ఎయిర్ ఇండియా ఢిల్లీ ప్రయాణికులకు చివరి విజ్ఞప్తి, తమ బోర్డింగ్ పాస్ తీసుకుని 19వ గేట్ దెగ్గరికి వెళ్లవలెను అని చివరి సారి హెచ్చరించింది అక్కడున్న విమానాశ్రయ సిబంది. అప్పటికే సగం నిద్రలోఉన్న నేను, నా బ్యాగును మరొక్కసారి సర్దుకుని విమానం ఎక్కడానికి చిన్న చిన్న అడుగులు వేసాను. చలికాలం కావడంతో నా జాకెట్ పూర్తిగా ధరించి, నిదానంగా విమానంలోకి చేరుకున్నాను. అప్పడు సమయం సుమారు రాత్రి ఎనిమిది కావస్తున్నది. నల్లరంగు ఎలా ఉంటుందో నాకు ఆ చలికాలం-చీకటి చూపిస్తూ బయపెడుతుందేమో అని అనిపించింది విమానం బయటకు చూస్తుంటే!
సమయానికి అందరు ఫ్లైట్ బోర్డు చేసారు, మన ప్రయాణం మొదలుపెడదాం అని కెప్టెన్ అనౌన్స్ చేసారు. ఫ్లైట్ సమయానికి బయలుదేరుతుంది, ఢిల్లీకి బాగానే చేరుకుంటాం అని అనుకుంటూ ఉండగా, విమానంలో గాలి ఆడకపోతే ఏమి చేయాలి, విమానం నీళ్ళల్లో పడితే ఏమి చేయాలని ఎయిర్ హోస్టెస్ నాలో భయాన్ని మరింత పెంచే ప్రయత్నం చేసింది. అంతా బాగానే జరుగుతుందిలే అని నన్ను నేను సర్దిచెప్పుకున్నాను. ఇంతలో ఫ్లైట్ రన్వే మీదకు పాకుతూ చేరుకుంది. ఇంక వేగంగా వెళ్లి గాలిలో ఎగురుతుందని అనుకుంటున్న సమయంలో, తిరిగి విమానం టెర్మినల్ దగ్గరకు చేరుకుంది! ప్రయాణికులు అందరూ ఏమైందా అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా , కెప్టెన్ ఫ్లైట్ నావిగేషన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది , ఇంజనీర్స్ వచ్చి రిపేర్ చేసేంతవరకు ఫ్లైట్ నిలుపుతామని చెప్పారు. ఇంకనయం, విమానం గాలిలో ఎగిరిన తరువాత గనుక నావిగేషన్ పనిచేయడం లేదు అని కెప్టెన్ కి తెలిస్తే మా అందరి పరిస్థితి ఏంటి అనే ఆలోచనే గుండెల్లో వణుకును పుట్టించింది. సుమారు రెండు గంటల రిపేర్ తరువాత , సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి, ఇక ఢిల్లీకి బయలుదేరుదాం అని కెప్టెన్ చెప్పగానే కొంత ఊపిరి పీల్చుకున్నాం.
ఢిల్లీకి సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన నా ఫ్లైట్ నుండి హుటాహుటిన దిగి, ఢిల్లీ విమానాశ్రయ మూడోవ టెర్మినల్ నుండి రెండొవ టెర్మినల్ లో ఉన్న ఇండిగో విజయవాడ ఫ్లైట్ అందుకోవడానికి పరుగులు పెట్టాను. అక్కడ ఉన్న ఇండిగో విమాన సిబంది, మీ ఫ్లైట్ టికెట్ ఏది అని అడగగా, నా జోబులోఉన్న ఫోన్ తీసి చూపెడదాం అనుకునేలోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఫోన్ ఆన్ చేసి , నా విజయవాడ టికెట్ PNR నెంబర్ వెతికి అక్కడ సిబందికి ఇవ్వగానే, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. మొత్తానికి మరలా సెక్యూరిటీ చెక్ చేసుకుని , ఇండిగో విమానంలోకి ఎక్కి కూర్చున్నాను. ఇండిగో ఫ్లైట్ సిబ్బంది కొంత మంది ఇంకా విమానం దగ్గరకు చేరుకొని కారణం చేత విజయవాడ విమానం మరో గంట ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు మిగిలిన విమాన సిబ్బంది. అప్పటికే అలసిపోయిన నేను ఇక చిరాకు పడే ఓపిక కూడా లేకపోవడంతో సీట్ మీద వాలిపోయి కొంచెం సేపు పడుకున్నాను .
విమానం విజయవాడలో దిగగానే, పక్కన కూర్చున్న ఒక ప్రయాణికుడిని అడిగి మా తమ్ముడికి ఫోన్ చేశాను. బయట టాక్సీ ఉంది, ఎక్కి బాపట్ల వచ్చేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మా తమ్ముడు. మొత్తానికి ఆ టాక్సీ తీసుకుని బాపట్లకు బయలుదేరాను. టాక్సీ కృష్ణ నది మీదకు రాగానే, చిన్ననాటి జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. నిజంగా ఎంత అందంగా ఉందో కృష్ణ! సుమారు రెండు గంటల టాక్సీ ప్రయాణం పూర్తిగా చిన్ననాటి తలంపులతో సాగిపోయింది.
దాదాపు 16 గంటల ప్రయాణం తరువాత మా ఇంటికి చేరుకున్న నేను, నిర్జీవంగా సేవపెట్టిలో ఉన్న మా నాన్నను కన్నీరుతో చూసుకుని, చివరి ప్రయాణానికి మా నాన్నను సిద్దపరిచాను.

స్వస్తి
ప్రవీణ్ సేనేక .