒక్కడినే ఉన్నాను. ఆ అమ్మాయి నన్నే చూస్తుంది, నాలో చాలా టెన్షన్ మొదలయింది. నాకు నవ్వు తన్నుకుంటూ వచేస్తుంది, ఆపుకోలేకపోయాను. నా నవ్వు చూసి ఆ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళని చూసి నవ్వుతున్నానేమో అనుకుని, నన్ను చావబాదారు. వాళ్లకు నా అనారోగ్యం గురించి చెబుదాం అంటే, నా నవ్వు నన్ను చెప్పలేకపోనిచ్చేది . ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. నా తప్పు లేకపోయినా నన్ను కొట్టడం, తిట్టడం లాంటివి జరిగేవి.
నేను తేడాగా (weird) వున్నానని నా తోటి ఉద్యోగులు నన్ను అక్కడ నుండి పంపించేయాలని నా మేనేజర్ కి చాడీలు చెప్పేవారు. ఒకరోజు నన్ను నా ఉద్యోగం నుండి తీసేసారు. ఒకసారి అవకాశం రావడంతో, నా మొదటి షో లో కామెడీ చేయడానికి వెళ్లాను. కానీ అందరని చూడగానే టెన్షన్, మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాను. నాకు నవ్వు మొదలయింది. ఒక్క జోక్ కూడా చెప్పలేకపోయాను, నేను నవ్వుతూనే ఉండిపోయాను. నా బ్రతుకు ఒక ట్రాజెడీ (tragedy).
ఒకరోజు నేను టీవీ చూస్తుండగా, నా మొదటి కామెడీ షో ను ఏదో ఒక ఛానల్ వాళ్ళు, “ఇతను కామెడీ చేస్తానని, తనలో తను నవ్వుకుంటూనే వున్నాడు, బహుశా అతనికి అదే కామెడీ ఏమో” అని హేళన చేశారు. ప్రపంచమంతా నన్ను చూసి నవ్వుకుంది. నా గుండె పగిలిపోయింది. నా జీవిత ఆశయం, నా బలహీనత వలన అందరికి కామెడీ గా మారిపోయింది. తరువాత, ఒక సందర్భం లో నా తల్లికి చిన్నపుడు ఒక ధనిక వ్యక్తితో సంబంధం వుంది అని, నేను వాళ్లకు పుట్టడంతో , ఆ ధనిక వ్యక్తి మా అమ్మను వెలివేసి, బలవంతంగా సంతకాలు తీసుకున్నాడని తెలిసింది. నేను ఆ ధనిక వ్యక్తి మా నాన్న అని అతని దగ్గరకు వెళ్ళాను, అతను నన్ను కొట్టి బయటకు గెంటేస్తు, మీ అమ్మ ఒక పిచ్చిది అని, అప్పట్లో ఒక పిచ్చి ఆసుపత్రిలో చేర్చాము అని, నన్ను చిన్నపుడు దత్తతు తీసుకుందని చెప్పాడు. నేను ఆ పిచ్చి ఆసుపత్రికి వెళ్లి మా అమ్మ తాలూకా కాయితాలు చూసాను. అందులో తనకు పిచ్చి ఉందని, నన్ను దత్తతు తీసుకుందని, నన్ను తన స్నేహితులు కొడుతూవుంటే చూస్తూ వూరుకుందని, నా నవ్వే జబ్బుకి , నా తల మీద పడిన గాయాలు కారణమని రాసుంది.
“ఇప్పటిదాకా నా జీవితం ఒక ట్రాజెడీ అని అనుకునేవాడిని, కానీ నా జీవితం ఒక పెద్ద కామెడీ అని నాకు ఇప్పుడే అర్ధమయింది”
“I thought my life was a tragedy, but now I realize it’s a comedy!”
“బలహీనుడి జీవితంలో ట్రాజెడీనే కొంతమందికి కామెడీ”
ఉదాహరణకు, ఒక్కడు అరటికాయ తొక్క మీద కాలు వేసి పడ్డాడంటే, కొంతమంది నవ్వుకుంటారు. కింద పడిన వాడి ట్రాజెడీనే కొంతమందికి కామెడీ.
ఈ సమాజంలో వికలాంగుల, అనాధల, ఆడవాళ్ళ, హిజ్రాల, వయసుగల పెద్దవాళ్ళ, వ్యాధి గల, నల్లరంగు గల, లావుగల, సన్నగల, పొట్టిగల, పేదవాళ్ల , స్వలింగ సంపర్కుల, బలహీనుల జీవితాలలో ట్రాజెడీనే కొంతమందికి కామెడీ. కొన్ని సందర్భాలలో జబర్దస్త్ షో లో ఇదే జరుగుతుంది….
ఇట్లు,
నన్ను ఆవహించిన,
ఆర్థర్ ఫ్లెక్ (Arthur Fleck)!
ఈ సమాధానములో, కొంతమంది చేసే కామెడీ చాలామంది ట్రాజెడీ జీవితాల మీదే అని చెప్పే ప్రయత్నం చేసాను. ఆర్థర్ ఫ్లెక్ యొక్క ట్రాజెడీ జీవితాన్ని తీసుకుని, ఈ సమాజం, అతను జీవితం మీద చేసిన కామెడీని వివరించాను.
ఫుట్ నోట్స్:
- జోకర్ సినిమాలో ఆర్థర్ ఫ్లెక్ (Arthur Fleck) వేషం వేసిన Joaquin Phoenix తన నటనకు ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు లభించింది. (Joaquin Phoenix – Wikipedia)
- This article does not judge anyone, it only reflects emotions of Arthur Fleck. It is a carefully researched philosophical view on Comedy and Tragedy. You are free to draw your own conclusions from the story!